శిరోజాల సంరక్షణ సులభంగా.. ఇదిగో ఇలా..
శిరోజాల సంరక్షణ సులభంగా.. ఇదిగో ఇలా..
మహిళల అందంలో ప్రధాన పాత్ర పోషించేవి శిరోజాలు. పొడవాటి అందమైన జుట్టు అందరూ అమ్మాయిల కల. కొందరు నాకు ఇలాగే బాగుంటుంది అంటూ షార్ట్ గా ఉన్న తమ జుట్టు చూపించి చెబుతూ ఉంటారు. కానీ నిజానికి పొడవుగా జుట్టు పెరిగితే కాదనుకునే వెఱ్ఱివాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ముఖ్యంగా భారతీయ అమ్మాయిలకు జుట్టు ఒక సెంటిమెంట్ కూడా. అయితే కాలం మారుతున్న కొద్ది అన్నిరకాల కాలుష్యాలు పెరిగి వాతావరణం వల్ల, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఆహారం వల్ల జుట్టు డ్యామేజ్ అయిపోతుంది. అది క్రమంగా జుట్టును నిర్జీవంగా మారుస్తుంది.
అయితే శిరోజాలను కాపాడుకోవలసిన అవసరం గురించి ఇప్పుడిప్పుడే అందరిరికీ అవగాహన వస్తున్నట్టు సహజంగా జుట్టును కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. మనం ఎంత ఆరోగ్యంగా వున్నామన్నది. మన శిరోజాలను బట్టి చెప్పవచ్చు...!
చేసే తప్పులు...
చాలా మంది స్త్రీలు శిరోజాలు తడిగా వున్నప్పుడు తలను దువ్వుతారు. కాని అలా దువ్వడం వల్ల కుదుళ్ళలో నుండి వెంట్రుకలు వూడిపోయే అవకాశముంది. శిరోజాలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దువ్వుకోవాలి.
ప్రస్తుత కాలంలో స్త్రీలు తలకు నూనె రాయడం మానేస్తున్నారు. అది ఫ్యాషన్ అనుకుంటున్నారు. తలకు నూనె రాయడం వల్ల వెంట్రుకలు బలంగా తయారవుతాయి. అంతే కాకుండా మనకి ఆహారము ఎంత అవసరమో శిరోజాలకు నూనె అంతే అవసరం. మనం తలారా స్నానం చేసిన తర్వాత తలను తడిగా వుంచుకోకూడదు. ఎందుకంటే అలా తడిగా వుంచటం వల్ల చుండ్రు పట్టే అవకాశముంది.
చుండ్రు ఎక్కువగా వున్నవారు టమోటా గుజ్జు తలకి పట్టించి మర్దనా చేసి కొంచెంసేపాగి తలస్నానం చేస్తే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. తలలో చుండ్రు ఎక్కువగా వుండటం వల్ల మొఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడే అవకాశముంది. తలని శుభ్రంగా వుంచుకుంటే ముఖాన్ని కూడా అందంగా వుంచుకోవచ్చు.
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా శిరోజాలు బలంగా తయారవుతాయి. మనం తీసుకునే ఆహారంలో ఐరన్, జింక్, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ లు వుండేలా చూసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా వుంటాయి.
వీటికోసం తాజా ఆకు కూరలు, దోసకాయలు, రొట్టె, గ్రుడ్లు, చేపలు తీసుకోవాలి.
జుట్టు రాలిపోతున్నవారు, చుండ్రు వున్నవారు పొన్నగంటి కూరని వాడుకోవచ్చు. పొన్నగంటి కూరని నీటిలో ఆరబెట్టి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. వారానికొకసారి 1 కప్పు గోరింటాకు పొడి 1 కప్పు పొన్నగంటి కూర పొడి, 1/4 కప్పు మెంతుల పొడి, అరచెక్క నిమ్మరసం, 1/2 కప్పు పెరుగు అన్నింటిని పేస్ట్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. అలా చేసినట్లయితే జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
మన వెంట్రుకలు ఆరోగ్యంగా నల్లగా నిగనిగలాడాలంటే జుట్టుకు కండీషనర్స్ ని వాడటం వలన వెంట్రుకలు మెరుపు కలిగి ఆరోగ్యంగా కనబడుతుంది. బిరుసు జుట్టు గల వారికి ఇది ఎంతో ప్రయోజనకరము. వారానికి మూడు సార్లు ఉపయోగించటం మంచిది. ఈ విధంగా చేసినట్లయితే జుట్టును ఆరోగ్యంగా బలంగా, తయారు చేసుకోవచ్చు. కాబట్టి మరికెందుకు ఆలస్యం పాటించేయండి. జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుకోండి.
◆నిశ్శబ్ద.