అర్జునుడితోపాటు గీతాసారాన్ని విన్నవాడు!!
అర్జునుడితోపాటు గీతాసారాన్ని విన్నవాడు!!
సంజయుడు దృతరాష్ట్ర మహారాజు దగ్గర ఉన్న సలహాదారుడు. ఎంతో మంచివాడు. తొణికే స్వభావం లేనివాడు. ఏదైనా ధైర్యంగా చెప్పగలిగినవాడు. దృఘరాష్ట్రుడు వ్యాస మహర్షి కొడుకు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది అని తెలిసినప్పుడు వ్యాసుడు తన కొడుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూడాలని ఉందా అని అడిగాడు. ధృతరాష్ట్రుడు నవ్వి నేను పుట్టు గుడ్డిని, నా కొడుకులనే గుర్తుపట్టలేను. కాబట్టి చూడటం వ్యర్థం అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు సంజయునికి అద్భుత శక్తులు ప్రసాదించి, యుద్ధభూమికి పోయి, అక్కడ జరిగే విశేషములు అన్నీ స్వయంగా చూచి, అవన్నీ వివరంగా ధృతరాష్ట్రునికి చెప్పమన్నాడు..
వ్యాసుని ఆదేశాల మేరకు సంజయుడు యుద్ధభూమికి వెళ్లాడు. యుద్ధ భూమిని పరికించాడు. కృష్ణార్జున సంవాదం కూడా విన్నాడు. అతని శరీరం పులకించి పోయింది. కృష్ణుడు చూపించిన విశ్వరూపం చూచి ఆశ్చర్యపోయాడు. అంతటి మహద్భాగ్యం తనకు కలిగించినందుకు వ్యాసులవారికి మనసులోనే ప్రణామాలు అర్పించాడు. తరువాత పది రోజుల యుద్ధం చూసాడు. భీష్ముల వారు అంపశయ్య మీద పడిపోవడం చూచాడు. వెంటనే ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు.
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రాష మద్భుతం రోమహర్షణమ్ ||
ఓ ధృతరాష్ట్ర మహారాజా! నేను వాసుదేవుడు, పార్థుడు మధ్య జరిగిన, అద్భుతమైన, రోమాంచితమైన, సంభాషణములను విన్నాను అన్నాడు.
యుద్ధం మొదలు అయినప్పటి నుండి పదిరోజులు జరిగిన విషయాలు అన్నీ చెప్పాడు. ఆ చెప్పడంలో భాగంగానే భగవంతుడు అయిన కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను ధృతరాష్ట్రుడికి చెప్పాడు.
ఈ విధంగా మొట్ట మొదట కృష్ణుడు చెప్పిన గీతను అర్జునుడు, ఆయనతో పాటు సంజయుడు ఇద్దరూ విన్నారు. కాకపోతే అర్జునుడు అప్పుడప్పుడు ప్రశ్నలు వేసాడు. సంజయుడు శ్రోతగానే మిగిలిపోయాడు. మూడవ శ్రోత ధృతరాష్ట్రుడు. తరువాత సర్పయాగ సందర్భంగా వైశంపాయనుని ద్వారా జనమేజయుడు మొదలగువారు. ఆఖరుగా నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుని ద్వారా శౌనకుడు మొదలగు మహామునులు విన్నారు. ఆ విధంగా గీత ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ రెండు విశేషణాలు చెప్పాడు వ్యాసుడు. అద్భుతం, రోమహర్షణం. కృష్ణుని నోటి వెంట గీతా ప్రవాహాన్ని కంటుంటే, వింటుంటే, ఒక మహాద్భుతాన్ని చూస్తున్నట్టు వింటున్నట్టు అనిపించింది. కొన్ని సన్నివేశాలలో వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అని అన్నాడు సంజయుడు, గీత అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంవాదము. అంటే ఇదివరలో ఎక్కడా విననిది అని అర్థం. అంటే మన ప్రపంచ సాహిత్యములో ఇటువంటి సంభాషణా రూపమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఎక్కడా లేదు. ఇది ప్రపంచ సాహిత్యవేత్తలు ఒప్పుకున్న సత్యం. అందుకే గీతను ప్రపంచ భాషలు అన్నింటిలోనూ అనువదించారు. గీతలాంటి గ్రంధము నభూతో నభవిష్యతి, ఇటువంటి సంభాణ ఇదివరకు లేదు. ఇక ముందు ఉండబోదు అని అర్థము. ఇది వ్యాసుడు మానవాళికి అందించిన గొప్ప అమృతభాండము. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు, ఎక్కువ భయం కలిగినపుడు, ఎక్కువ ఆశ్చర్యం కలిగినపుడు మనకు శరీరం మీది వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అది అత్యంత సహజం. గీతలో కూడా ఆనందము, అద్భుతము, ఆశ్చర్యము, భయము కలిగించే విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు విశ్వరూప సందర్శనయోగంలో అర్జునుడు భయపడ్డాడు. కాబట్టి మనం కూడా గీతను వింటుంటే మనకు కూడా ఒళ్లు గగుర్పొడవాలి. వెంట్రుకలు నిక్కపొడుచుకోవాలి. ఏకాగ్రతతో గీతను విన్నదానికి గుర్తు అదే.
ఇలా భగవద్గీతను సంజయుడు దృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. ఇక్కడ అందరూ గ్రహించవలసిన ఒక చిన్న విషయం ఏమిటంటే ఈ భగవద్గీతను మహర్షులు, మహారాజులు, వీరులు, సాధారణ ప్రజలూ ఇలా అందరూ విని ఆచరించదగ్గ గొప్ప మనోవిశ్లేషనా గ్రంధమని. దాన్ని విన్నవారు జీవితంలో ఎంతో గొప్ప మార్పును పొందుతారని.
◆వెంకటేష్ పువ్వాడ