తొక్కే కదా అని తీసేస్తే ఏం జరుగుతుంది!

 

తొక్కే కదా అని తీసేస్తే ఏం జరుగుతుంది!

భారతీయుల ఆహారంలో పండ్లు ఎప్పటినుండో భాగంగా ఉన్నాయి. గతంలో జీవించిన మునులు తాము తీసుకునే సాత్విక ఆహారంలో భాగంగా పండ్లు, పాలు మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు భారతీయులు పండ్లను తింటున్నా పండు ఏదైనా నేరుగా తినదగినది అయితే అలా….. లేకపోతే తొక్క వొలిచి లోపలి భాగం తినడం చేస్తారు. అయితే చాలవరకు తీసుకునే పళ్లలో సిట్రస్ పళ్ళు అధికభాగంలో ఉంటాయి. వాటిని ఎక్కువగా తినమని వైద్యుల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చెబుతుంటారు. అయితే సిట్రస్ పళ్ళు చాలావరకు తొక్కతీసి తినేవిగా ఉంటాయి. సిట్రస్ జాతిలో భాగమైన నిమ్మ, నారింజ, బత్తాయి, కివి వంటి పండ్ల తొక్కలు తీసి లోపలి పండు తినడం సాధారణంగా అందరూ చేసేపని. 

నారింజ, బత్తాయి, నిమ్మ పండును జ్యుస్ గా చేసి తాగడం వల్ల ఆ పండ్ల నుండి లభించాల్సిన ఫైబర్ కంటెంట్ కోల్పోతారని చాలామంది చెబుతారు. అయితే కేవలం అది మాత్రమే కాదు, ఈ సిట్రస్ పండ్లను తినడంలో మనం చెత్త బుట్ట పాలు  చేసే తొక్కల్లోనూ బోలెడు ఆరోగ్యముంటుంది. 

మనం రెగులర్ గా పడేసే తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మహిళలు వీటిని అసలు వదిలిపెట్టరు.

తీపిగా లేదా జ్యుసిగా లేనప్పటికీ పండ్ల తొక్కలలో మంచి మొత్తంలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి.  ఎక్కువ ఫైబర్ కలిగి ఉండటం మరియు రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సితో నిండి ఉండటంతో పాటు, నిమ్మజాతి పండ్ల తొక్కల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎముకలను నిర్మించే కాల్షియంతో పాటు యాంటీఆక్సిడెంట్ బయోఫ్లావనాయిడ్‌లను కలిగి ఉంటాయి.

 నారింజ తొక్కలలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ B6, కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో సహజంగా లభించే లిమోనెన్ రసాయనం వల్ల క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

నిమ్మజాతి పండ్ల తొక్కల నుండి ప్రయోజనాలు పొందడానికి 7 చిట్కాలు ఉన్నాయి. అవి కింది విధంగా ఉన్నాయి.

 చర్మంపై పిగ్మెంటేషన్ తగ్గించడానికి నిమ్మ తొక్క బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ తొక్కను ఫేస్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు.

 ఆరెంజ్ తొక్కను పంచదార మరియు ఆలివ్ నూనెతో కలిపి బాడీ స్క్రబ్ లా తయారు చేసుకోవాలి. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

 అదేవిధంగా, నిమ్మ లేదా నారింజ తొక్కను రెండు వారాలకు ఒకసారి మీ ముఖాన్ని శుభ్రం  చేసుకోవడానికి ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు.

నిమ్మ తొక్కను గ్రైండ్ చేయాలి, దీనికి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీని జోడించండి, ఈ టీలను అపుడపుడు తాగడం వల్ల శరీరంలో చర్మకాంతి లోపల నుండి మెరుగవుతుంది. 

 నిమ్మజాతి తొక్కల నుండి సేకరించే ముఖ్యమైన నూనెలను ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్‌ ఆయిల్ కు జోడించవచ్చు, ఇది శరీరానికి తేమను పునరుద్ధరించడానికి అప్లై చేయవచ్చు. చర్మానికి మృదుత్వాన్ని పెంచుతుంది. 

 పెరుగు మరియు సలాడ్‌లకు జోడించిన నిమ్మకాయ లేదా నారింజ రుచిని మాత్రమే కాకుండా, గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మీ చర్మం నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఇలా నిమ్మజాతి పండ్లను హాయిగా తినడమే కాకుండా వాటి తొక్కలను ఉపయోగించి అందమైన చర్మాన్ని ఆరోగ్యాన్ని పొందవచ్చు.

                                       ◆నిశ్శబ్ద.