కాంగ్రెస్ లో ప్రియాంకా భజన షురూ
posted on Jun 7, 2014 8:01AM
ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలే కారణమని ఆరోపిస్తున్నవారు కాంగ్రెస్ పార్టీలో క్రమంగా పెరుగుతున్నారు. ఆవిధంగా ఆరోపించిన వారినందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేసి, తమపై మరింత ఒత్తిడి పెరగకుండా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తపడుతోంది. కానీ వారిరువురిపై కాంగ్రెస్ నేతల విమర్శలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో ఏదో ఒక మూల నుండి ఎవరో ఒక కాంగ్రెస్ నేత వారిపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఇంతవరకు రాహుల్ గాంధీ ని జోకర్ అని, పదవి నుండి తప్పుకోమని మాత్రమే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్రమంగా ప్రియాంక గాంధీ భజన అందుకోవడంతో, సోనియాకు వారితో ఏవిధంగా వ్యవహరించాలో పాలుపోవడం లేదు. కాంగ్రెస్ సీనియర్ నేత మరియు మాజీ మంత్రి కేవీ థామస్ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రియాంక గాంధీలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని తాను కోరుకొంటున్నానని అన్నారు. అలాగని తాను రాహుల్ గాంధీని తన పదవి నుండి తప్పించమని కోరడం లేదని, కేవలం ప్రియాంకా తన సోదరుడికి అండగా నిలవాలని మాత్రమే కోరుకొంటున్నానని ఆయన అన్నారు. అంటే దానర్ధం అసమర్ధుడు, నాయకత్వ లక్షణాలు లేనివాడయిన రాహుల్ గాంధీకి ప్రియాంకా గాంధీ తోడ్పాటు అవసరమని ఆయన అధిష్టానానికి పరోక్షంగా చెపుతున్నట్లే భావించవచ్చును. కాంగ్రెస్ పార్టీని స్వయంగా నడిపించలేని వ్యక్తి, 120 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశానికి ప్రధానమంత్రి అయిపోయి దేశాన్ని ఏవిధంగా నడిపించాలని భావించారో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు కూడా సోదరి ప్రియాంకా గాంధీ మద్దతు ఆయనకు అవసరమయితే, అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆమె చేతిలోనే పెడితే కనీసం వచ్చే ఎన్నికల నాటికి ఆమె పార్టీని బలోపేతం చేయగలదు కదా? అని థామస్ అభిప్రాయం కావచ్చును. అయితే ఆమాటను నేరుగా చెప్పలేక ఈవిధంగా డొంక తిరుగుడుగా చెపుతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈవిధంగా మాట్లాడి సోనియా, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెట్టినందుకు బహుశః ఆయనపై కూడా త్వరలోనే సస్పెన్షన్ వేటు వేస్తారేమో!
అయినా రాహుల్ గాంధీ అసమర్థత గురించి ఇంత స్పష్టంగా రుజువయిన తరువాత కూడా, అతనినే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొంటే వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా కనుమరుగయిపోవడం తధ్యం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల తరువాత, కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. కనీసం అప్పుడయినా సోనియా, రాహుల్ గాంధీలు తమ పదవుల నుండి తప్పుకొని, పార్టీ పగ్గాలు సమర్ధులకు అప్పగిస్తారో లేక షరా మామూలుగా పార్టీలో అటువారిని ఇటు, ఇటువారిని అటు మార్చి ప్రక్షాళన కార్యక్రమ తంతుని మమ అనిపిస్తారో చూడాలి.