మా మావోయిస్టులు మంచోళ్ళే: నారాయణ
తెలంగాణా ఉద్యమాల సమయంలో మావోయిష్టుల పట్ల చాల సానుకూలంగా వ్యవహరించిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమయిన వైఖరి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు పదిహేను మంది మోస్ట్ వాంటడ్ మావోయిస్టుల పేర్లను ప్రకటించి ఒక్కొక్కరి తలకు చాలా భారీ వెల ప్రకటించారు. ఇక చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా మావోయిష్టులను ఏరిపారేయడానికి కృత నిశ్చయంతో ఉన్నారు.
ఇటీవల కాలంలో ఛత్తీస్ ఘర్, బీహార్, ఒడిషా రాష్ట్రాలలో మావోయిష్టులు మరీ బరితెగించి, పోలీసులతో బాటు అమాయకులయిన ప్రజలను పొట్టనపెట్టుకొన్నారు. చివరికి తమ ప్రతాపం సామాన్య ప్రజలకు ఉపయోగపడే సెల్ టవర్లు, సబ్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లపై కూడా చూపిస్తున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రంలో జరిగిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం కూడా మావోయిస్టుల పనే అని కేంద్రం అనుమానిస్తోంది. వారు ఇన్నిఘోరమయిన అకృత్యాలు చేస్తూ, సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే, సీపీఐ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడైన కె. నారాయణ వారి చర్యలను ఖండించకపోగా, వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదించిన నిషేధం ఎత్తి వేయాలని డిమాండ్ చేసారు.
విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను సామాజిక సమస్యగా చూడకుండా, కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తూ, బుల్లెట్ కు బుల్లెట్ అనే పద్దతిలో మావోయిష్టులను క్రూరంగా అణచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇకనయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిష్టులపై నిషేధం ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేసారు. దేశంలో మతతత్వ వాదం, ఉగ్రవాదం కంటే మావోయిష్టులు ప్రమాదకారులు కాదని ఆయన వారిని వెనకేసుకు వచ్చారు. సమాజంలో తీవ్రమయిన ఆర్ధిక అసమానతల కారణంగానే మావోయిష్టులు పుట్టుకొచ్చారని, ప్రభుత్వాలు దానిని పరిష్కరించగలిగినట్లయితే మావోయిష్టుల సమస్య సమసి పోతుందని ఆయన సూచించారు.
నారాయణ కమ్యూనిష్టు పార్టీకి చెందినవారు గనుక ఆవిధంగా వాదించడం సహజమే అనుకొన్నప్పటికీ, మావోయిష్టుల కారణంగా నిత్యం ప్రాణాలు కోల్పోతున్న వందలాది అమాయక ప్రజల గురించి కానీ, మావోయిష్టులు సృష్టిస్తున్న అరాచకం గురించి కానీ ప్రస్తావించకపోవడం చూస్తే, ఆయనకు ప్రజల ప్రాణాల కంటే మావోయిష్టుల ప్రాణాలే చాలా ముఖ్యమని భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది. అంతేకాక దేశం ఒకవైపు మతతత్వ కలహాలు, ఉగ్రవాదుల దాడులతో సతమతమవుతుంటే, మావోయిష్టుల దుశ్చర్యలు వాటికంటే తీవ్రమయినవేమీ కావని ఆయన చెప్పడం చాలా దారుణం. అవినీతి, అక్రమాల కారణంగా గత 60సం.లలో దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. అటువంటప్పుడు ప్రజల కష్టార్జితంతో అరకొరగా ఏర్పాటు చేసుకొన్న వ్యవస్థలను కూడా మావోయిష్టులు నాశనం చేస్తుంటే వారి చర్యలను తీవ్రంగా ఖండించకపోగా, వారిపై నిషేధం విదించిన ప్రభుత్వాలదే తప్పనట్లు నారాయణ మాట్లాడటం చాలా దారుణం.
ఒకప్పుడు మావోయిష్టులను చంక నెక్కించుకొన్న కేసీఆర్ ఇప్పుడు వారి తలలకు ఎందుకు వెలలు కట్టవలసి వచ్చింది? అంటే తన దాక వస్తే కానీ తెలియదని అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే సూత్రం నారాయణకు, మావోయిష్టులను వెనకేసుకు వస్తున్న నారాయణ వంటి ఇతరులకు కూడా వర్తిస్తుంది. తమకు, తమ కుటుంబ సభ్యులకు మావోయిష్టుల వల్ల ఎటువంటి ఆపద కలగనంత వరకు నారాయణ వంటివారు ఈ విధంగానే ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధిపధంలో నడిపించాల్సిన బాధ్యత గల ప్రభుత్వాలు ఏవయినా వారితో ఈవిధంగానే వ్యవహరిస్తుంటాయి. అలా కాకా ఇటువంటి వారి ఉచిత సలహాలు పాటించినట్లయితే దేశం ఒక ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మాదిరిగా తయారవుతుంది.