చాణక్యుడు చెప్పిన ఈ మాటలు పాటిస్తే జీవితంలో కష్టాలే రావు..!
చాణక్యుడు చెప్పిన ఈ మాటలు పాటిస్తే జీవితంలో కష్టాలే రావు..!
రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం.. ఇట్లా ఎన్నో విషయాలలో ప్రావీణ్యత ఉన్న వ్యక్తి ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించడానికి ఎంతో గొప్పగా సహాయపడతాయి. అందుకే ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆయన చెప్పిన విషయాలు నేటికీ ఆనుసరణీయంగా ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాడు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే సమస్యలను నివారించడమే కాకుండా సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చని అంటున్నారు. అలాగే చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే అసలు జీవితంలో కష్టాలనేవి రావని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి కీలకమైన సమయం ఏదైనా ఉందంటే అది యువతగా ఉన్న సమయమే. కాబట్టి జీవితంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడంతో పాటు, కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. జీవితంలో విజయం సాధించడానికి, కష్టాలనేవి రాకుండా ఉండటానికి చాణక్యుడు కొన్ని విషయాలు చెప్పాడు.
చెడు అలవాట్లకు దూరం..
చెడ్డ గుణాలు వ్యక్తి ప్రతిభను నాశనం చేస్తాయి. తమ చెడ్డ గుణాలను అధిగమించని వారు తరువాత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి వ్యక్తులు నైపుణ్యం కలిగి ఉన్నవారైనా, ప్రతిభావంతులైనా, వారు తమ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. అందుకే చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలి.
సోమరితనానికి దూరం..
సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. కష్టపడి పనిచేసేవారికి, తమ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేసేవారికి మాత్రమే విజయం వస్తుంది. తమ లక్ష్యాలను సాధించడానికి అభిరుచితో పాటు, అంకితభావం కలిగి ఉండకపోతే విజయం లభించడం కష్టం. కాబట్టి కష్టపడి పనిచేయాలి, లక్ష్యం సాధించే వరకు పని చేస్తూనే ఉండాలి. ఇలా ఉండే కష్టం అనేది వ్యక్తిని ఇబ్బంది పెట్టదు.
మంచి భాష..
ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించే వారు, నిరంతరం కఠినమైన భాషను ఉపయోగించే వ్యక్తిని ఇతరులు ఇష్టపడరు. అలాంటి మాటలు, ప్రవర్తన సంబంధాలను బలహీనపరచడమే కాకుండా, వ్యక్తిత్వాన్ని, కీర్తిని దెబ్బతీసి చెడుగా మారుస్తుంది. మంచి భాష, ఇతరులతో మంచిగా మాట్లాడటం, అందరినీ గౌరవించి మాట్లాడటం, ఎదుటివారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం, ఇతరులు చెప్పింది శ్రద్దగా వినడం.. ఇవన్నీ వ్యక్తిని కష్టాలకు దూరంగా ఉంచుతాయి.
విజయం కోసం కృషి..
ఏదైనా పనిని ఎప్పుడూ వాయిదా వేస్తూ కష్టపడి పనిచేయకుండా ఉండే వ్యక్తులు జీవితంలో నిజమైన విజయాన్ని ఎప్పటికీ సాధించలేరు. ఇది ఎదుగుదలకు ఆటంకం కలిగించడమే కాకుండా అవకాశాలను కూడా కోల్పోయేలా చేస్తుంది. చిన్న ప్రయత్నాలు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం వల్ల పెద్ద విజయాలకు పునాది పడుతుంది. నిబద్దత, క్రమశిక్షణతో చేసే ప్రయత్నాలు విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి, జీవితం విజయం సాధించేలా చేస్తాయి.
*రూపశ్రీ.