సీమాంధ్రలో కూడా హంగ్ తప్పదా?

  నిన్న జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే తెదేపా, వైకాపాలు రెండూ కూడా సమవుజ్జీలుగానే నిలిచినట్లు కనబడుతోంది. కానీ రెండు పార్టీల నేతలు తమకే పూర్తి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.   తాజా సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నగరాలు, పట్టణాలలో మంచి ఆధిక్యత కనబరచగా, వైకాపా గ్రామీణ ప్రాంతాలలో ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తోంది. నగరాలలో, పట్టణాలలో నివసించే ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాటం చెప్పేందుకు తెదేపావైపు మొగ్గు చూపగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంక్షేమ పధకాలు, రుణాల మాఫీలకి ఆకర్షితులయ్యి వైకాపా వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. అదేవిధంగా కులం, మతం, డబ్బు, మద్యం వంటి అనేక అంశాలు కూడా నగర ప్రజల కంటే గ్రామీణ ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపగలవు గనుక అక్కడి ప్రజలను వైకాపా చాలా సులువుగా ఆకర్షించి ఉండవచ్చును.   ఇక నగరాలలో నివసించే ప్రజలు కూడా ఈ ప్రలోభాలకు, బలహీనతలకు అతీతులు కాకపోయినప్పటికీ, అంతిమంగా అభివృద్ధి, సమర్ధతకే మొగ్గుచూపడంతో అది తెదేపాకు లబ్ది చేకూర్చవచ్చని సమాచారం. ఇక ఈసారి కొమ్ములు తిరిగిన రాయపాటి వంటి కాంగ్రెస్ నేతలు అనేక మంది తెదేపా అభ్యర్ధులుగా పోటీ చేయడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది. కానీ, కాంగ్రెస్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేఖత కారణంగా, వారిని చేర్చుకొన్నందుకు తెదేపాకు పడవలసిన ఓట్లు, చిన్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు పడే అవకాశం ఉంది.   తెదేపా బీజేపీతో పొత్తు పెట్టుకొన్న కారణంగా ముస్లిం, మైనార్టీ ప్రజలను వైకాపా ఆకర్షించగలిగింది. కానీ ఆ పొత్తుల కారణంగానే నగర ప్రజలు తెదేపావైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోడీ ప్రభావం, విజయావకాశాలున్నఆ పార్టీతో పొత్తు పెట్టుకొన్న తెదేపావైపు నగర ప్రజలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తెదేపా-బీజేపీ అభ్యర్ధులకు చాలా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి యువ ఓటర్లు ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓట్లు వేయడం, వారి ఓటింగు శాతం గతంలోకంటే బాగా పెరగడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.   వివిధ అంశాలు, సమీకరణాలు, ప్రజల బలహీనతలు, పార్టీల ప్రలోభాల కారణంగా ఓట్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినప్పటికీ, అర్బన్, రూరల్ ఓట్లు ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ స్పష్టమయిన మెజార్టీ వచ్చే అవకాశం ఉండకపోవచ్చును. నిన్న జరిగిన ఎన్నికలలో 13జిల్లాలలో కూడా చాలా అత్యధిక శాతం పోలింగు నమోదు అయింది. అందువల్ల ఓట్లు కూడా అదే స్థాయిలో చీలే అవకాశం ఉంది. ఒకవేళ పోలింగు 70 శాతం దాటినట్లయితే తెదేపా విజయావకాశాలుంటాయని ఇటీవల లగడపాటి రాజగోపాల్ చెప్పిన జోస్యం నిజమనుకొంటే, నిన్న పోలింగు ఏకంగా 80శాతం జరిగింది గనుక తెదేపా విజయం తధ్యం అనుకోవచ్చును. కానీ గ్రామీణ, పట్టణ ఓటర్లు ఈ రెండు పార్టీల మధ్య చీలినట్లయితే దేనికీ మెజార్టీ రాకపోవచ్చును. ఏమయినప్పటికీ మరొక వారం రోజుల్లో ప్రజాభిప్రాయం ఎవరికి అనుగుణంగా ఉందో తేలిపోతుంది.

రిగ్గింగ్ చేస్తే తప్ప జగన్ గెలవలేడా?

      సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ నియోజకవర్గంలో వైపాకా కార్యకర్తలు స‌ృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. ఓటర్లను ప్రలోభపెట్టడం దగ్గర్నుంచి బూత్‌ల్ని ఆక్రమించుకుని రిగ్గింగ్ చేయడం వరకు అన్ని ఎలక్షన్ల అవలక్షణాలను ప్రదర్శించారు. వీటిలో ఇతర పార్టీల నాయకుల మీద దాడి చేయడం, పోలింగ్ సిబ్బంది మీద దాడి చేయడం లాంటి ఘనకార్యాలు కూడా వున్నాయి. అయితే ఇవన్నీ జగన్ పార్టీ ఎందుకు చేయించిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలా మిగిలింది.   పులివెందుల నియోజకవర్గంలో జగన్ గెలవడనే అనుమానం ఎవరికీ లేదు. ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబ నియోజకవర్గంగా పేరు పొందింది. ఇక్కడి నుంచి వైఎస్సార్ కుటుంబీకులు ఎవరు పోటీ చేసినా సునాయాసంగా గెలుస్తారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. మరి సులభంగా గెలిచే స్థానం అయినప్పటికీ ఇక్కడి వైకాపా కార్యకర్తలు ఎందుకు హడావిడి చేశారో అర్థం కాని విషయం. ఒకవేళ వైఎస్ జగన్‌కి ఇక్కడి నుంచి ఓడిపోతానేమోనన్న భయం పట్టుకుందేమోనని అనుమానాలు వస్తున్నాయి. తాను పులివెందులలో రిగ్గింగ్ చేస్తే తప్ప గెలవలేనన్న భయంతోనే ఇక్కడ హడావిడి చేయించాడా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానని ఉబలాటపడినట్టు.. తన  కుటుంబ నియోజకవర్గంలోనే గెలవననే అనుమానం వున్న జగన్ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలు కనడమేంటో ఆయనకే తెలియాలి.

జగన్‌కి ఓటింగ్ రూల్స్ తెలియవా?

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి అర్జెంటుగా ఏదో ఒక స్టేట్‌కి ముఖ్యమంత్రి అయిపోవాలన్న తహతహే తప్ప మరే నాలెడ్జీ వున్నట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నాడు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా ‘ఆంధ్రప్రదేశ్’కి ముఖ్యమంత్రి అయిపోతున్నట్టు కలలు కంటున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక సీమాంధ్రని ఎలా డెవలప్ చేయాలనే విషయం మీద విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని పిలిపించడం తెలుసు. సీఎం అయ్యాక ఐదు సంతకాలు ఎక్కడెక్కడ చేయాలో తెలుసు. కానీ ఈ పెద్దమనిషికి ఓటు ఎలా వేయాలో మాత్రం తెలియకపోవడం బాధాకరం.   బుధవారం నాడు పులివెందుల నియోజకవర్గంలో జగన్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. పోలింగ్ బూత్‌లో జగన్ ఓటు వేస్తున్నప్పుడు ఆయన వెనుకే ఓ పోలింగ్ అధికారి, వైసీపీ పోలింగ్ ఏజెంట్ నిల్చుని జగన్ ఓటు వేయడాన్ని తనివితీరా చూసి తరించిపోయారు. ఇది రూల్స్ కి విరుద్ధం. ఓటరు ఓటు వేస్తూ వుండగా ఎవరూ చూడటానికి వీల్లేదు. తన పార్టీ కార్యకర్తల, ఓ పోలీసు అధికారి తన వెనుకే నిల్చుని తాను ఎవరికి ఓటు వేస్తున్నదీ కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తుంటే ఘనత వహించిన జగన్‌గారికి వారించాలని అనిపించలేదా? అక్కడే వున్న పోలింగ్ అధికారులు జగన్ వెనుక వున్న ఇద్దర్ని అక్కడి నుంచి అవతలకి వెళ్ళిపోవాలని చెప్పడం మరచిపోయారా? చంద్రబాబు నాయుడు ఓటు వేసిన తర్వాత బయటకి వచ్చి, పోలింగ్ బూత్‌కి చాలా దూరంలో వుండి బీజేపీకి ఓటు వేశానని చెబితే జగన్ పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కూడా చంద్రబాబు ఓటు చెల్లదని చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు ఓటు చెల్లుతుందని చెప్పి భన్వర్ లాల్‌కి మొట్టికాయ వేయడంతో సైలెంటైపోయాడు. మరి చంద్రబాబు విషయంలో రూల్స్ మాట్లాడిన భన్వర్ లాల్, వైకాపా నాయకులు జగన్ ఓటేసిన విధానం చూసి ఏమంటారు? ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ఏమంటారు? అన్నట్టు, బుధవారం ఉదయం నుంచే సాక్షి ఛానల్‌లో ఎప్పుడో వైఎస్ రాజశేఖరరెడ్డి ఓటు వేసిన విజువల్ పదేపదే చూపిస్తున్నారు. ఈ విజువల్స్ లో వైఎస్సార్ ఎవరికి ఓటు వేశారో స్పష్టంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి అర్థమవుతున్నది ఏంటంటే, అవినీతి అక్రమాల విషయంలో మాత్రమే కాకుండా నలుగురికీ కనిపించేలా ఓటు వేయడంలో జగన్ తండ్రి బాటలో నడుస్తున్నాడు.  

సీఎం రమేష్ కు భన్వర్‌లాల్ వార్నింగ్

      క్రమశిక్షణకు మారుపేరులా వుండే తెలుగుదేశం పార్టీలో పానకంలో పుడకలా వుండే వ్యక్తి సీఎం రమేష్. మొన్నామధ్య సమైక్య ఉద్యమం సందర్భంగా రాజ్యసభలో ఈయనగారు చేసిన హడావిడి చూసి తెలుగువారందరూ తలలు దించుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సీఎం రమేష్ పెద్ద తలనొప్పిలా మారాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.   సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా  తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ పట్ల సీఎం రమేష్ దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. రమేష్ తీరు పట్ల రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గంలో పక్క గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకునే విషయంలో హైకోర్టు తీర్పుకు సంబంధించి సీఎం రమేష్ భన్వర్‌లాల్‌ని నిలదీశారు. అది తమ పరిధిలోకి రాదని భన్వర్‌లాల్ చెప్పడంతో సీఎం రమేష్ అసహనంగా, దురుసుగా మాట్లాడారని తెలుస్తోంది. సీఎం రమేష్ ప్రవర్తన పట్ల భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని అంటూ, సీఎం రమేష్ తన తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు.  

హలో చంద్రబాబూ.. ఏంటీ సంగతి?

        సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. చంద్రబాబుకి పట్టం కట్టడానికి సీమాంధ్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బుధవారం పదకొండు గంటల సమయానికి సీమాంధ్ర వ్యాప్తంగా 20 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే పోలింగ్ ముగిసే సమయానికి భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యే అవకాశం వుంది. ఇది తెలుగుదేశం పార్టీకి శుభ సూచకంగా భావించవచ్చు. సీమాంధ్ర పోలింగ్ మీద జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొని వుంది. సీమాంధ్రలో పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే చంద్రబాబు నాయుడికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నుంచి ఫోన్ వచ్చింది. సీమాంధ్రలో జరుగుతున్న పోలింగ్ సరళికి సంబంధించిన వివరాలను నరేంద్రమోడీ చంద్రబాబుని అడిగి తెలుసుకున్నారు. సీమాంధ్రలో పోలింగ్ టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా జరుగుతోందని చంద్రబాబు నరేంద్రమోడీకి చెప్పినట్టు తెలుస్తోంది. సీమాంధ్ర బీజేపీకి చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ బీజేపీ, టీడీపికి ఎక్కువ ఎంపీ స్థానాలు అవకాశం వుంది. ఇవి కేంద్రంలో నరేంద్రమోడీకి బలాన్నిచ్చే అవకాశం వుంది. అందుకే నరేంద్రమోడీ సీమాంధ్ర పోలింగ్ మీద ఆసక్తిగా వున్నారు.

సీమాంధ్రకి చెత్త ఈవీఎంలు పంపించారు

      సీమాంధ్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం, దాని కనుసన్నల్లో నడిచే ఎన్నికల కమిషన్‌కి వున్న నిర్లక్ష్య ధోరణి మరోసారి బయటపడింది. తెలంగాణలో పోలింగ్ జరిగినప్పుడు ఈవీఎంలు మొరాయించిన సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. అయితే సీమాంధ్రలో మాత్రం ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఈవీఎంలు మొరాయిస్తూనే వున్నాయి.   సీమాంధ్ర అంతటా కొన్ని వందల పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. అంటే సీమాంధ్రకు చెత్త ఈవీఎంలను పంపారని అర్థమవుతోంది. ఈవీఎంలు అసలు పనిచేయకుండా చచ్చిపోయిన సంఘటనలు అనేకం వున్నాయి. వీటితోపాటు ఈవీఎంలు అనేకరకాల లీలలు బయటపడుతున్నాయి. ఒకచోట ఒక ఓటు వేస్తే పదిహేను ఓట్లు పడుతున్నాయి. మరోచోట ఎవరికి ఓటు వేసినా ఫ్యాన్ గుర్తుకే పడుతున్నాయి. ఇంకోచోట పోలింగ్ ప్రారంభం కాగానే ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ అధికారిణికి బీపీ పెరిగిపోయి స్పృహ తప్పి పడిపోయారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల సీమాంధ్రలో ఉదయం పదకొండు గంటల వరకూ కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా పెట్టుకున్న ఈవీఎంలు కూడా పనిచేయకుండా మొరాయిస్తున్నాయంటే సీమాంధ్రకు ఎన్నికల కమిషన్ ఎంత చెత్త ఈవీఎంలు పంపిందో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంల సాంకేతిక సమస్యలు ఇలా వుంటే కొన్ని చోట్ల ఒక పార్టీ అభ్యర్థి పేరు ముందు మరో పార్టీ గుర్తు వుండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు.  

అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్ హడావిడి ఇందుకే...

  తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. జూన్ 2 అపాయింటెడ్ డే విషయంలో స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఇక జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడటం ఖాయం. అయినప్పటికీ టీఆర్ఎస్‌లో ఏదో టెన్షన్ వుంది. అపాయింటెడ్ డే‌ని జూన్ 2న కాకుండా మే 16 వ తేదీకి మార్చాలని కొత్త పాట అందుకుంది. ఎన్నికల ప్రక్రియ మే 15వ తేదీతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజుకే అపాయింటెడ్ డేట్ వుండాలని టీఆర్ఎస్ అంటోంది. ఈ మేరకు హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పదిహేను రోజులకు అపాయింటెడ్ డేట్ వుంటే నష్టమేంటి? వచ్చిన తెలంగాణని ఎవరైనా లాక్కెళ్తారా? తెలంగాణని ఎవరూ లాక్కెళ్ళరుగానీ, అధికారాన్ని మాత్రం తమ చేతుల్లోంచి కాంగ్రెస్ పార్టీ లాక్కెళ్తుందని టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం వుందని టీఆర్ఎస్ నాయకులు నమ్ముతున్నారు. అలాగే సర్వేల స్పెషలిస్టు అయిన లగడపాటి రాజగోపాల్ కూడా తెలంగాణ కుర్చీ టీఆర్ఎస్‌దేని తేల్చి చెప్పాడు. ఇన్ని అనుకూల అంశాలున్నా టీఆర్ఎస్ అసాయింటెడ్‌ డే ముందుకు జరపాలని హడావిడి చేస్తున్నది ఎందుకంటే, కాంగ్రెస్ బారి నుంచి తప్పించుకోవడానికే. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి, కొత్త రాష్ట్రం ఏర్పడటానికి మధ్య 17 రోజుల వ్యవధి వుంది. ఈ వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాజకీయాలైనా చేయగలదు. టీఆర్ఎస్‌ని చీల్చే అవకాశాలు కూడా వున్నాయి. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల సత్తా వున్న కాంగ్రెస్ పార్టీకి 17 రోజులు దొరికాయంటే టీఆర్ఎస్‌ని కకావికలు చేసి, అధికారం చేజిక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాంగ్రెస్‌కి అంత టైమ్ ఇవ్వకుండా మే 16నే అపాయింటెడ్ డేట్ వుండేలా చేసి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

పొన్నాల, జానా పనికిమాలిన పంచాయితీ

      ఏదైనా పనికొచ్చే విషయం మీద పంచాయితీ పెట్టుకుంటే, సదరు పంచాయితీ పెట్టుకున్నవాళ్ళతోపాటు చూసేవాళ్ళకి కూడా ఒక పద్ధతిగా వుంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మధ్య జరుగుతున్న పంచాయితీని చూస్తే ఎవరైనా సరే ఇది పనికిమాలిన పంచాయితీ అని డిసైడ్ చేస్తారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పంచాయితీ ఏంటంటే, తెలంగాణకి కాబోయే సీఎం నువ్వా? నేనా? అని! తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి తానే సీఎం అయిపోతానని పొన్నాల కలలు కంటున్నారు. కానీ జానారెడ్డి మాత్రం తానే సీఎం కాబోతున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.   ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి పేరు మరొకరు చెప్పకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వీళ్ళని చూసి దామోదర రాజ నరసింహ లాంటి సీఎం పోస్టుని ఆశిస్తున్న వారు ఏం చేయాలో అర్థంకాక ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కే మెజారిటీ దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినా కాంగ్రెస్ చేతికి చిప్పే దక్కుతుందని తెలుస్తోంది. అసలు అధికారం వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వుంటే, మధ్యలో ముఖ్యమంత్రి సీటు గోలేంటని కొందరు కాంగ్రెస్ వాదులు చిరాకు పడుతున్నారు. అలాగే యువరాజు రాహుల్ గాంధీ తెలంగాణకి మహిళని ముఖ్యమంత్రిని చేస్తానని ఆల్రెడీ చెప్పేశారు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మగానుభావులు తెలంగాణ పోస్టుకోసం పోటీ పడటం ఏంటని కొందరు కాంగ్రెస్ మహిళా నాయకులు బాధపడిపోతున్నారు.

పవన్ ప్రశ్నలకు వైకాపా జవాబు ఇవ్వలేదేమి?

  తెదేపా-బీజేపీ అభ్యర్ధుల తరపున పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారంతో వైకాపాకు ఎంతో కొంత నష్టం జరగడం తధ్యమని చెప్పేందుకు పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. రాజకీయాలలోకి అకస్మాత్తుగా ఊడిపడిన అయన, తమ ఐదేళ్ళ శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేయబోతుంటే వైకాపా కన్నీరు పెట్టుకోవడం, ఆ ఆవేదన ఆగ్రహంగా మారడం కూడా అంతే సహజం.   అందుకే షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా ఏదేదో వాగుతున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవద్దని ప్రజలకు హితవు చెపుతున్నారు. అయితే నేటికీ కూడా పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు వారిరువురూ కూడా జవాబే చెప్పలేకనే, వారు విషయం పక్క దారి పట్టిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.   సీమంధ్ర ప్రజలను నోటికి వచ్చినట్లు కేసీఆర్ తిడుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయనని ఎదుర్కోలేదు? ఎందుకు ఆయనను పల్లెత్తు మాట అనలేదు? కేసీఆర్ ని చూసి ఎందుకు జగన్ భయపడుతున్నారు? వారిరువురి మధ్య ఉన్న అనుబందం ఏమిటి? తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి అక్కడ నివసిస్తున్నసీమాంధ్రులను ఏవిదంగా కాపాడగలరని ప్రశ్నించారు. సీమాంద్ర ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా తాను వారికీ ముఖ్యమంత్రి అవుదామని భావిస్తున్నారు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు జగన్ కానీ షర్మిల గానీ నేరుగా ఇంతవరకు జవాబు చెప్పలేకపోయారు. అందుకే పవన్ కళ్యాణ్ పిచ్చిపిచ్చిగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని షర్మిల, జగన్ ఎదురుదాడికి దిగారు.

ఆంధ్రాని సింగపూర్ చేసే సంగతి తర్వాత...

      రాజకీయ నాయకుడు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్ చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. వైసీపీ అధినేత అయితే సీమాంధ్రని అంతర్జాతీయ స్ఘాయిలో, సింగపూర్‌కి దీటుగా డెవలప్ చేయడానికి విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని కూడా పిలిపించి ప్లాన్లు వేయిస్తున్నాడంట. ఆంధ్రని సింగపూర్ చేసే సంగతి తర్వాత.. ప్రస్తుతం సింగపూర్లో ఇండియా వాళ్ళకి ఇళ్ళు రెంట్‌కి ఇవ్వమని చెప్పేస్తున్నారట. టు లెట్ బోర్డు వున్న ఇంటికి వెళ్ళి పోర్షన్ చూపిస్తారా? అని అడిగితే మీరు ఇండియన్సేగా.. మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమంటూ ముఖంమీదే చెప్పేసి తలుపులు వేసుకుంటున్నారట. సింగపూర్ మొత్తంలే ఇదే పరిస్థితి వుందట. దాంతో సింగపూర్‌లో అద్దె ఇళ్ళు దొరక్క ఇండియన్స్ బోలెడంత ఇబ్బంది పడుతున్నారట.   ఇంతకీ సింగపూరోళ్ళు ఇండియన్స్ ని ఎందుకు ఛీ పొమ్మంటున్నారో తెలుసా? ఇండియన్స్ వంటలు ఘాటైన మసాలాలు ఉపయోగించి వండుతారట, అసలు వంట చేసేటప్పుడే చుట్టుపక్కల అంతా ఆ మసాలా ఘాటు వ్యాపిస్తూ వుంటుందట. అది బల్లులు, పాములు తినే సింగపూరోళ్ళకి ఇబ్బందికరంగా వుందట. అంతేకాకుండా ఇండియన్స్ తమ ఇళ్ళని అపరిశుభ్రంగా వుంచుతారట. ఇల్లు శుభ్రంగా వుంచుకోండని ఎన్నిసార్లు చెప్పినా లైట్‌గా తీసుకుంటారట. అదీ సమస్య. ఫ్యూచర్లో మన సీమాంధ్ర సింగపూర్‌లా మారొచ్చేమోగానీ, మనుషుల అలవాట్లు మారతాయా? సీమాంధ్రని సింగపూర్‌లా మార్చే నాయకులు మనుషుల అలవాట్లని కూడా మార్చగలరా?

గుడివాడ బరిలో కొడాలి నాని, రావి ఢీ అంటే ఢీ

  ఈసారి గుడివాడలో పోటీ ప్రధానంగా వైకాపా అభ్యర్ధిగా దిగిన కొడాలి నాని, తెదేపా అభ్యర్ధి రావి వెంకటేశ్వర రావుల మధ్యే ఉన్నప్పటికీ నానిదే పైచేయిగా కనిపిస్తోంది. కారణం ఆయన గత పదేళ్లుగా నియోజక వర్గాన్నిఅంటిపెట్టుకొని ఉంటూ ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే. ఒకప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నకారణంగా, నందమూరి కుటుంబంతో, ముఖ్యంగా జూ.యన్టీఆర్ ఆయనకున్న సాన్నిహిత్యం వలన ప్రజలలో మంచి పేరు సంపాదించుకొన్నారు. నాని తెదేపా నుండి బయటకు వచ్చిన తరువాత గుడివాడపై పట్టు సాధించేందుకు చాలా తీవ్రంగా కృషిచేసారు. ఆయన తమ ప్రత్యర్ధ తెదేపా నుండి వచ్చినవారు కావడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను ప్రోత్సహిస్తూ గుడివాడలో బలపడేందుకు అన్ని విధాల సహకరించారు. కొడాలి నాని స్వయం కృషికి పార్టీ సహకారం కూడా తోడవడంతో గుడివాడలో ఆయన బలంగా నిలద్రోక్కుకోగాలిగారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం ఈ ఎన్నికలలో ఆయనకు కలిసి వచ్చింది. అందువల్ల ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా విజయం సాధించగలనని కొడాలి నాని గట్టి నమ్మకంతో ఉన్నారు.   ఇక ఆయనపై తెదేపా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రావి వెంకటేశ్వరరావు రాజకీయ నేపద్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినవారే. ఆయన తండ్రి శోభనాద్రి చౌదరి గుడివాడ నుండి రెండు సార్లుఎన్నికయ్యారు. ఆయన తరువాత ఆయన కుమారుడు రావి హరగోపాల్ 1999 ఎన్నికల్లో గుడివాడ నుండి ఎన్నికయ్యారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, ఆయన సోదరుడయిన రావి వెంకటేశ్వర రావు 2000 సం.లో జరిగిన ఉప ఎన్నికలలో గుడివాడ నుండి పోటీ చేసి గెలిచారు. రావివెంకటేశ్వర రావు కూడా తన గెలుపుపై అంతే ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు, తమ పార్టీ విజయావకాశాలు గల బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, మోడీ, బాబు, పవన్ ఉదృత ప్రచారంతో తాను అవలీలగా గెలుస్తానని చెపుతున్నారు. ఈ ఇద్దరు బలమయిన అభ్యర్ధులలో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో తెలుగుదేశం: లగడపాటి

      సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, సీమాంధ్రలో తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధిస్తుందని లగడపాటి చెప్పారు. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే టీడీపీ, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.   సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని వివరించారు.   కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీని సాధిస్తాయనేది తన అంచనా అని చెప్పారు. ఎన్డీయే 272 స్థానాల మార్కు దాటుతుందని అన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తనకు బాధ కలిగించే విషయమని అన్నారు. తనకు రాజకీయంగా జన్మను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తనకు రాజకీయగా మరణాన్ని కూడా ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు.  తనపేరుతో వచ్చే ఇతర సర్వేలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా లగడపాటి ప్రకటించారు. తాను కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్నానే తప్ప ఏ పార్టీలోనూ లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తాను చెబుతున్నది తన అంచనాలు మాత్రమేనని, శాస్త్రీయంగా చేసిన ఎగ్జిట్ పోల్ వివరాలను మే 12వ తేదీ తర్వాత ప్రకటిస్తానని లగడపాటి వెల్లడించారు.

కొత్త కూటమిని సృష్టించిన టీఆర్ఎస్

      ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయో ఏమో తెలియదుగానీ, టీఆర్ఎస్ మాత్రం కేంద్రంలో ఎవరికి మద్దతు ఇవ్వాలా అనే విషయం మీద తెగ టెన్షన్ పడిపోతోంది. చాలాకాలం నుంచి యుపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ రాష్ట్ర విభజన తర్వాత యుపిఎ భజన చేయడం ఆపేసింది. కొంతకాలం బీజేపీ భాగస్వామి అయిన ఎన్డీయే వైపు చూసిన టీఆర్ఎస్ బీజేపీ, టీడీపీ మద్దతు కుదరడంతో ఎన్టీయేకి పచ్చి కొట్టేసింది. ఆ తర్వాత కొంతకాలం థర్డ్ ఫ్రంట్‌ అనే మాటని పట్టుకుని వేలాడింది. కొంతకాలం తర్వాత థర్డ్ ఫ్రంట్ మీద మోజు తీరిపోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాలి కాంగ్రెస్ పార్టీ మీదకి మళ్ళింది. అందుకే మొన్నీమధ్యే ఆయన రాహుల్ గాంధీ కోరితే యుపీయేకి మద్దతు ఇస్తానని ప్రకటించారు. భూమి గుండ్రంగా వున్నట్టు టీఆర్ఎస్ మళ్ళీ యుపీఏ దగ్గరకి వచ్చింది కాబట్టి అక్కడితో ఆగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు చేస్తే అది టీఆర్ఎస్ ఎందుకవుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ కొత్త కూటమిని సృష్టించింది. ఆ కూటమి పేరు ‘లౌకిక కూటమి’. ఈసారి తమ పార్టీ మద్దతు లౌకిక కూటమికే వుంటుందని టీఆర్ఎస్ నాయకుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. టీఆర్ఎస్ ఊహల్లో పుట్టిన ఈ లౌకిక కూటమిని టీఆర్ఎస్ ఎంతకాలం లవ్ చేస్తుందో చూడాలి.

కడప సీమాంధ్ర రాజధానా?

      గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చాలా ఎంపీ సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. రాష్ట్రాన్ని దారుణంగా విభజించింది. ఆ కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్రమంత్రి జైరాం రమేష్ కూడా ఆంధ్రప్రదేశ్‌కి వెన్నుపోటు పొడిచాడు. ఈ మహానుభావుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకి ఎన్నికయ్యాడు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డగోలుగా రూపొందించి సీమాంధ్రులకు వెన్నుపోటు పొడిచిన ఘనాపాటీ జైరాం రమేష్. ఇప్పుడా జైరాం రమేషే కాంగ్రెస్ పార్టీకే మీ ఓట్లు వేయండని దేబిరిస్తూ సీమాంధ్రలో తిరుగుతున్నాడు. ఇంత వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌కి సీమాంధ్రులు ఎందుకు ఓటేస్తారనే కనీస పరిజ్ఞానం కూడా లేని జైరాం రమేష్ సీమాంధ్రలకు చేతగాని హామీలిస్తున్నాడు. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే సీమాంధ్రకు కడపని రాజధానిగా చేస్తాడట. ఈ హామీ ఇవ్వడానికి జైరాం రమేష్ ఎవరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయం కాబోతోంది. పైగా సీమాంధ్రకి ఏ ప్రాంతాన్ని రాజధాని చేయాలనే విషయం మీద ఆల్రెడీ ఓ కమిటీ పనిచేస్తోంది. ఆ కమిటీ సీమాంధ్ర రాజధాని ఎక్కడ వుండాలో డిసైడ్ చేస్తుంది. అలాంటప్పుడు జైరాం రమేషే అన్నీ డిసైడ్ చేసే పనయితే కమిటీలు కాకరకాయలు వేయడం ఎందుకు?

సోనియా అందుకే వైజాగ్ సభ రద్దు చేసుకోన్నారా?

  “చంద్రబాబుకి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే. తెదేపాకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే”, అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే, చంద్రబాబు కూడా “కేసీఆర్, జగన్, కిరణ్ లకు ఓటేస్తే అది కాంగ్రెస్ కి ఓటేసినట్లే. వారికి ఓటేస్తే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి ప్రజలు అంగీకరించినట్లే!” అని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.   వీరురువురి వాదనలు కూడా నూటికి నూరు శాతం నిజమని ఒప్పుకోక తప్పదు. ఎందువలన అంటే తెదేపా-బీజేపీలు బహిరంగంగానే పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తున్నాయి. మున్ముందు కూడా కలిసి పనిచేస్తామని వారే స్వయంగా చెప్పుకొంటున్నారు కూడా. కానీ కాంగ్రెస్ మాత్రం అటు కేసీఆర్, ఇటు జగన్మోహన్ రెడ్డిలతో రహస్య ఒప్పందాలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీయే గాక వారు ముగ్గురూ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.   తెదేపా-బీజేపీల స్నేహం ప్రజలందరికీ ప్రత్యక్షంగా కనబడుతున్నపుడు కాంగ్రెస్ చేస్తున్న వాదనకి అర్ధం లేదు. అది కేవలం మైనార్టీలను అభద్రతాభావానికి గురిచేసి వారి ఓట్లు దండుకోవడానికే తప్ప మరి దేనికీ కాదు. ఇక చంద్రబాబు కాంగ్రెస్-వైకాపా, తెరాసల మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించబడటానికి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు వేచి చూడవలసి ఉంటుంది.   'కానీ అంతవరకు ఎందుకు? నిన్న సోనియాగాంధీ వైజాగ్ లో తన సభను రద్దు చేసుకొని గుంటూరులో నిర్వహించడమే వారి రహస్య అవగాహనకు నిదర్శనమని' చంద్రబాబు వాదిస్తున్నారు. వైజాగ్ నుండి వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ లోక్ సభకు పోటీ చేస్తునందున, ఆమె విజయావకాశాలు దెబ్బ తీయడం ఇష్టం లేకనే సోనియా వైజాగ్ సభను రద్దు చేసుకొని గుంటూరులో సభ నిర్వహించారని, అదే వారి పార్టీల మధ్య ఉన్న రహస్య అవగాహనికి ఒక మంచి నిదర్శనమని చంద్రబాబు వాదన. అయితే తెలంగాణా కేసీఆర్ కోసం, సీమాంద్రాలో జగన్మోహన్ రెడ్డి కోసం తన స్వంత పార్టీ నేతలనే వదులుకొన్న సోనియాగాంధీకి, విజయమ్మ కోసం వైజాగ్ లో తన సభను రద్దు చేసుకోవడం, అక్కడ నుండి పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్ధిని బలి చేయడం పెద్ద విశేషమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లు నిన్న సోనియాగాంధీ గుంటూరులో నిర్వహించిన సభకు పట్టుమని మూడు వేలు మంది జనాలు కూడా రాలేదు. పాపం  

రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ స్వంతం, అవినీతి మాత్రం జగన్ పద్దులోనేనట!

  కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నిన్న మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమయిన విషయాలు మాట్లాడారు. మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగానే వ్యవహరించారని మెచ్చుకొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పధకాలు అన్నీ కాంగ్రెస్ పార్టీకే చెందుతాయని అన్నారు.   కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డి ఫోటోను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను వైకాపాకు చెందిన జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారని జైరామ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీయే తనను జైలులో పెట్టించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. జగన్ అవినీతికి పాల్పడినందుకే జైలు పాలయ్యారని, ఈ విషయంలో కాంగ్రెస్ ఎన్నడూ జోక్యం చేసుకోలేదని అన్నారు. అనేక అవినీతి కేసుల్లో ఇరుకొని బెయిలుపై బయటకు వచ్చిన అటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాని అన్నారు. జగన్ నేడు కాకపోతే రేపయినా జైలుకి వెళ్ళక తప్పదని అన్నారు. దిగ్విజయ్ సింగ్ చెపుతున్నట్లు అతనిది తమ కాంగ్రెస్ పార్టీ డీ.యన్.ఏ.కానేకాదని అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నేతలెవరూ జైలులో గడిపివచ్చిన దాఖలాలు లేవని అన్నారు.   జైరామ్ రమేష్ మాటలలో గమనించాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను స్వంతం చేసుకొన్నారు. కానీ ఆయన హయంలోనే జరిగిన అవినీతి, అక్రమాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పద్దులో వ్రాసేసారు. వైయస్సార్ తమ పార్టీ వాడని చెప్పుకొంటున్నపుడు, ఆయన హయంలో జరిగిన అవినీతి కూడా కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని ఆయన అంగీకరించి ఉండి ఉంటే చాలా బాగుండేది.   ఆయన హయంలో జరిగిన అవినీతికి, ఆ తరువాత కాలంలో సబితా, ధర్మాన, మోపిదేవి తదితరులు తమ పదవులు పోగొట్టుకోవడం, అనేకమంది ఐఎయస్ అధికారులు, పారిశ్రామిక వేత్తలు కూడా జైలు పాలవడం జైరామ్ కి గుర్తుకు రాకపోవడం విశేషమే. ఆ పాపం అంతా ఏ పార్టీ పద్దులో వ్రాయాలో ఆయనే చెపితే బాగుండేది.   జగన్మోహన్ రెడ్డి కేసులు, జైలు, బెయిలు విషయంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోలేదని జైరామ్ బుకాయించడం మరో విచిత్రం. మాజీ కాంగ్రెస్ మంత్రి శంకర్ రావు ద్వారా కోర్టులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేఖంగా పిటిషను వేయించింది ఎవరు? సీబీఐ కేసులు వేగవంతం చేయించేందుకు, ఎవరికీ వెరవని ముక్కుసూటిగా పోయే నిజాయితీ పరుడని పేరుగల సీబీఐ డైరెక్టరు లక్ష్మినారయణను హడావుడిగా మహారాష్ట్ర నుండి హైదరాబాద్ రప్పించి జగన్ కేసులు ఎందుకు అప్పగించినట్లు? ఆయన దర్యాప్తు పూర్తిచేసి చార్జ్ షీట్లు దాఖలు చేస్తుంటే మళ్ళీ అంతే హడావుడిగా ఆయనను మహారాష్ట్రకు ఎందుకు బదిలీ చేసినట్లు? ఆ వెంటనే జగన్ తో సహా అందరికీ జైలు ద్వారాలు ఏవిధంగా ఎందుకు తెరుచుకొన్నాయి?వంటి విషయాలు కూడా ఆయన వివరించి ఉండి ఉంటే బాగుండేది.   కరడుగట్టిన కాంగ్రెస్ వాదులని పేరుపడ్డ లగడపాటి, రాయపాటి, హర్షకుమార్, ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి తదితరులు, తమ అధిష్టానం స్వంత కొడుకుల వంటి తమను కాదని దత్తపుత్రుడు వంటి జగన్మోహన్ రెడ్డిని చేరదీస్తోందని చేసిన ఆరోపణలు అబద్దమా? జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం రహస్య ఒప్పందం చేసుకోందని వారు చేస్తున్న ఆరోపణలు అబద్దమా? అనే విషయాలు కూడా జైరామ్ రమేష్ కాస్త వివరించి ఉండి ఉంటే బాగుండేది.   కిరణ్, జగన్, కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని వీడిన అనేకమంది నేతలు అందరూ తమని మోసం చేసారని జైరామ్ రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు తమ అధిష్టానంతో చివరివరకు సహకరించారని చెపుతున్న చిరంజీవి, రఘువీరా రెడ్డిలకు జైరామ్ రమేష్ ఏమని సమాధానం చెపుతారు? కాంగ్రెస్ అధిష్టానం వారితో రహస్య ఒప్పందాలు చేసుకొని తెరవెనుక గ్రంధం నడిపిస్తూనే, ఈవిధంగా మాట్లాడుతున్న ఆయనే ప్రజలను మోసం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని మాటలు చెపుతున్న జైరామ్ రమేష్ రేపు అదే జగన్, కేసీఆర్ లతో చేతులు కలపమని, వారి మద్దతు తీసుకోమని హామీ ఇవ్వగలరా?

ప్రధాని కుర్చీకి ‘ఆమాద్మీ నిచ్చెన’ వేస్తున్న నితీష్

    బీజేపీ నరేంద్ర మోడీని తన ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం నచ్చక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుండి బయటకి వచ్చేసారు. వెనుకబడిన బీహార్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాట పట్టిస్తున్నాడనే మంచి పేరు సంపాదించుకొన్న ఆయనను వలేసి పట్టేదామని కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేసింది. ఆయనకు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ, ప్రధానమంత్రి కావలని కోరుకొంటున్న నితీష్ కుమార్, కాంగ్రెస్ తో చేతులు కలిపితే, రాహుల్ గాంధీ ఉండగా జీవితంలో తనకి ఆ అవకాశం రాదనే సంగతి గ్రహించి, ప్రతీ ఎన్నికల ముందు పుట్టుకొచ్చే థర్డ్ ఫ్రంటులో జేరారు. అయితే అందులో కూడా తనలాగే ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నవారు కనీసం ఒక అరడజను మంది ఉండటంతో, నితీష్ కుమార్ చాల నిరాశ చెందారు.   సరిగ్గా ఇటువంటి సమయంలో ఆయన కంట్లో వారణాసి నుండి తన ప్రియ శత్రువు నరేంద్ర మోడీపై పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ కి ప్రజలలో ఎంతమంచి పేరున్నప్పటికీ సరయిన రాజకీయ అవగాహన, పరిణతి లేకపోవడంతో పదేపదే భంగపడుతున్నారు. అయినప్పటికీ చాలా దైర్యంగా నరేంద్ర మోడీ అంతటివాడిని డ్డీ కొనేందుకు సిద్దపడ్డారు. అయితే నామినేషన్ వేసినప్పటి నుండి నేటివరకు కూడా ఆయనకు ఎక్కడో అక్కడ మోడీని సమర్దిస్తున్న వారి చేతిలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కేజ్రీవాల్ ఏటికి ఎదురీదుతూనే ఉన్నారు.   ఇది చూసి నితీష్ కుమార్ ఆయనకు మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. కేజ్రీవాల్ తో చేతులు కలిపి వారణాసిలో మోడీ యొక్క విజయావకాశాలు దెబ్బతీయగలిగితే, దాని వలన ఆయనకు ప్రధానమంత్రి చెప్పట్టడానికి పార్టీలో అంతర్గతంగా ఇబ్బందికర పరిస్థితులు కలిగే అవకాశం ఉంది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి మద్దతు ఈయడం ద్వారా, ఆయన మోడీని ఓడించినా ఓడించాకపోయినా, మున్ముందు అవసరమయితే ఆమాద్మీ పార్టీ మద్దతు ఆశించవచ్చును కూడా.   ఇక కాంగ్రెస్ పార్టీ తాను మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశంలేన్నట్లయితే థర్డ్ ఫ్రంటుకి మద్దతు ఇస్తానని ప్రకటించింది. ములాయం సింగు తో పోలిస్తే నితీష్ కుమార్ కి మంచి ‘క్లీన్ ఇమేజ్’ ఉంది. మంచి పరిపాలనా దక్షుడు అనే మంచి పేరు కూడా ఉంది. గనుక, నితీష్ కుమార్ తన కల సాకారం చేసుకొనేందుకు, ఆమాద్మీని కూడా దువ్వేందుకే, అరవింద్ కేజ్రీవాల్ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉండవచ్చును. ఈలోగా నితీష్ కుమార్ థర్డ్ ఫ్రంటులో ఇతర భాగస్వాములను కూడా మెల్లగా దువ్వి తనవైపు త్రిప్పుకొనగలిగితే, కాంగ్రెస్ మద్దతుతో ప్రధానమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోవచ్చని పావులు కదుపుతున్నారు.   కానీ, రాహుల్ గాంధీ ‘జన్మహక్కు’ అయిన ప్రధానమంత్రి కుర్చీలో వేరేవారిని కాంగ్రెస్ అధిష్టానం కూర్చోనిస్తుందా? కూర్చోనిస్తే ఎంతకాలం కూర్చోనిస్తుంది? అనే ప్రశ్నలకు జవాబులు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే దొరుకుతాయి. నితీష్ కుమార్ మాత్రం చాప క్రింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు.

సీమాంద్రులకు పోలవరం తాయిలం

  పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవన్నట్లు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనేక అవలక్షణాలు, దురలవాట్లు అంత త్వరగాపోవని ఈరోజు మరొకమారు నిరూపించుకొంది. ఈరోజు అత్యవసరంగా సమావేశమయిన కేంద్ర మంత్రి వర్గం పోలవరం ప్రాజెక్టుని పర్యవేక్షించేందుకు పోలవరం అధారిటీ నియామకానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజనను పర్యవేక్షించడానికి నియమింపబడిన కేంద్రమంత్రుల బృందం, పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానికి అవసరమయిన నిధులు, అనుమతులు అన్నీ కేంద్రమే చూసుకొంటుందని ఆరు నెలల క్రితమే ప్రకటించింది. అయితే ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. కారణం పోలవరం ఊసు ఎత్తితే, అది కేసీఆర్ కి ఒక ఆయుధంగా మారుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టమే తప్ప ఎటువంటి లాభమూ లేదు. కానీ ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికలు పూర్తయిపోయాయి గనుక ఇక పోలవరం గురించి నిర్భయంగా మాట్లాడుకోవచ్చును. మరొక ఆరు రోజులలో సీమాంధ్రలో ఎన్నికలు జరుగబోతున్నందున, కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలను ప్రసన్నం చేసుకోవాలంటే, ఇటువంటి తాయిలం ఏదో ఒకటి పట్టుకురాక తప్పదు. నేడో రేపో సీమాంద్రాలో ఎన్నికల ప్రచారానికి రానున్న సోనియా, రాహుల్ తదితరులు, ప్రజలను మంచి చేసుకోవడానికి ఇటువంటి మాయమాటలేవో చెప్పక తప్పదు.   ఇవి మాయమాటలని ఎందుకు అనవలసి వస్తోంది అంటే పోలవరం ప్రాజెక్టుపై అటు పైనున్న తెలంగాణాలో తెరాస నేతలు, క్రిందనున్న ఒరిస్సా ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం చెపుతున్నారు. తెలంగాణాలో ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన తేవడానికి కూడా భయపడిన కాంగ్రెస్ పార్టీ, రేపు ఎన్నికల తరువాత అదృష్టవశాత్తు కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా, అందరి మద్దతుతో ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టుని ఎంతవరకు పట్టించుకొంటుంది? అనే అనుమానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పోలవరంపై నిజంగా అంత శ్రద్ధ, ఆసక్తి ఉండి ఉంటే ఇన్నేళ్ళుగా దానిని నాన్చుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసేదే కాదు. కానీ చేసింది అంటే కాంగ్రెస్ ఆలోచనలలో వీసమెత్తు నిబద్దత కానీ, చిత్తశుద్ది గానీ లేదని అర్ధమవుతోంది.   కాంగ్రెస్ అధిష్టానానికి తమ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. ఆ నమ్మకంతోనే నోటికి వచ్చిన హామీలు గుప్పిస్తోంది. లాభం లేనిదే కోమటి ఆమడ దూరం నడవడు అన్నట్లు, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు రాజకీయ ప్రయోజనం ఉంటుందనే నమ్మకంతోనే ఎన్నికల ముందు తెలంగాణా ఏర్పాటు చేసింది. ఇప్పుడు సీమాంద్రాలో గెలిచేందుకే ఇంత హడావుడిగా పోలవరం ప్రాజెక్టు అధారిటీకి అనుమతి మంజూరు చేసింది.

చెన్నై సెంట్రల్ స్టేషన్ లో బాంబు ప్రేల్లుళ్ళు

  ఈ రోజు ఉదయం 7.15 గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్ లో రెండు బాంబు ప్రేల్లుళ్ళు జరిగాయి. అందులో గుంటూరుకు చెందినా స్వాతి (22) అక్కడికక్కడే మరణించగా, మరో 14మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గౌహతి నుండి వయా చెన్నై బెంగుళూరు వెళ్ళవలసిన గౌహతీ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం సుమారు 5.15గంటలకు చెన్నై సెంట్రల్ స్టేషన్ లో 9వ నెంబర్ ప్లాట్ ఫారంపైకి చేరుకొంది. ఉదయం సరిగ్గా 7.12గంటలకు ఆ రైలులో యస్4 బోగీలో మొదటి ప్రేలుడు జరగగా మళ్ళీ రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే 7.15గంటలకు పక్కనున్న యస్.5 బోగీలో మరో ప్రేలుడు జరిగింది. ప్రేలుడు జరిగిన సంగతి తెలుసుకోగానే అక్కడికి చేరుకొన్న రైల్వే పోలీసులు, అధికారులు గాయపడినవారిని హుటాహుటిన స్థానిక రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. చెన్నై నుండి బయలు దేరవలసిన కొన్ని రైళ్ళను రద్దు చేయగా, చెన్నైకి రావలసిన మరికొన్ని రైళ్ళను వేరే స్టేషన్లకు మల్లిస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు బృందాలు స్టేషన్ను పూర్తిగా తమ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఉగ్రవాదుల కుట్రే అని భావిస్తున్నారు. ఈ సంగతి తెలియగానే హైదరాబాద్ నుండి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు హుటాహుటిన చెన్నై బయలుదేరి వెళ్ళారు. హెల్ప్ లైన్ నెంబర్:040-25357398