ఆంధ్రప్రదేశ్ కు మోడీ సర్కార్ పవర్ ఫుల్ గిఫ్ట్
posted on Jun 9, 2014 @ 2:55PM
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కోబోతున్న అనేక సమస్యలలో విద్యుత్ లోటు కూడా ఒకటి. రాష్ట్ర విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల నడుమ జరిగిన అనేక పంపిణీలలో, విద్యుత్ విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మిగిలిన అన్ని పంపకాలు కూడా జనాభా ప్రాతిపదికన జరిగితే, ఒక్క విద్యుత్ పంపకాలు మాత్రం వినియోగం ప్రాతిపదికన జరగడంతో, ఏ విషయంలో నష్టపోయినా కనీసం విద్యుత్ అయినా మిగులుతుందనే ఆశ కూడా అడియాసే అయింది. ఏకంగా 1500 మెగావాట్ విద్యుత్ తెలంగాణకు కోసం వదులుకోవలసి రావడంతో రాష్ట్రానికి విద్యుత్ విషయంలో కూడా లోటు తప్పలేదు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నివిధాల ఆదుకొంటామని భరోసా ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం, తమ కూటమిలో మరియు ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణస్వీకారం చేస్తున్నసందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఒక ‘పవర్ ఫుల్’ బహుమానం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేప్పట్టబోతున్న ‘నిరంతర విద్యుత్ సరఫరా (24X365) పైలట్ ప్రాజెక్టు’ పధకం అమలుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న ప్రకటించారు. ఈ పదకం అమలుకు అవసరమయిన నిధులు, మార్గదర్శకాలు, ఏర్పాట్లు వగైరాల వివరాలన్నీ త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఈ పధకం విజయవంతం అయినట్లయితే క్రమంగా దానిని దేశమంతటికీ విస్తరిస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితంగా అభివృద్ధి సాధించాలంటే అందుకు విద్యుత్ చాలా అవసరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉన్నట్లయితే అనేక పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. ఇప్పుడు కేంద్రమే నిరంతర విద్యుత్ కు భరోసా ఇస్తోంది గనుక ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు దిగులు చెందవలసిన అవసరం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టక మునుపే ప్రధానితో సహా కేంద్రమంత్రులందరినీ కలిసి, రాష్ట్ర పరిస్థితి వారికి మరొకమారు వివరించి, వారి సహాయ సహకారాలు అర్ధించినందునే కేంద్రం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఇంత ఉదారంగా వ్యవహరిస్తూ ఇటువంటి నిర్ణయం తీసుకొందని చెప్పవచ్చును. అందుకు కారకుడయిన చంద్రబాబును అభినందించవలసిందే.
గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రప్రభుత్వం ఏనాడు కూడా రాష్ట్రం పట్ల ఇంత త్వరగా, ఇంత ఉదారంగా సహాయ సహకారాలు అందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో రెండు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, ఊహించనత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఊహించని విధంగా రాష్ట్రానికి వరాలు దక్కుతున్నాయి. అందుకు తెదేపా, బీజేపీలను వాటినెన్నుకొన్న ప్రజలను అభినందించవలసిందే. ఆ రెండు పార్టీల నేతలు రానున్న ఐదేళ్ళు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుకోవడమే కాకుండా అన్ని రంగాలలో తప్పకుండా తిరుగులేని అభివృద్ధి సాధించడం తధ్యం.