జుట్టుకు రంగు వేసేవారు ఇవి తప్పక తెలుసుకోవాలి!
జుట్టుకు రంగు వేసేవారు ఇవి తప్పక తెలుసుకోవాలి!
ఇప్పటికాలంలో చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా జుట్టు తొందరగా రంగు మారిపోవడం జరుగుతోంది. పెద్దవాళ్ళు అయితే వయసైపోయిందిలే, జుట్టు తెల్లబడినా రంగు మారి కనబడినా నష్టమేముంది అనుకుంటారు. కానీ చిన్న వయసు వారు మాత్రం అలా సర్దిచెప్పుకోలేరు. రంగుమారిన జుట్టు కనబడితే చాలా బాధపడిపోతారు. కొందరైతే జుట్టు కండిషన్ చూసుకుని డిప్రెషన్ లోకి జారుకునేవారు కూడా ఉంటారు. అయితే వీటన్నిటికి సొల్యూషన్ గా ఎంతో మంది ఫాలో అయ్యేది జుట్టుకు కలరింగ్ వేయడం.
జుట్టుకు కలర్ వేయడంలో కూడా ఫాషన్ వచ్చేసింది. కొందరైతే కావాలని రాగి రంగు, తెలుపు రంగు, ఇంకా పింక్, గ్రీన్, బ్లూ వంటి రంగులు వేస్తుంటారు. మొత్తానికి రంగు వేయడం గురించి మాట్లాడుకుంటే అదొక కెమికల్ మార్గం అని గట్టిగా చెప్పేయచ్చు. ఇలా కెమికల్ పద్దతిలో జుట్టుకు రంగు వేయడం వల్ల అది తాత్కాలికంగా బాగున్నట్టు అనిపించినా జుట్టు లోపలినుండి క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. అందుకే జుట్టు దెబ్బ తినకుండా ఉండాలంటే జుట్టుకు రంగు వేసేటప్పుడు కొన్నిరకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
బాండింగ్ ట్రీట్మెంట్!!
జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు ఈ బాండింగ్ ట్రీట్మెంట్ ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. సాధారణంగా జుట్టుకు డైసల్పేట్ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. నేరుగా జుట్టుకు రంగు వేస్తే ఈ డైసల్పేట్ ప్రసరణ జరగడంలో అవాంతరాలు ఏర్పడతాయి. అందుకే బాండింగ్ ట్రీట్మెంట్ వల్ల ఈ డైసల్పేట్ అలా సాగడమే కాకుండా జుట్టుకు వేసిన రంగు ఎక్కువకాలం కొనసాగుతుంది.
తక్కువ కంటెంట్ తో రక్షణ!!
జుట్టుకు వేసే రంగు ఏదైనా సరే అది తక్కువ మోతాదులో వేయడం మంచిది. దీనివల్ల జుట్టు కుదుళ్లలోకి రసాయనాలు ఎక్కువ ఇంకకుండా ఉంటాయి. రసాయనాల ప్రభావం తక్కువగా ఉంటే జుట్టు కూడా ఎక్కువకాలం బాగానే ఉంటుంది. అలాగే రసాయనాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం కూడా తెలివైన పని.
టార్గెట్ పాయింట్స్!!
సాధారణంగా చిన్నవయసు వారిలో జుట్టు రంగు మారడం అనేది తల మొత్తం చోటుచేసుకోదు. తలలో కొన్ని భాగాల్లో మాత్రమే రంగుమారి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. అలాంటి ప్రాంతాల్లో మాత్రమే కలరింగ్ వేయడం వల్ల జుట్టు మొత్తానికి ఆ రసాయన కలర్స్ ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనివల్ల జుట్టు రఫ్ గా మారకుండా మృదువుగా ఉంటుంది.
అవగాహనతో సెల్ఫ్ గా!!
సాధారణంగా జుట్టుకు రంగు వేయడం అనేది యాడ్స్ చూసి ఇంకా సెలూన్ లో, బ్యూటీ పార్లర్ లో జరిగిపోతూ ఉంటుంది. అయితే కాస్త అవగాహన పెంచుకుంటే జుట్టుకు మంచి రంగు ఏది?? జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ రంగు మార్చుకునే మార్గాలు ఏవి అనేది కాస్త వెతుక్కోవచ్చు.
కలరింగ్ తరువాత!!
చాలామందికి ఎక్కువసార్లు తలస్నానం చేయడం అలవాటు. అయితే కలరింగ్ తరువాత తలస్నానం ఎక్కువ చేయకూడదు. దీనివల్ల జుట్టుకు వేసిన రంగు ఎక్కువకాలం కొనసాగుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు రంగు వేసుకునే తలనొప్పి కూడా తగ్గుతుంది.
ప్రోటీన్ ట్రీట్మెంట్ ది బెస్ట్!!
రంగులు అవి ఇవి వేయడం కంటే ప్రోటీన్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం అంటారు పోషకార నిపుణులు. జుట్టు రంగు మారడం వెనుక పోషకాహార లోపమే ప్రధాన కారణం అయినప్పుడు ప్రోటీన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇక ఎలాంటి రసాయనాలను టచ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇలా జుట్టుకు రంగు వేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు తొందరగా పాడవకుండా ఉంటుంది. రంగు పడిందంటే జుట్టు రూపం కూడా మారుతుంది. అందుకే జాగ్రత్త మరి!!
◆నిశ్శబ్ద.