మొటిమలకు ట్రీట్మెంట్ ఇలా...
మొటిమలకు ట్రీట్మెంట్ ఇలా...
చర్మ ఆరోగ్యం కావాలంటే జాగ్రత్తలు చాలా అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరికి యవ్వన దశలో మొటిమల గోల తప్పదు. ఇంకా కొన్ని కారణాల వల్ల ఇది అలా వయసుతో సంబంధం లేకుండా కొనసాగుతూ ఉంటుంది. అబ్బాయిలకు ముఖం మీద మొటిమలు వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ అమ్మాయిలకు ముఖం మీద మొటిమలు వస్తే కంగారు పడిపోతారు.
మొటిమలు కేవలం మొటిమల్లా వచ్చిపోతే అదేమీ సమస్య కాదు. కానీ మొటిమలు వికృత రూపం దాలుస్తాయి. అవి పెరిగి పెద్దయ్యి నొప్పి పెడుతూ ముఖాన్ని మొత్తం ముప్పుతిప్పలు పెడతాయి. పొక్కులుగా మారి పుండ్ల రూపంలోకి దారితీస్తాయి. వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ముఖం మీద శాశ్వత ముద్రను వేసి వెళతాయి. ఈ మొటిమల వికృత రూపాలను, వాటి తాలూకూ గుర్తులను వదిలించుకోకపోతే ముఖం అంతా అంద విహీనంగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే చర్మ సంబంధ నిపుణులు అభ్యంతరం చెప్పని, సహజమైన, సురక్షితమైన చిట్కాలను పాటించాలి. బ్యూటీ ఎక్స్పర్ట్ లు సైతం ఎలాంటి సందేహం లేకుండా ఫాలో అయిపోవచ్చని సూచించే కొన్ని మార్గాలు ఇక్కడున్నాయి. వాటిని ఫాలో అయిపోతే చాలు…
రోజ్ వాటర్ మ్యాజిక్!!
రోజ్ వాటర్ గురించి తెలియని అమ్మాయి ఉండదు. దాన్ని ఉపయోగించని వారుండరు. ఖచ్చితంగా ప్రతి అమ్మాయి బ్యూటీ ప్రొడక్ట్ లిస్ట్ లో రోజ్ వాటర్ ఉంటుంది. ఈ రోజ్ వాటర్ ను యాస్ట్రింజెంట్ సమపాళ్లలో కలుపుకోవాలి. మొదట ముఖం శుభ్రంగా కడిగి, మెత్తని పొడిబట్టతో తుడిచి, తయారుచేసుకున్న మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేయాలి.
ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకి 3 సార్లు చేస్తే మొటిమలు మెల్లగా తగ్గుముఖం పడతాయి.
పసుపు, పెరుగు
పసుపు సహజ యాంటీ బయటిక్, పెరుగు సహజ మాశ్చరైజర్. ఈ రెండు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం మీద అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి.. తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. ఇది మొటిమలు తొలగించడంతో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
గంధం, రోజ్ వాటర్
రోజ్ వాటర్ గురించి ఇదివరకే చెప్పుకున్నాం. అయితే గంధం గురించి చెప్పుకోవాలి. గంధం వేడి తగ్గిస్తుంది. సహజంగా అమ్మాయిలకు మొటిమలు వచ్చేది వేడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. గంధం పొడికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ చేర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి. ముఖం మీద మొటిమలు ఉన్న చోట ఈ పేస్ట్ రాసి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
వేప ఆకులు
వేప సహజ యాంటీ బయటిక్. ఇందులో ఉన్న గుణాలు ఇన్ఫెక్షన్ లను అరికడతాయి. గుప్పెడు వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఈ ఆకులను కొద్దిసేపు నీళ్లలో మరిగించాలి. నీళ్లు రంగు మారి ఆకుపచ్చగా అవుతాయి. అప్పుడు నీటిని వడగట్టి, వేడి తగ్గిన తరువాత ఆ నీటితో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి.
ఇలా అమ్మాయిలను వేధించే మొటిమలకు సహజమైన ట్రీట్మెంట్ సొంతంగా చేసుకోవచ్చు. మొటిమలకు బై బై చెప్పవచ్చు.
◆నిశ్శబ్ద.