జీవితంలో నమ్మకమైన వ్యక్తులు కావాలంటే.. ఈ నాలుగు సూత్రాలు పాటించండి..!
చాణక్యుడు చెప్పిన మాట.. జీవితంలో నమ్మకమైన వ్యక్తులు కావాలంటే.. ఈ నాలుగు సూత్రాలు పాటించండి..!
గొప్ప రాజకీయవేత్త, ఆర్థికవేత్త, నైపుణ్యం కలిగిన విధాన రూపకర్తగా ఆచార్య చాణక్యుడు చరిత్రలో తనదైన ముద్ర వేశాడు. ప్రసిద్ధ పుస్తకం 'చాణక్య నీతి'లో జీవితంలోని వివిధ అంశాలకు సంబంధించిన లోతైన, ఆచరణాత్మక విషయాలను ఎంతో తర్కంగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలు పురాతన కాలంలో ఉన్నట్లే నేటి జీవితాలకు, వ్యక్తులకు కూడా చాలా అనుబంధంగా ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని సూత్రాలను పాటిస్తే తన జీవితంలో నమ్మకమైన వ్యక్తులను పొందవచ్చని ఆచార్య చాణక్యుడు తెలియజేశాడు. ఆ సూత్రాలు ఏంటో తెలుసుకుంటే..
చాణక్య నీతి ఐదవ అధ్యాయంలోని శ్లోకం..
"యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిఘర్షణం ఛేదనతపతదానైః.
తత్ చతుర్భిః పురుషం పరీక్ష్యతే త్యాగేన్ శీలేన్ గుణేన్ కర్మణా."
దీని అర్థం ఏమిటంటే స్వచ్ఛమైన బంగారాన్ని పరీక్షించడానికి, దానిని నాలుగు విధాలుగా పరీక్షిస్తారు. మొదట రుద్దడం ద్వారా, రెండవది కత్తిరించడం ద్వారా, మూడవది అగ్నిలో వేడి చేయడం ద్వారా, నాల్గవది కొట్టడం ద్వారా. అదేవిధంగా ఒక వ్యక్తి నిజమైన గుర్తింపు నాలుగు విషయాల ద్వారా నిర్ణయించబడుతుంది అని ఆచార్య చాణక్యుడు అంటున్నాడు.
ఒక వ్యక్తిని నమ్మే ముందు భవిష్యత్తులో మోసపోకుండా ఉండాలంటే అతని లక్షణాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ముఖ్యం. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తిని అంచనా వేయడానికి నాలుగు ప్రధాన ఆధారాలు ఉన్నాయి. త్యాగం, వ్యక్తిత్వం, లక్షణాలు, చర్యలు. ఈ నాలుగింటి గురించి వివరంగా తెలుసుకుంటే..
త్యాగ భావన..
ఒకరిని నమ్మే ముందు ఆ వ్యక్తి ఇతరుల మంచి కోసం తన సొంత ఆనందాన్ని ఎంత త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో చూడటం ముఖ్యం. ఒక వ్యక్తి ఇతరుల ఆనందం కోసం తన సొంత కోరికలను పక్కన పెట్టగలిగితే, అతను నమ్మకానికి మారుపేరుగా నిలుస్తాడు. నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి కష్ట సమయాల్లో కూడా తోడుగా ఉంటాడు.
వ్యక్తిత్వం..
స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అంటే మంచి మనసున్న వ్యక్తి. ఇతరుల గురించి చెడుగా ఆలోచించని వ్యక్తి. ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడిచే వ్యక్తిని విశ్వసించవచ్చు. మంచి వ్యక్తిత్వం అనేది ఒక వ్యక్తికి అతిపెద్ద గుర్తింపు.
లక్షణాలు..
ఎవరికైనా కోపం, సోమరితనం, గర్వం, అబద్ధాలు చెప్పే స్వభావం లేదా స్వార్థం వంటి లక్షణాలు ఉంటే వారిని నమ్మకూడదు. దీనికి విరుద్ధంగా ప్రశాంతంగా, మర్యాదగా, సత్యవంతుడిగా, సరళంగా ఉండే వ్యక్తి నమ్మకానికి అర్హుడు. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో కూడా మద్దతు ఇస్తారు.
మార్గం..
ఒక వ్యక్తి డబ్బు సంపాదనను తప్పుడు లేదా అనైతిక మార్గాల ద్వారా సంపాదిస్తుంటే అతన్ని నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి స్వార్థపూరిత కారణాల వల్ల ఎవరినైనా మోసం చేయగలడు. నిజాయితీగా, ధర్మంగా, నైతికత మార్గంలో పనిచేసే వారిని నమ్మవచ్చు. అందువల్ల, ఈ నాలుగు విషయాలలో వ్యక్తి ఉద్దేశాలను, స్వభావాన్ని పరీక్షించిన తర్వాతే ఒక వ్యక్తిని నమ్మాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తద్వారా జీవితంలో నమ్మకం అనే పునాది బలంగా ఉంటుంది.
*రూపశ్రీ.