అట్టహాసంగా ప్రమాణ స్వీకారం ఎందుకంటే
posted on Jun 4, 2014 @ 10:20PM
తెదేపా ఎన్నికలలో ఘనవిజయం సాధించినప్పటి నుండి చంద్రబాబు పదేపదే చెపుతున్న మాట ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని. మరి అటువంటప్పుడు కోట్లు ఖర్చుచేసి అంత అట్టహాసంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు? అని ప్రతిపక్షాల ప్రశ్న. వారి ప్రశ్నకు పార్టీ సీనియర్ నేతలు గాలి ముద్దు కృష్ణం నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చాలా ఆశ్చర్యకరమయిన జవాబు చెప్పారు.
రాష్ట్ర విభజనతో డీలాపడిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో మళ్ళీ నూతనోత్సాహం నింపి, వారికి తెలుగుదేశం పార్టీ ఎటువంటి క్లిష్టపరిస్థితులనయినా దైర్యంగా ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించగలదనే నమ్మకం కలిగించడానికే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పదేళ్ళ సుదీర్గ విరామం తరువాత మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తున్నందున ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించినంత మాత్రాన్న, తెదేపా కార్యకర్తలలో, నేతలలో ఉత్సాహం నింపవచ్చేమో కానీ ప్రజలందరిలో ఏవిధంగా దైర్యం, ఉత్సాహం కలుగుతుందో వారికే తెలియాలి.
ఒకవేళ వారు చెప్పినట్లుగా ప్రజలందరిలో తెదేపా పట్ల నమ్మకం మరింత బలపడినట్లయితే, అప్పుడు ప్రజలలో తెదేపా ప్రభుత్వంపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రజల కళ్ళ ముందు సింగపూర్ ను ఆవిష్కరించారు. రైతుల, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు, పెన్షన్లు వంటి వాగ్దానాలు చాలా చేసారు. తెదేపా నేతలు చెప్పినట్లుగా ప్రజలు ఆలోచిస్తే, చంద్రబాబు తన మంత్రదండం తిప్పేసి రాత్రికి రాత్రే తమ సమస్యలన్నీపరిష్కరించేస్తారని మరిన్ని ఆశలు పెంచుకొనే ప్రమాదం ఉంది. అంటే గాలి, బొజ్జల చెప్పినట్లుగా ప్రజలలో ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగితే, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నమాట.
ఇక ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేవని చెపుతూనే, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం వలన, రేపు చంద్రబాబు ప్రభుత్వం తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఏమాత్రం వెనుకంజ వేసినా, అప్పుడు ప్రతిపక్షాలు ఈ భారీ కార్యక్రమాన్ని ఎత్తి చూపి చంద్రబాబును దెప్పి పొడవకమానరు. ఏమయినప్పటికీ, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరిగిపోతున్నాయి గనుక, ఈ భారీ కార్యక్రమ ప్రభావం ప్రజల మీద ఏవిదంగా ఉండబోతోందో త్వరలోనే అందరూ చూడవచ్చును.