యూపీలో కొనసాగుతున్న అత్యాచార రాజకీయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బదౌన్ గ్రామంలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్యలతో ఒకవైపు రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మళ్ళీ బరేలీకి సమీపంలోని ఐత్ పురా అనే గ్రామంలో అంతకంటే పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి, ఆమెచేత యాసిడ్ బలవంతంగా త్రాగించి, ఆపై ఆమె ఆనవాలు తెలియకుండా ఉండేందుకు ఆమె మొహంపై యాసిడ్ పోసి, ఆ తరువాత ఆమెను చెట్టుకు ఉరేసి అత్యంత దారుణంగా హత్య చేసారు.
డిల్లీ నిర్భయ ఉదంతం తరువాత కటినమయిన చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ, కామంతో కళ్ళు మూసుకుపోయి, అగ్రకులాహాంకారంతో పోయిన కొందరు మృగాళ్ళు నిరుపేద దళిత మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నాయి. అయినప్పటికీ అఖిలేష్ యాదవ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, ఈ కులగజ్జి సోకిన ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖ, బాధితులకు బాసటగా నిలవకపోగా, దారుణమయిన ఈ నేరాలకు పాల్పడిన వ్యక్తులకే కొమ్ము కాస్తోంది. ఆ కారణంగా మగ మృగాలు మరింత పెట్రేగిపోతున్నాయి.
మొదట బదౌన్ గ్రామంలో అత్యాచారం జరిగినపుడు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అందుకు బాద్యుడిని చేస్తూ, ఆయనను పదవి నుండి దింపేసి ఆయన స్థానంలో మరొకరిని నియమించేసి, తన పనియిపోయినట్లు చేతులు దులుపుకొన్నారు. సమస్యకు అది సరయిన పరిష్కారం కాదని అఖిలేష్ యాదవ్ కు కూడా తెలుసు, కానీ ఆయన అంతటితో పరిస్థితులు చల్లబడతాయని భావించారు. కానీ మళ్ళీ రెండు రోజుల వ్యవధిలోనే మళ్ళీ మరో దారుణమయిన అత్యాచారం, హత్య జరగడంతో అఖిలేష్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలకు సిద్దమవుతోంది. ఇప్పటికే సీబీఐ ఎంక్వయిరీ వేసింది.
ఇంత జరిగినా నేరస్తులపై యస్సీ, ఎస్టీ రక్షణకు ఉన్నప్రత్యేక చట్టాల క్రింద అఖిలేష్ ప్రభుత్వం కేసులు ఎందుకు నమోదు చేయలేదని హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్జు ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ “ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్న పరిస్థితులపై గవర్నర్ వెంటనే నివేదిక పంపినట్లయితే, కేంద్రం జోక్యం చేసుకొంటుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర బీజేపీ మహిళా కార్యకర్తలు, నేతలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయబోతే, పోలీసులు వారిపై వాటర్ జెట్ ప్రయోగించి చెదరగొట్టేరు. దానితో మరింత ఆగ్రహం చెందిన స్థానిక బీజేపీ నేతలు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించాలని డిమాండ్ చేస్తున్నారు.
మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన ఇటువంటి ఘటనలలో చురుకుగా మానవతా దృక్పధంతో స్పందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారులు అందరూ ఈవిధంగా రాజకీయాలు చేయడం అత్యాచారం కంటే నీచం.ఇప్పటికయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీస్వయంగా జోక్యం చేసుకొని, పరిస్థితులను వెంటనే చక్కదిద్ది, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కటినంగా వ్యవహరించాలి.