పోలవరంపై కేసీఆర్ మోడీతో బేరమాడబోతున్నారా?
posted on Jun 4, 2014 @ 1:15PM
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఈనెల ఆరున డిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు. ఆ సమావేశంలో పోలవరం ముంపు గ్రామాలపై మోడీ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయమని కోరబోతున్నట్లు సమాచారం. అంతే గాక ఆంధ్రప్రదేశ్ తో బాటు తెలంగాణకు కూడా ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ కల్పించాలని కూడా కోరబోతున్నట్లు సమాచారం.
అయితే ఆ రెండు కోర్కెలు కూడా ప్రధాని మోడీ ఆమోదించే అవకాశంలేదని చెప్పవచ్చును. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ తన ప్రభుత్వం జారీ చేసిన మొట్ట మొదటి ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకొంటే, తమ ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపాతో సంబందాలు దెబ్బ తినవచ్చును. అంతే గాక ఈ విషయంలో వెనక్కి తగ్గితే కాంగ్రెస్ పార్టీ నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అయినా పోలవరంపై గత ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్నే మోడీ ప్రభుత్వం అమలు చేస్తోంది, కనుక ఈవిషయంలో మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదు.
ఇక కేసీఆర్ రెండో కోరిక తెలంగాణకు ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ ఇచ్చేందుకు, సదరు రాష్ట్రం అందుకు అన్ని విధాల అర్హత కలిగి ఉండాలి. కానీ ఆర్ధికంగా పరిపుష్టంగా ఉండి, అన్ని విధాల అభివృద్ధి చెందిన తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్ర హోదాకు ఏవిధంగాను అర్హం కాదు. కనుక ఆ అవకాశం లేదు.
ఈ సంగతి కేసీఆర్ కి తెలియక పోలేదు. అందుకే ఆయన పోలవరం ముంపు గ్రామాల విషయంపై కేంద్రంతో పెచీకి దిగుతున్నారని భావించవచ్చును. పోలవరం పై రగడ చేయకుండా ఉండాలంటే, అందుకు బదులుగా తెలంగాణకు కూడా ‘ప్రత్యేక రాష్ట్ర హోదా’ కల్పించాలని బేరం పెట్టవచ్చును. ఒకవేళ మోడీ ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే సరి. లేకుంటే తెరాసకు చెందిన 11మంది యంపీలు నేటి నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలలో ఆందోళన చేస్తూ సభను స్తంభింప జేసే ప్రయత్నాలు చేయడం తధ్యం.
అయితే లోక్ సభలో తమకు మద్దతు పలికేవారెవరూ లేరనే సంగతి కేసీఆర్ మరిచిపోయినట్లుంది. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44మంది సభ్యులు ఉన్నప్పటికీ, వారి యూపీయే ప్రభుత్వమే పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ సిద్దం చేసింది గనుక, వారెవరూ తెరాసకు మద్దతు ఇవ్వలేరు. అందువల్ల కేసీఆర్ ఈవిషయంలో పంతానికి పోవడం వలన ఆయనకే నష్టం. ఈ సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేసే బదులు, ముంపు గ్రామాలలో నిర్వాసితులకు పునరావాసం, ఆర్ధిక ప్యాకేజీ, వారికి వేరే ప్రాంతంలో వ్యవసాయ భూములు వంటివి కోరితే మోడీ తప్పకుండా అంగీకరించవచ్చును. ఆవిధంగా కోరితే తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీలు కూడా ఆయనకు మద్దతు పలకవచ్చును. కానీ కేసీఆర్ తన అలవాటు ప్రకారం గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకువెళ్తే దానివలన ఆయనకీ, అయన ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుంది.