బస్తీ మే సవాల్! రఘువీరా
మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఏపీ పీసీసీ అధ్యక్ష పదవి దక్కినప్పట్టికీ, అది సమయం కాని సమయంలో దక్కడం వలన దాని వలన ఎటువంటి ప్రయోజనమూ లేకుండా పోయింది. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడమే కాకుండా, పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకా అయిపోతూనే ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సహజ సిద్దమయిన మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, అభ్యర్ధులు మాత్రమే ఓడిపోయారని ప్రవచించిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “మా ప్రభుత్వ నిర్ణయాలపై తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కమిటీలు వేసుకొన్నా మాకేమి భయం, అభ్యంతరం లేదు. కావాలనుకొంటే సిట్టింగ్ జడ్జీతో కూడా విచారణ చేయించుకోవచ్చును. మాకెటువంటి అభ్యంతరమూ లేదు. నిజానికి తెలుగుదేశం పార్టీ యన్టీఆర్ తోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారు అందరూ నకిలీ సభ్యులే. వారిలో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు. తెదేపా ఇతర పార్టీలవారిని ఆకర్షించి పబ్బం గడుపుకొంటోంది. చివరికి మా పార్టీ యం.యల్సీలను కూడా విడిచి పెట్టడం లేదు. కానీ మా పార్టీ నుండి ఒక్కరు కూడా తెలుగుదేశంలోకి వెళ్లేందుకు సిద్దంగా లేరు. ఒకవేళ ఎవరయినా వెళ్ళదలిస్తే నిరభ్యంతరంగా వెళ్ళవచ్చును. కానీ వెళ్ళే ముందు తమ యం.యల్సీ. పదవులకు కూడా రాజీనామా చేసి వెళితే హుందాగా ఉంటుంది,” అని అన్నారు.
రఘువీరారెడ్డి మేకపోతు గాంభీర్యం మాత్రం అద్భుతంగా ప్రదర్శిస్తున్నప్పటికీ, ఆయన మాటలలో ఆక్రోశం స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఆయన అవునన్నా కాదన్నా అనేకమంది కాంగ్రెస్‌కి చెందిన ఎమ్మెల్సీలు తెదేపాలోకి దూకేసేందుకు క్యూ లో నిలబడి ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ యం.యల్సీ.లు చైతన్యరాజు, రవివర్మ, షేక్ హుస్సేన్, లక్షి శివకుమారి, శ్రీనివాసులు నాయుడు, ఇందిర, రెడ్డప్పరెడ్డి, బీ.పుల్లయ్య చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్ధం స్వీకరించారు. ఇంకా చాలా మంది క్యూలో నిలబడి ఉన్నారు కూడా. రఘువీరా రెడ్డి ఇది చాలా అనైతికమని వాదించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాలలో భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడానికి కూడా వెనకాదలేదనే సంగతి ఆయన ఏవిధంగా మరిచిపోయారు? ఇది అంతకంటే నీచమయిన, దిగజారిన రాజకీయ వ్యూహం కాదు కదా?
రాష్ట్రం విడిపోతోందనే బాధ ఏమాత్రం లేకుండా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పైరవీలు చేయడం అయన మరిచిపోయి, ఇప్పుడు తెదేపాను నిందించడం హాస్యాస్పదం. ఆయన తెదేపా నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ, తమ ప్రభుత్వ నిర్ణయాలపై కమిటీలు వేసి విచారణ చేసుకోమని తొడ గొట్టడం దేనికంటే, తద్వారా కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకే.
ఆయన కోరినట్లుగానే తెదేపా ప్రభుత్వం సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయిస్తే, పార్టీలో ఆయన ప్రత్యర్దులే కాక, కాంగ్రెస్ హయంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం తెదేపా ప్రభుత్వంలో కూడా మంత్రులుగా అధికారం చేప్పట్టిన వారి భూభాగోతాలు బయటపడతాయనే ఆలోచనతోనే రఘువీరుడు బస్తీ మే సవాల్ అని తొడగొడుతున్నారని భావించవలసి ఉంటుంది. అదే నిజమయితే స్వంత పార్టీ నేతలకే ఎసరు పెట్టాలని చూస్తున్న ఆయన చేస్తున్న ఈ రాజకీయం ఎటువంటిది?