తులసి వివాహం వెనకున్న అసలైన కథ తెలుసా..
తులసి వివాహం వెనకున్న అసలైన కథ తెలుసా..
ప్రతి హిందువు ఇంట్లో తప్పక పూజలు అందుకునే పవిత్రమైన మొక్క తులసి. తులసిని లక్ష్మీదేవి అవతారంగా నమ్ముతారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించడం అందరూ చేస్తారు. అయితే ఏడాదికి ఒకసారి తులసి వివాహం కూడా జరుపుకుంటారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున తులసి వివాహం జరుపుకుంటారు. దీన్నే దేవ ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అంటారు. దీని వెనుక కథనం ఏమిటి? తులసి వివాహం ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక కారణాలు ఏమిటి? తెలుసుకుంటే..
ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున తులసి వివాహం జరుపుకోవడం పరిపాటి. ఇది తులసికి, విష్ణువుకు జరిగే వేడుక. విష్ణువు రూపమైన శాలిగ్రామాన్ని తులసి దేవి ఈ ఏకాదశి రోజున వివాహం చేసుకుంటుందని చెబుతారు.
తులసి వివాహం రోజున తులసి మొక్కను పెళ్లికూతురులా అలంకరిస్తారు. ఎరుపు రంగు చీర, మంగళసూత్రం, ఆభరణాలు మొదలైన వాటితో అలంకరిస్తారు. ఆ తరువాత శాలిగ్రామం లేదా విష్ణు విగ్రహాన్ని తులసి పక్కనే ఉంచి వివాహం జరిపిస్తారు.
హిందూ పురాణం ప్రకారం తులసి మొదట్లో వృందా అనే భక్తిరురాలు. ఈమె జలంధరుడు అనే అసుర రాజు భార్య. ఈమె విష్ణువును భక్తిపూర్వకంగా ఆరాధించేది. ఆమె పతివ్రతా శక్తి కారణంగా ఆమె భర్త జంధరుడు చాలా శక్తులు కూడా సంపాదించాడు. భార్య పతివ్రత బలంతో జంధరుడు దైవ శక్తుల కన్నా బలవంతుడయ్యాడు. దీంతో జలంధరుడి అహంకారం ఎక్కువైంది.
దేవతలు అందరూ విష్ణువును శరణు వేడారు. జలంధరుడి ఆట కట్టించాలంటే వృందా దేవి పాతివ్రత్యాన్ని భంగపరచడమే దారి అని నిర్ణయించుకున్నారు. దీంతో విష్ణు భగవానుడు జలంధరుడి రూపంలో వృంధా దేవిని చేరాడు. తన భర్తే అనుకుని వృంధా దేవి విష్ణు సాంగత్యంలో గడిపింది. కానీ తరువాత అక్కడున్నది తన భర్త కాదని, విష్ణు భగవానుడు అని తెలిశాక విష్ణువును శపించింది. నా భర్త రూపంలో నన్ను మోసం చేసి పతివ్రతా ధర్మాన్ని భంగపరిచావు కాబట్టి నువ్వు శిల రూపంలో భూమిపై ఉండు అని శపించింది. దీంతో విష్ణువు శాలిగ్రామంగా మారాడు. తర్వాత వృందా తన శరీరాన్ని త్యజించింది. ఆ శరీరం త్యజించినప్పుడు పుట్టినదే తులసి వృక్షం.
తులసిని శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువు దైవతల సాక్షిగా వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి ప్రతి ఏడాది తులసి వివాహం సంప్రదాయంగా సాగుతోంది. తనను ఎంతో భక్తిపూర్వకంగా పూజించే వృందకు మహావిష్ణువు వరం ఇచ్చాడు. నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి, నీ ఆకులు లేకుండా జరిగే నా పూజ అసంపూర్ణంగా ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఈ కారణంగానే విష్ణు పూజ, విష్ణువు అవతారాలు ఏవైనా సరే.. ఆ అవతార మూర్తుల పూజలో తులసి తప్పకుండా ఉంటుంది.
తులసి వివాహం తర్వాత దేవతల వివాహ కాలం ప్రారంభమవుతుంది, కాబట్టి ఈ రోజుతో మంగళ కార్మికాలు అంటే వివాహాలు మొదలైనవి ప్రారంభిస్తారు.
*రూపశ్రీ.