Read more!

రాజు లేని రాజ్యం ఎలా అనిపిస్తుంది??

 

రాజు లేని రాజ్యం ఎలా అనిపిస్తుంది??


దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులు లాగ బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతులేకుండా పోయింది. నలుగురు కుమారులు ఉన్నప్పటికీ అంచేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైల ద్రోణిలో (రసాయనములలో శరీరాన్ని నిలువ చేసే పద్ధతి, అందులో అలా పెడితే శరీరం పాడవదు) పెట్టారు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులందరూ కూడా సభా మంటపానికి చేరారు.


ఆ సభలో మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు 'మహానుభావ! ఒక్క రోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరములు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజులేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు, రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు, ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు, ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు, ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు, యుక్త వయస్సులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాలలోకి వెళ్ళి పూవులని కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు, ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్ట చూపు కలిగినటువంటి, మనుష్య రూపమైన, యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి, తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామములలోకి రారు, వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కు బిక్కు మంటూ బతకవలసిన రోజులు వస్తాయి, ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు, అన్నిటినీ మించి ప్రజలలో నిస్పృహ, నిరాశ చోటుచేసుకుంటాయి.


రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు, వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు, వరుణుడు వర్షం కురిపిస్తాడు, కాని అష్టదిక్పాలకుల సమస్త విధులను రాజు నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తియందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చెయ్యగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకువంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చెయ్యవలసింది" అని ఆ మహర్షులు అన్నారు.


అప్పుడు వశిష్ఠుడు "ఇందులో మీరు కాని నేను కాని ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు. ఎందుకంటే, దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు, భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కాని భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గర ఉన్నాడు, ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక, చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపుదాము" అని అన్నాడు.


తరువాత వశిష్ఠుడు సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే నలుగురు దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కాని అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్లినట్టు కాని, దశరథ మహారాజు మరణించినట్టు కాని ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి, ఒక్క క్షణం ఆలస్యం కాకుండా అయోధ్యా నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు.

◆వెంకటేష్ పువ్వాడ.