చంద్రబాబు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉండబోతున్నారా?
posted on Jun 7, 2014 @ 10:46AM
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు బదులు విజయవాడ-గుంటూరు మధ్యగల నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణ స్వీకారం చేయాలని భావించడం, అక్కడే తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే పరిపాలన సాగించాలనుకోవడంతో, అక్కడే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్నారు. అందువల్ల రాజధాని నిర్మాణానికి అనువయిన ప్రాంతాన్ని కనుగొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదనలు చెత్తబుట్ట పాలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రభుత్వ శాఖలను కూడా వీలయినంత త్వరగా అక్కడికే తరలించే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అంటే రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయబోతునప్పటికీ ప్రభుత్వం మాత్రం గుంటూరుకు తరలివస్తున్నట్లు భావించవచ్చును.
అయితే నిన్నతెదేపా తెలంగాణా శాసనసభ్యులతో సమావేశమయిన చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో కూడా తెదేపాను అధికారంలోకి తెచ్చేవరకు తాను హైదరాబాదు విడిచివెళ్లనని అనడం యాదృచికమా లేక నిజంగానే చంద్రబాబు తన మనసు మార్చుకొని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుండే రాష్ట్ర పాలన చేయాలని భావిస్తున్నారా? అనే ధర్మసందేహం పార్టీ నేతలలో తలెత్తింది.
ఆంధ్రప్రదేశ్ లో తెదేపా అధికారంలోకి వచ్చింది గనుక అక్కడ పార్టీ ఇప్పుడు చాలా బలంగా, ఉత్సాహంగా ఉంది. కానీ తెలంగాణాలో ఓటమి కారణంగా చాలా డీలా పడిపోయుంది. పైగా చంద్రబాబు ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నందున, ఇక తెలంగాణాను, అక్కడ తమ పార్టీని పట్టించుకొనే అవకాశాలు తక్కువ అని వార్తలు, విశ్లేషణలు వినబడుతుండటంతో తెలంగాణా నేతలు మరింత డీలాపడిపోయారు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణా నేతలకే చంద్రబాబు అండ చాల అవసరం. అందుకే ఆయన ఇకపై వారంలో ఒకరోజు పూర్తిగా తెలంగాణాకే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. బహుశః అందుకే తాను హైదరాబాదు విడిచివెళ్లనని అని ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ నేతలు మాత్రం దానికి మరో కొత్త భాష్యం చెపుతున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వాన్నిపూర్తిగా తరలించేవరకు హైదరాబాదులోనే ఎందుకు ఉండాలనుకొంటున్నారు అంటే ఆయన హైదరాబాదులో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీలను, ప్రైవేట్ పరిశ్రమలను, ఉన్నత విద్యా, వైద్య సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించేందుకేనని చెపుతున్నారు. అదీగాక సాఫ్ట్ వేర్ రంగంలో అంతర్జాతీయంగా పేరుపొందిన హైదరాబాదుకు నిత్యం అనేకానేక విదేశీ సంస్థల ప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. వారందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆకర్షించాలంటే ముఖ్యమంత్రి వారికి అందుబాటులోనే ఉండటం చాల అవసరమని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కొంచెం కష్టమయినా మరికొంత కాలం హైదరాబాద్ నుండే పరిపాలన సాగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
తద్వారా ఆయనను తెలంగాణాలో పార్టీ నేతలందరూ సులువుగా కలిసేందుకు వీలుపడుతుంది, ఆయన కూడా తెలంగాణాలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకొనే అవకాశం ఉంటుంది అని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏమయినప్పటికీ ఆయన హైదరాబాద్ నుండి ఎంతో కాలం ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని పరిపాలన చేయడం కష్టమనే చెప్పవచ్చును. సచివాలయానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు హైదరాబాదులో, మరికొందరు గుంటూరులో ఉంటూ పరిపాలనకొనసాగించడం వలన వారి మధ్య సమన్వయం లోపించి ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చును. రాష్ట్ర రాజధానితో సహా పూర్తి స్థాయిలో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో, ఆయన రాష్ట్రానికి దూరంగా హైదరాబాదులో ఉండటం అంత సమర్ధనీయం, ఆచరణీయం కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన నిత్యం హైదరాబాద్, గుంటూరు మద్య హెలికాఫ్టార్లలో ప్రయాణాలు చేయడం కూడా ప్రమాదకరం. పైగా దానివలన ఆయనకు మరింత శారీరిక శ్రమ, రాష్ట్రానికి మరింత ఆర్ధిక భారం తప్పదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ నిర్వహణకు అవసరమయిన హంగులన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి రాష్ట్రానికి తరలివచ్చేయడమే మేలు.