ఇదంతా ప్రజాసేవ కోసమే...
posted on Jun 9, 2014 @ 4:05PM
ప్రజాసేవ అంటే మన రాజకీయ నాయకులకి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆ అవకాశం కోసం వారు ఎన్నికలలో తమ కష్టార్జితాన్ని శనక్కాయలు పంచినట్లు జనాలకు చాలా ఉదారంగా పంచిపెట్టేస్తుంటారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆంధ్ర, తెలంగాలో పట్టుబడిన రూ.125కోట్లే అందుకు ఒక గొప్ప ఉదాహరణ. అంత ఖర్చు చేసి ఎలాగో ఎన్నికలలో గెలిచిన తరువాత ఏదో ఒక మంచి మంత్రి పదవి చేప్పట్టి మరింత ప్రజాసేవ చేసేయాలని తపించిపోతారు. కానీ ఆవిధంగా తపించేవారు అధికార పార్టీలో చాలా మందే ఉంటారు గనుక ప్రజాసేవ చేసేందుకు కూడా పాపం వారు చాలా పోటీ ఎదుర్కోవడం తప్పడం లేదు.
ఇక విషయంలోకి వస్తే, చంద్రబాబుతో నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 19 మందిలో తమపేర్లు కనబడకపోవడంతో ఒకరికి మనసు పాడయిపోయింది. మరొకరికి మనసుతో బాటు ఆరోగ్యం కూడా పాడయిపోయింది. వారిలో మనసు మాత్రమే పాడుచేసుకొన్న పార్టీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ, ప్రజాసేవ చేసేందుకు చంద్రబాబు తనకు టికెట్ ఇచ్చినప్పటికీ, ప్రజలకు మరింతగా సేవ చేసుకొనేందుకు తనకు మంత్రి పదవి ఇవ్వందదుకు నిరసనగా తెదేపా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
ఇక కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు , తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కాగిత వెంకటరావు, తనకు ప్రజాసేవ చేసే భాగ్యం దక్కనందుకు మనసుతో బాటు ఆరోగ్యం కూడా పాడుచేసేసుకొన్నారు. నాలుగు సార్లుగా ఎన్నికవుతున్న తనను కాదని, మొదటి సారిగా ఎన్నికైన కొల్లు రవీంద్రకు మంత్రి పదవి ఇవ్వడం వల్లనే ఆయన ఆరోగ్యం మరింత పాడయినట్లు తెలుస్తోంది. కానీ బీపీ, సుగర్ వ్యాధులు ఉన్నఆయన నిన్న ఉదయం నుండి సరయిన ఆహారం, విశ్రాంతి తీసుకోకుండా, ప్రమాణ స్వీకారోత్సవానికి అతిగా శరమించడం కాగిత వెంకట్రావుకు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం వల్ల గుండెపోటు వచ్చిందని ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వలననే ఆరోగ్యం పాడయింది తప్ప, ప్రత్యర్ధ పార్టీకి చెందినా పత్రిక వర్నిస్తున్నట్లు మంత్రి పదవి రాకపోవడం వలన ఆరోగ్యం పాడవలేదని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. తమ నాయకుడి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏమయినప్పటికీ ఆయన ఆరోగ్యం పాడవడం మాత్రం వాస్తవమేనని వారు కూడా అంగీకరిస్తున్నారు. మనసు పాడయితే మంత్రి పదవితో దానిని మళ్ళీ బాగు చేసుకోవచ్చును. కానీ ఆరోగ్యం పాడయితే వైద్యం చేయించుకోక తప్పదు గనుక, ఆయనను బందరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఓదార్పు యాత్రలు ఆరంభించవలసి వస్తోంది. ప్రజాసేవ చేసే భాగ్యం దక్కక మనసు, ఆరోగ్యం పాడు చేసుకొన్న వారినందరినీ ఓదార్చేందుకు పార్టీ సీనియర్ నేతలను పంపినట్లు సమాచారం. త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తీర్ణం ఉంటుంది గనుక, అప్పుడయినా తమకు మంత్రివర్గంలో దక్కితే ప్రజలకు భారీగా సేవచేసే అవకాశం దక్కకపోతుందా? అని చాలామంది తెదేపా నేతలు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. గనుక చంద్రబాబు ఏకంగా అప్పుడే ఈ ఓదార్పు కార్యక్రమామేదో పెట్టుకొంటే బాగుండేది కదా? అని దానిపై పేటెంట్ హక్కులున్న ప్రతిపక్షాల వారు సూచిస్తున్నారు.