కేసీఆర్ ప్రభుత్వానికి నమస్తే తెలంగాణా గుడ్ బై చెప్పెసిందా?
posted on Jun 5, 2014 @ 12:37PM
తెలంగాణా ఉద్యమాలలో కేసీఆర్ కు, తెరాసకు ‘నమస్తే తెలంగాణా’ పత్రిక మరియు న్యూస్ ఛానల్ కొండంత అండగా నిలబడిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు కూడా ‘నమస్తే తెలంగాణా’ను తెరాస గొంతుగానే భావిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాం అధికారంలోకి వచ్చిన తరువాత ‘నమస్తే తెలంగాణా’ కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్దిస్తూ వార్తలు ప్రచురిస్తోంది గనుక దానిని అధికారిక మీడియాగా ప్రజలు భావించడం సహజమే. కానీ ‘నమస్తే తెలంగాణా’ మీడియా చైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన సి.యల్. రాజం అందరినీ ఆశ్చర్య పరుస్తూ, నిన్న డిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఇంతకాలంగా తాను సమర్దిస్తూ వచ్చిన కేసీఆర్ అధికార పగ్గాలు చేప్పట్టిన తరువాత, ఆయన తెరాసలో చేరినట్లయితే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన తెరాసను వ్యతిరేఖిస్తున్న బీజేపీలో చేరడం నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన అకస్మాత్తుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటని అందరికీ అనుమానాలు కలగడం సహజమే.
నరేంద్ర మోడీని చూసి చాలా స్ఫూర్తి పొందినందునే తాను బీజేపీలో చేరానని, ఆయన నేతృత్వంలోనే దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని, ఆయన ప్రభుత్వం తెలంగాణాకు అన్నివిధాల అండగా నిలబడుతుందని నమ్మకంతోనే తాను బీజేపీలో చేరినట్లు ఆయన చెప్పుకొన్నారు. బీజేపీలో చేరడం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని దానివెనుక ఎటువంటి ప్రత్యేక రాజకీయ కారణాలు లేవని ఆయన అన్నారు.
మోడీని చూసి స్ఫూర్తి పొందడం మంచిదే కానీ దాని కోసం పనిగట్టుకొని డిల్లీ వెళ్లి బీజేపీలో చేరవలసిన అవసరం లేదు. ఆపని తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులో కూడా చేయవచ్చును. కానీ ఆయన పనికట్టుకొని డిల్లీ వెళ్లి రాజ్ నాథ్ సమక్షంలో బీజేపీలో చేరారంటే ఏదో బలమయిన కారణం ఉండే ఉండాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతుల రుణమాఫీలపై వెనక్కి తగ్గడంతో, తెలంగాణా బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వంపై యుద్దానికి సిద్దం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు తెరాసను, కేసీఆర్ ను గట్టిగా సమర్దిస్తూ వచ్చిన నమస్తే తెలంగాణా మీడియా, ఇప్పుడు బీజేపీకి వంతపాడుతూ తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేయవలసి వస్తుంది. ప్రజల తరపున నిలిచి పోరాడాల్సిన మీడియా కూడా సాధారణ రాజకీయ పార్టీల్లాగే తన వైఖరి మార్చుకొంటే అదొక విపరీత పరిణామమే అవుతుంది. అలాగని ‘నమస్తే తెలంగాణా’ ఇప్పటిలాగే తెరాస ప్రభుత్వాన్ని సమర్దిస్తే, తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగించడం ఖాయం.
స్వయంగా ఒక పత్రికను, న్యూస్ ఛానల్ ను నడిపిస్తున్న సి.యల్. రాజం తను బీజేపీలో చేరడంవలన ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని తెలియదనుకోలేము. కనుక ఆయన ఏదో బలమయిన కారణంతోనే బీజేపీలో చేరి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ కారణాలు ఏమిటనే సంగతి త్వరలోనే క్రమంగా బయటపడవచ్చును.