సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు అద్దంపట్టనున్న స్థానిక ఫలితాలు
ఈరోజు వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూచాయగా తెలియజేసాయి. అయితే ఇవి ప్రధానంగా నగరాలు, పట్టణాల ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిభింప జేసేవే గనుక, గ్రామీణ ఓటర్ల అభిప్రాయానికి అద్దంపట్టే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ.ఎన్నికల ఫలితాలు రేపు వెలువడిన తరువాత ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతున్నారనే విషయంపై మరికొంత స్పష్టత రావచ్చును.
ఇంతవరకు వెలువడిన అనేక సర్వే నివేదికలు ఈ సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలో తెరాసకు, సీమాంద్రాలో వైకాపాకు తిరుగులేని మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పాయి. కానీ వాస్తవానికి తెలంగాణాలో బహుముఖ పోటీ వలన కాంగ్రెస్, తెరాసలకు మెజార్టీ వచ్చే అవకాశం కనబడటంలేదు. అదేవిధంగా సీమాంద్రాలో తెదేపా, వైకాపాలు విజయం కోసం చాలా తీవ్రంగా పోటీ పడ్డాయి గనుక ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు వెలువడిన ఫలితాలు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, సీమాంద్రాలో తెదేపాలకు సానుకూలంగా ఉన్నాయి. ఒకవేళ రేపు వెలువడే యం.పీ.టీ.సీ., జెడ్.పీ.టీ.సీ. ఎన్నికల ఫలితాలు కూడా ఈవిధంగానే ఉనట్లయితే, అధికారంలోకి రావాలని కలలుగంటున్న తెరాస, వైకాపాల కలలు పగటి కలలుగానే మిగిలిపోయే అవకాశం ఉంది.
కానీ, ఒకవేళ రేపటి ఫలితాలలో తెరాస, వైకాపాలకు ఆధిక్యత వచ్చినట్లయితే, ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాలలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చునని భావించవచ్చును. ఎందువలన అంటే అర్బన్ ఓటర్లు కాంగ్రెస్, తెదేపాలకు, గ్రామీణ ఓటర్లు తెరాస, వైకాపాలకు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసినట్లవుతుంది. రేపటి ఫలితాలు ఏవిధంగా ఉన్నప్పటికీ సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం తధ్యమని ఈ రోజు మున్సిపల్ ఫలితాలు రూడీ చేస్తున్నాయి.