జుట్టు పెరగడం లేదు?? మీలోనూ ఈ కారణాలు ఉన్నాయేమో చూడండి!

 

జుట్టు పెరగడం లేదు?? మీలోనూ ఈ కారణాలు ఉన్నాయేమో చూడండి!

పొడవాటి అందమైన శిరోజాలు ప్రతి అమ్మాయి కల. ఒకప్పుడు అయితే ఎంతోమంది అమ్మాయిలకు వాలుజడ ఉండేది. నల్లని రంగుతో ఆ జడ చెప్పలేనంత అందాన్ని ఇచ్చేది అమ్మాయిలకు. కానీ ఇప్పుడో…..

చిన్నప్పుడు బానే ఉంటుంది చాలా మందికి. కానీ ఓ వయసు వచ్చేసరికి అలా రాలిపోతూ ఉంటుంది. పోనీ మళ్ళీ పెరుగుతుందా అంటే అదీ లేదు. తీసుకునే ఆహారం నుండి తాగే నీరు, పీల్చే గాలి, బయటి కాలుష్యం ఇలా అన్ని కలిసి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే చిన్నవయసులో జుట్టు రంగు మారడం నుండి జుట్టు ఎదుగుదల లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే జుట్టు పెరగకపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని ఉంటాయి.

అధిక వేడి!!

జుట్టుకు అధిక వేడిని ఉపయోగించడం వల్ల పెరుగుదల మందగిస్తుంది. బాగా వేడిగా ఉన్న నీటిని తలస్నానం కోసం ఉపయోగించడం నుండి జుట్టు స్టయిల్ కోసం ఉపయోగించే స్ట్రైటనర్ వంటి వస్తువుల వాడకం వరకు ఎన్నో జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. అధిక వేడి జట్టులో ఉండే కెరాటిన్ ఆకారాన్ని మార్చేస్తుంది. దీనివల్ల జుట్టు గరకుగా, బలహీనంగా మారుతుంది.

హెయిర్ కేర్ లేకపోవడం!!

జుట్టు సంరక్షణ లేకపోతే అది ఒక దశ తరువాత పెరగడం ఆగిపోతుంది. అందుకే జుట్టుకు ఒక నియమానుసారంగా పోషణను అందిస్తూ ఉండాలి. జుట్టుకు ఆయిలింగ్ నుండి తల స్నానం చేయడం, హెయిర్ ప్యాక్ లు వేయడం, మాశ్చరైజర్ లు వాడటం వంటివి కూడా ఒక క్రమ పద్ధతిలో జరగాలి. లేకపోతే చుండ్రు, జుట్టు రాలడం, పొడిబారడం, రంగు మారడం వంటివి చాలా తొందరగా చోటుచేసుకుంటాయి.

జుట్టు చిట్లడం!!

జుట్టు చివర్లు చిట్లడం  వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. అందుకే చిట్లిపోయే వెంట్రుకలను చివర్లు కత్తిరించడం ముఖ్యం. ఇదొక్కటే ఈ సమస్య పరిష్కారానికి మార్గం కూడా. జుట్టు చిట్లడం అంటే దానికి సరైన పోషణ అందడం లేదని అర్థం. మరీ ముఖ్యంగా జుట్టుకు తేమ అందాలి. అది అందకపోతే మృదుత్వం కోల్పోయి జుట్టు చిట్లిపోతూ విరిగిపోతూ ఉంటుంది.

పోషకాహార లోపం!!

పోషకాహారం లోపిస్తే జుట్టు  పెరుగుదల ఆగిపోవడం, జుట్టు పలుచబడటం, రంగు మారడం ఇంకా చెప్పాలంటే జట్టులో జీవం కోల్పోవడం జరుగుతుంది. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, బయోటిన్ లోపం ఎక్కువగా ఉంటే జుట్టు కూడా ప్రమాదకర పరిస్థితులలో ఉన్నట్టే అనే విషయం తెలుసుకోవాలి.

ఆరోగ్య సమస్యలు!!

థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక మందులు వాడటం, అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు జుట్టు పెరుగుదలలో ఇబ్బందులు ఎదురవుతాయి. వీటికి ఎన్ని రకాల ప్రొడక్ట్ లు వాడినా ఫలితం కనిపించదు. 

జాగ్రత్తలు!!

వాతావరణ మార్పులకు తగిన జాగ్రత్తలు కేవలం చర్మ సంరక్షణ విషయంలో తీసుకుంటూ ఉంటారు చాలామంది. కానీ జుట్టు విషయంలో కూడా ఇది అవసరమే. చల్లని వాతావరణానికి, వేడి వాతావరణానికి, వర్షా కాలానికి ఇలా వేరు వేరు కాలాలకు తగ్గట్టుగా వేరు వేరు టిప్స్ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వకపోతే జుట్టు దాని స్థితిని కోల్పోతుంది.

పై కారణాలు అన్ని జుట్టు పెరుగుదలకు ఆటంకాలు కల్పించేవే. వాటిని సాల్వ్ చేసుకుంటే తప్ప జుట్టు పెరుగుదల ఆరోగ్యంగా సాగదు.

                                      ◆నిశ్శబ్ద.