జుట్టుకు ఆవిరి పడితే మంచిదేనా?

 

జుట్టుకు ఆవిరి పడితే మంచిదేనా?

సాధారణంగా జలుబు  వచ్చినప్పుడు ఆ ప్రభావం వల్ల తలభారంగా ఉంటుంది. వేధించే జలుబును, తలభారాన్ని, జలుబు వల్ల పుట్టే తుమ్ములను, ఇంకా గొంతు సమస్యలు ఏవైనా ఉన్నా అన్నింటిని తగ్గించుకోవడానికి, చాలామంది ఫాలో అయ్యేది నీటి ఆవిరి పట్టడం. నీటిని బాగా మరిగించి అందులో వీలును బట్టి జండూ బామ్, వొపోరబ్, ఇంకా ఎస్సెంటియల్  ఆయిల్స్ వంటి వాటిని వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల ఎంతో రిలాక్స్ ఉంటుంది. ఈ రిలాక్సషన్ వల్ల సగం సమస్య తీరిపోయినట్టే ఉంటుంది. ఇలా ఆవిరి పట్టడం అనేది మంచి సొల్యూషన్ ఆరోగ్యపరంగా. అయితే బ్యూటీ పార్లలోనూ, ఇంటి వద్ద సౌందర్య స్పృహ ఎక్కువ ఉన్న ఆడవారు ఫేషియల్ బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ముఖానికి ఆవిరి పట్టడం సహజం. దీనివల్ల ముఖం చర్మ రంద్రాలు తెరుచుకుని చర్మంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోవడానికి ఆస్కారం వుంటుంది. 

ఇలా నీటి ఆవిరి విభిన్న రకాలుగా పాత్రను పోషిస్తుంది. అయితే నీటి ఆవిరి జుట్టుకు పట్టడం గురించి చాలా తక్కువ మందే విని ఉంటారు. విన్నవారు కూడా సరైన సమాచారం తెలియక మనకెందుకులే అనే ఆలోచనతో దాని గురించి అంతగా పట్టించుకోరు. కానీ జుట్టుకు నీటి ఆవిరి పట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అసలు జుట్టుకు, నీటి ఆవిరికి ఉన్న రిలేషన్, అది ఎందుకు జుట్టు విషయంలో బాగా వర్కౌట్ అవుతుంది, ఆ ఫలితాలేంటి తెలుసుకోవాల్సిందే…

జుట్టుకు ఆవిరి ఎందుకు పట్టాలంటే...

ఒక్కమాటలో చెప్పాలంటే జుట్టు ఆరోగ్యానికి  ఆవిరి పట్టడం మంచి మార్గం. ఏ రకమైన జుట్టు అయినా సరే ఆవిరి పట్టడం వల్ల జుట్టు మృదువుగా అవుతుంది. ఎన్నో కారణాల వల్ల జుట్టు తగినంత మెరుగ్గా అనిపించకపోతే ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు కుదుళ్ళు లోపలి నుండి రక్తప్రసరణ మెరుగుపరిచి జుట్టుకు ఉత్తేజాన్ని తెస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది.

జుట్టుకు ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే…

జుట్టును శుభ్రంగా ఉంచుతుంది!

ఆవిరి పట్టడం వల్ల తలలో పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలు, మురికి వంటివన్నీ వధులుతాయి. ఫలితంగా జుట్టు శుభ్రమవుతుంది. జుట్టు శుభ్రంగా ఉంటే సహజంగానే ఆరోగ్యవంతంగా ఉంటుంది. 

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది

కొల్లాజెన్ అనేది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు ఎదుగుదలకు సహకరిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడంలో సహపడుతుంది.

జుట్టు స్త్రెంగ్థ్ పెంచుతుంది

ఆవిరి పట్టడం వల్ల జుట్టు కుదుళ్ళు తేమను గ్రహిస్తాయి. దీని వల్ల జుట్టు ఆరోగ్యవంతం అవుతుంది. జుట్టు సామర్థ్యము పెరుగుతుంది. బలంగా తయారవుతుంది. జుట్టును లాగినప్పుడు, బిగించినప్పుడు తెగిపోకుండా ఉంటుంది.

జుట్టు చిట్లడం తగ్గిస్తుంది

జుట్టు పొడిగా మారిపోతే తొందరగా చిట్లిపోతుంది. అయితే స్టీమింగ్ వల్ల జుట్టును తేమను పొందుతుంది, మృదువుగా అవుతుంది. దీనివల్ల చిట్లిపోవడం తగ్గుతుంది.


అదనపు పోషణకు సహాయం చేస్తుంది

జుట్టు ఆరోగ్యం కోసం ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో నూనె పెట్టడం, తలకు వివిధ రకాల పోషకాలను ఇచ్చే లేపనాలు మొదలైనవి వేయడం చేస్తారు. జుట్టుకు ఆవిరి పట్టడం వాటి తాలూకూ పోషకాలు జుట్టు కుదుళ్లలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే నూనె పెట్టినప్పుడు ఆవిరి పట్టడం, వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టడం చేస్తారు.

ఇలా ఆవిరి పట్టడం జుట్టుకు కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

                                      ◆నిశ్శబ్ద.