Read more!

మీ దోషాలను పోగొట్టడానికి కలసి వచ్చిన అద్భుతమైన రోజు నాగ పంచమి..

 

మీ దోషాలను పోగొట్టడానికి కలసి వచ్చిన అద్భుతమైన రోజు నాగ పంచమి..

 

శ్రీ గణేశాయ నమః
శ్రీ గురుభ్యో నమః

ప్రకృతి చిరుజల్లులతో పరవశిస్తూ, పెద్ద వానల్లో పొంగిపోతూ, అత్యద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉన్న ఈ సమయములోనే ఆడపడుచుల వ్రతాలు, అబ్బాయిల హడావిడి, పెళ్లిళ్లు,నోములు, వ్రతాలు, ఒకటేమిటి,ఆనందాల హేల మన శ్రావణ మాసము. ఈ మాసములో శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుడ పంచమి/నాగ పంచమి అనే పేరుతో పూజ చేసుకుంటూ ఉంటారు.

ఇదెక్కడి వింత? జన్మతః వైరము ఉన్న నాగులకు, గరుడునిలి ఒకే రోజు విశిష్టమైంది ఎలా అవుతుంది? ఎలా కుదురుతుంది? అంటే మన పెద్దలు తెలిపిన కథ తెలుసుకోవాల్సిందే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు ఉండేవారు. అందులో వినత తనకు ఇద్దరు బలవంతులైన కుమారులు కావాలి అని కోరుకుంది. అది విని కద్రువ తనకేమి కావాలని కాకుండా అసూయతో బోలెడు మంది సంతానం కావాలని కోరుకుంది. ఆమె కొరుక్కున్నట్లే ఆమెకు త్వరగా నాగులు జన్మించారు. కానీ వినత ఎంతకాలం ఎదురు చూసినా కూడా ఆమె పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు పుట్టలేదు. సవతి పిల్లలు ఇల్లంతా తిరుగుతుంటే తనకు కలిగిన ఈర్షతో, బిడ్డ త్వరగా కావాలన్న ఆరాటంలో ఒక గుడ్డును పగలగొట్టింది వినత. అందులో ఇంకా కాళ్ళు పూర్తిగా తయారవని బిడ్డ ఉన్నందు.. అతని పేరు అనూరుడు. తల్లిని కోపించి, సవతి దాస్యం చేయమని శపించి వెళ్ళిపోయాడు. సూర్యునికి రథ సారథి అయ్యి తన జన్మను సార్ధకం చేసుకున్నాడు. అలాగే తల్లికి రెండో గుడ్డుని జాగ్రత్తగా సంరక్షించమని, అందులో మహా శక్తివంతుడు, కారణం జన్ముడు అయినవాడు ఉన్నాడని, అతని వల్లనే ఆమెకు ఆమెకు శాపం వల్ల వచ్చిన దాస్యం తీరుతుంది అని చెప్పాడు.. వినత అలాగే ఆ అందమును జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చింది.


ఈ లోపు వినత, కద్రువలు నదీ తీరానికి విహారానికి వెళ్లి అక్కడ తెల్ల గుర్రాన్ని చూసి పూర్తిగా తెల్లగా ఉన్నదని వినత, కాదు తోక నల్లగా ఉందని కద్రువ వాదించుకున్నారు. ఎవరు సరి అయితే వారికి రెండోవారు దాస్యం చేయాలని షరతు విధించుకున్నారు. నిజానికి ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నప్పటికీ తన పిల్లలాగా నాగులను ఆ గుర్రం తోక పట్టుకుని తనకు సాయం చేయమని అడిగింది కద్రువ. కొంతమంది విచక్షణ కలిగిన నాగులు అది తప్పు కాబట్టి తాము ఆ పని చేయము అని చెప్పేసాయి. అప్పుడు ఆమె కోపించి వారందరు భవిష్యత్తులో జరిగే సర్పయాగం కుండములో పడి మరణించామని శపించింది. కొంతమంది సాయం చేస్తామని ఆ గుర్రం తోకను పూర్తిగా కప్పివేయడముతో షరతు ప్రకారము వినత దాస్యం చేసింది.  ఆ తరువాతి కాలములో వినతకు చెందిన రెండవ అండము నుంచి మహా శక్తి శాలి, మహా తేజోవంతుడు, సుపర్ణుడు, సువర్ణుడు, చక్కని బలమైన రెక్కలు కలిగిన గరుక్మంతుడు జన్మించాడు.  అతను దాసుడే అని చాకిరీ చేయించేవారు. అంతటి యోధుడి వీపున నాగులు విహారానికి వెళ్ళేవి. ఆయన విషయం తల్లి ద్వారా తెలుసుకుని దాస్య విముక్తికి ఏమి కావాలి అని కద్రువను అడిగాడు. ఆమె తనకు, తన పిల్లలకు దేవలోకం నుంచి అమృతం తెచ్చి ఇమ్మని అడిగింది. ఆ మహానుభావుడు అలానే అనే ఇంద్రుడితో యుద్ధం చేసి అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. దర్భలపై ఉంచి తల్లికి దాస్య విముక్తి కల్గించి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. దర్భలపై అమృత కలశం ఉంచబడింది కాబట్టి అవి మరింత శక్తివంతములు, మహిమాన్వితములు అయ్యాయి. ఇప్పటికీ గ్రహణ కాలములో వచ్చే ప్రమాదకరమైన కిరణముల నుంచి కాపాడుతూ ఉన్నాయి. ఇంతలో ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలశమును తీసుకుని వెళ్ళిపోయాడు.. అయినా కూడా దర్భలకు అమృతం యొక్క బిందువులు ఏమైనా అంటుకున్నాయేమో అన్న ఆశతో నాగులు వాటిని నాకడంతో వాటి నాలుకలు చీలి రెండుగా అయ్యాయి. అప్పటి నుంచి రెండు భాగములుగా వాటి నాలుక కనిపించసాగింది. అలా నాగులకు, గరుడునికీ జన్మ వైరము ఉండి పోయింది. అందుకే నాగులను ఆహారముగా తింటూ ఉన్నదని కథ. ఆ తరువాత ఆ గరుడుడు శ్రీహరి గురించి తపస్సు చేసి ఆయనకు వాహనము అయ్యాడు. గరుడాళ్వారుగా పూజలందుకుంటున్నాడు.


ఆ పరంధామునికి అత్యంత సన్నిహితుడై, ఆప్తుడై, సేవకుడై, తోడు, నీడై ఉన్నాడు.  రామావతారంలో లక్ష్మణుడై అహరహం సేవించాడు. అక్కడ కష్టపడ్డాడని కృష్ణావతారంలో అగ్రజుడై కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అయితే జన్మతః వైరం ఉన్నప్పటికీ శ్రీహరికి పాన్పు అయిన ఆదిశేషుని పట్ల ఎలాంటి వైషమ్య భావన ఉంచుకోలేదు. అలాగే కృష్ణావతారంలో గర్వంతో ఉన్న కాళీయుడి అహంకారమును కృష్ణుడు అణచినా తరువాత గరుడుడు తనను భక్షిస్తాడని భయపడుతూ ఉంటే నా పాదముల ముద్రలు నీ తలపై ఉన్నాయి కనుక గరుడుడు ఏమీ చేయదు అని అభయం ఇచ్చాడు స్వామి..


అంటే ఆ పరంధాముని మనసులో నిల్పుకున్నవారికి, వారి పాదపద్మములను తలపై దాల్చిన వారికీ జ్ఞంతః వైరం  ఉన్న కూడా వాటి నుంచి రక్షణ లభిస్తుంది అని తెలుస్తోంది కదా. అందుకే ఆ మహానుభావుని పుట్టిన రోజును గరుడపంచమి గా పూజ చేసుకుంటూ తరిస్తూ ఉంటారు.. అందుకే మన వాగ్గేయకారులు సైతం స్వామిని  అండజ సువాహన అంటూ, ఖగరాజు నీ ఆనతి విని వేగా రాదో అంటూ స్వామికి గరుడుడు ఎంత నమ్మైన బంతో తెలుపుతూ కీర్తిస్తూ వచ్చారు.


మరి నాగుల విశిష్ట విషయానికి వస్తే భూమిని ఆదిశేషుడుగా వహిస్తూ ఉన్నవాడు, రామానుజులుగా కలిగియుగములో భక్తి మార్గ బోధన చేసినవారు, పతంజలి మహర్షిగా లోకానికి యోగ మార్గమును చూపింది ఆ నాగులే కదా.. ఆ మహానుభావులు కదా..  మనము వీరిలోని   గొప్ప  లక్షణములను అలవరచుకునే ప్రయత్నం చేద్దాము..  భగవంతునికి దగ్గరవుదాము.. తరిద్దాము..