టీ-కాంగ్రెస్ నేతలకు సోనియా, రాహుల్ క్లాస్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశంలో అన్ని ప్రాంతాల నుండి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో, ఇంతవరకు సోనియా, రాహుల్ గాంధీల భజనలో తరిస్తున్న కాంగ్రెస్ నేతలు సైతం ఆ ఓటమికి వారిరువురే కారణమని అనే సాహసం చేయగలుగుతున్నారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలు వారిరువుని వేలెత్తి చూపే సాహసం చేయలేక వారి కోటరీలో ఉన్న దిగ్విజయ్, జైరామ్, షిండే, షకీల్ అహ్మద్ వంటివారు సోనియా, రాహుల్ గాంధీ లను తప్పు ద్రోవ పట్టించారని పరోక్షంగా ఆ తల్లి కొడుకులకి కూడా చురకలు వేస్తున్నారు. అయితే వారు కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. స్థానికంగా పట్టులేని నేతల చేతకానితనం వలననే పార్టీ ఓడిపోయిందని ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతవరకు తమకు వీరవిధేయులుగా మెలిగిన కాంగ్రెస్ నేతలె ఇప్పుడు తమను వేలెత్తి చూపుతూ ఆరోపణలు చేయడం సోనియా, రాహుల్ గాంధీలకు ఓటమికంటే కూడా ఎక్కువ అవమానకరంగా ఉంది.
ఈ అవమానకర పరిస్థుల నుండి ఏవిధంగా గట్టెక్కాలో తెలియక తల్లికొడుకులు సతమత మవుతుంటే, సరిగ్గా అదే సమయంలో, తెలంగాణాలో పార్టీని మట్టి కరిపించిన టీ-కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, పొన్నాల ప్రభాకర్, రాజయ్య, వివేక్, సురేశ్ షెట్కార్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేశ్ జాదవ్ తదితరులు వారిని కలిసి ఓటమికి గల కారణాలను వివరించి క్షమాపణలు కోరేందుకు రావడంతో తల్లికొడుకులు తమ కోపం అంతా వారిపై చూపించారు. తెలంగాణా ఇస్తే చాలు 15యంపీ, 100 అసెంబ్లీ సీట్లు అవలీలగా సాధిస్తామని తమను నమ్మించి తెలంగాణా ఇప్పించిన టీ-కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. వారిని గుడ్డిగా నమ్మినందుకు పార్టీ రెండు రాష్ట్రాలలో కూడా తీవ్రంగా నష్టపోయిందని సోనియా, రాహుల్ గాంధీలు ఆరోపించారు. వారెవరికీ క్షేత్రస్థాయిలో పట్టులేని కారణంగానే గెలవలేకపోయారని రాహుల్ నిందించారు.
అందుకు టీ-కాంగ్రెస్ నేతలు బదులిస్తూ మోడీ, పవన్ కళ్యాణ్ ప్రభావం, టీ-కాంగ్రెస్ ని ముందుండి నడిపించగల సరయిన నాయకుడు లేకపోవడం, పార్టీలో సమన్వయ లోపం, అభ్యర్ధుల ఎంపికలో జైరామ్ రమేష్, కొప్పుల రాజు జోక్యం చేసుకోవడం వంటి అనేక కారణాల వలన తాము ఓడిపోయామని, అందుకు చాలా బాధపడుతున్నామని సోనియా, రాహుల్ గాంధీల ముందు మొరపెట్టుకొన్నారు. అయితే ఇక ఇప్పుడు చేసేదేమేమీ లేదు కనుక, ఇక నుండి అయినా టీ-కాంగ్రెస్ నేతలందరూ కష్టపడి పనిచేసి మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలని సోనియాగాంధీ టీ-కాంగ్రెస్ నేతలను గట్టిగా హెచ్చరించి పంపారు.