స్కిన్ రహస్యం తెలుసుకోండి!
స్కిన్ రహస్యం తెలుసుకోండి!
మహిళలు రోజువారీ పాటించే రొటీన్ లో స్కిన్ కేర్ అనేది ఒక భాగం. అయితే చాలామంది తమది ఏ రకమైన చర్మం అనేది తెలియకుండా స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తే చర్మం చాలా నష్టానికి గురవుతుంది. సదరు మహిళలు మాత్రం మేము మంచి టిప్స్ ఫాలో అయ్యాం కదా!! ఇవన్నీ నేచురల్ టిప్స్ ఏ కదా!! అయినా ఎందుకు ఇలా జరుగుతోంది?? అనే ప్రశ్నలు వేసుకుని సతమతమయిపోతూ ఉంటారు. చర్మం రకాలు తెలుసుకోవటం వల్ల వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోగల అవకాశం వుంటుంది. ఒక్కొక్కరు ఒకరకమైన చర్మం కలిగి ఉంటారు. వాటి ఆధారంగానే స్కిన్ కేర్ పాటించాల్సి ఉంటుంది. మరి చర్మం రకాలు తెలుసుకుందాం….
నార్మల్ స్కిన్ (సాధారణ చర్మం) :
ఈ చర్మం ఆయిల్, వాటర్ రెండింటిని సమపాళ్ళలో కలిగి వుంటుంది. అందువల్ల చూడడానికి ఎంతో అందంగా వుంటుంది. ఇటువంటి చర్మాన్ని రోజు క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేయాల్సి వుంటుంది. ఈ చర్మతత్వం నున్నగా ఉండి ఎలాంటి మచ్చలు లేకుండా ఉండటం ప్లస్ పాయింట్ అయితే. ఈ చర్మానికి సరైన జాగ్రత్త తీసుకోనట్లయితే మిగిలిన చర్మాల కంటే త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. ఆహారం విషయంలో తగిన శ్రద్ద, నియమిత ప్రకారం సరిపడినంత నిద్రపోతే ఈ చర్మానికి సంభవించే ఇబ్బందులను నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ చర్మం గలవారు తక్కువ మేకప్ చేసుకోవాలి. మంచినీటిని అధికంగా తాగాలి.
కాంబినేషన్ స్కిన్(మిశ్రమ చర్మం) :
ఈ రకం చర్మం ఒకచోట జిడ్డుగా మరోచోట పొడిగా ఉంటుంది. నేటి యువతులు ఈ చర్మాన్ని అధికంగా కలిగివుంటున్నారు. ముఖ్యంగా టి. జోన్ అంటే నుదురు, ముక్కు, గడ్డం జిడ్డుగా వుంటుంది. నిజానికి ఇటువంటి చర్మం కలవారు తమది ఏ చర్మమో తెలుసుకోలేక అవస్థ పడుతుంటారు. ట్రీట్మెంట్ తీసుకొనేటప్పుడు ఈ రకమైన చర్మానికి వేర్వేరుగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. నిత్యం తీసుకునే ఆహారం, వ్యాయామం, నిద్రకూడా ఈ చర్మ సంరక్షణకు ఎంతో ఉపయోగం.
ఆయిల్ స్కిన్ (జిడ్డు చర్మం) :
ఈ రకం చర్మం వారికి త్వరగా ముడతలు రావు. కారణం వీరి శరీరంలో సెబాషియస్ గ్రంథులు, అధికంగా అయిల్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ సెబాషియస్ గ్రంధులు అధికంగా ఆయిల్ ను ప్రొడ్యూస్ చేస్తే బ్లాక్ హెడ్స్, మొటిమలు రావడానికి అవకాశాలు ఎక్కువే. కాబట్టి ఈ చర్మానికి కూడా ప్రత్యేకమైన సంరక్షణ అవసరమే.
డ్రై స్కిన్ (పొడి చర్మం):-
ఈ రకం చర్మం గలవారి చర్మంలో తేమ తక్కువ. పల్చగా, పొడిగా, ముడతలుగా, చారలుగా చర్మం కనిపిస్తుంది. ఈ చర్మం గలవారు సబ్బును వాడకుండా వుంటే మంచిది. కొన్నిసార్లు విటమిన్ 'సి' లోపించినప్పుడు కూడా చర్మం పొడిగా మారవచ్చు. వీరిలో కళ్ళు మరియు నోటి చుట్టూ చర్మం పొడిగా వుండి త్వరగా ఎలర్జీలకు గురయ్యే ప్రమాదం వుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం మరింత పొడిగా మారుతుంది.
పైవిధంగా చెప్పినట్లు వివిధ రకాలైన చర్మాలు వుంటాయి. అయితే చర్మం ఏ కోవకు చెందినప్పటికీ ప్రతిరోజూ తాజాకూరలు, పండ్లు, సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం మొదలగు వాటి ద్వారా దానిని పరిరక్షించుకోవచ్చు. మీ చర్మాన్ని కళకళలాడించడానికి గాను ఫేషియల్స్ కూడా చేయించుకోవచ్చు. ఫేషియల్ చేయటం అంటే ఒకవిధంగా చర్మాన్ని మసాజ్ చేయటమే. దీని వలన చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. తద్వారా అందంగా కనిపించే అవకాశం వుంది. కాబట్టి మహిళలూ ఈ విషయాన్ని మరచిపోవద్దు.
◆నిశ్శబ్ద.