జుట్టుసమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ విటమిన్స్ ముఖ్యం!
జుట్టుసమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ విటమిన్స్ ముఖ్యం!
అమ్మాయిల లైఫ్ స్టైల్ లో అందానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. స్కిన్ కేర్ నుండి హెయిర్ కేర్ వరకు అమ్మాయిలు ఎన్నో ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా హెయిర్ కేర్ విషయంలో చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ జుట్టు సంబంధ సమస్యలలో జుట్టు రాలిపోవడం ప్రథమ అంశం. ఆ తరువాత జుట్టు పలుచబడటం, వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం, తలలో చుండ్రు, తెల్లవెంట్రుకలు ఇలా చాలా సమస్యలున్నాయి జుట్టు విషయంలో.
వీటికోసం ఆడవాళ్లు ఎన్నో హెయిర్ పాక్ లు వాడుతారు, ఎన్నో రకాల నూనెలు ఉపయోగిస్తారు, కొత్తకొత్త వాణిజ్య ఉత్పత్తులను తీసుకొచ్చి వాటి వల్ల పలితం ఉంటుందనే ఆశతో అవి ఉపయోగిస్తారు. కానీ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ప్రయోజనం శూన్యం.
కారణంలోనే అసలు సంగతి ఉంది!!
అందరూ తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే జుట్టు సంబంధ సమస్య ఏదైనా సరే అది ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడం. ఆ విషయం తెలుసుకుంటే దానికి పరిష్కారం వెతకడం కూడా సులభమే. జుట్టుకు పైన పూజ పూతలతో తగ్గకపోతే ఆ సమస్యలు ఖచ్చితంగా పోషకాహారా లోపంతో వచ్చేవే అని ఆహారనిపుణులు చెబుతారు.
శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకాలు అని పిలవబడే విటమిన్స్ లోపించడం వల్ల చాలావరకు జుట్టు సంబంధ సమస్యలు వస్తున్నాయి.
ఏ రకమైన జుట్టు సంబంధ సమస్యలున్నా అయిదు రకాల విటమిన్లను ఆహారంలో భాగం చేసుకుంటే అన్ని తీరిపోతాయని తెలిసింది. ఆ అయిదు రకాల విటమిన్లు అవి లభ్యమయ్యే ఆహారపదార్థాలు తెలుసుకుంటే నిగనిగలాడే ఆరోగ్యవంతమైన జుట్టు ఖచ్చితంగా కొద్దిరోజులలోనే సొంతమవుతుంది.
విటమిన్-బి కాంప్లెక్స్!!
శరీరానికి విటమిన్-బి కాంప్లెక్స్ లోపం వల్ల సమస్యలు వస్తాయి. విటమిన్-బి కాంప్లెక్స్ కోసం తృణధాన్యాలు, పప్పులు, గింజలు, ఈస్ట్, మాంసం మొదలైనవి తీసుకోవాలి. అలాగే కొన్నిరకాల ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
బయోటిన్!!
ఈ బయోటిన్ విటమిన్ కెరాటిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా జుట్టు, గోర్లు, చర్మ రక్షణలో గొప్ప పాత్రను పోషిస్తుంది. ఈ బయోటిన్ గుడ్లలో ఉన్న పచ్చసొన, పాలు, బాదం, వేరుశనగ, సోయాబీన్స్, పెరుగు, చిలగడదుంప, అవిశేగింజలు మొదలైనవాటిలో లభిస్తుంది.
విటమిన్-ఎ!!
విటమిన్-ఎ చర్మగ్రంధులు తగినంత తేమ, నూనె ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు పొడిబారకుండా మాశ్చరైజింగ్ గా ఉండేందుకు ఈ విటమిన్-ఎ సహాయపడుతుంది. జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటే సాధారణంగానే జుట్టు కూడా ఆరోగ్యంగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆకుకూరలు, క్యారెట్, బచ్చలి, బ్రోకలి వంటి వాటిలో విటమిన్-ఎ లభ్యమవుతుంది.
విటమిన్-ఇ!!
విటమిన్-ఇ చర్మం, మరియు జుట్టు సంరక్షణలో గొప్పగా సహాయపడుతుంది. విటమిన్-ఇ ఆధారిత సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లలో విరివిగా అమ్ముతుంటారు, కొందరు విటమిన్-ఇ కోసం టాబ్లెట్స్ కూడా వాడతారు. అయితే సహజంగా విటమిన్-ఇ ని పొందితే కలిగే ప్రయోజనాలు ప్రభావవంతంగా ఉంటాయి. సోయాబీన్స్, ఆకుకూరలు, బఠానీ, వాల్ నట్స్, గోధుమలు మొదలైనవాటి నుండి విటమిన్-ఇ లభ్యమవుతుంది.
విటమిన్-సి!!
విటమిన్-సి సహజంగానే వ్యాధినిరోధకతను పెంచే విటమిన్. సిట్రస్ పండ్లలో ఈ విటమిన్ అధికంగా అలభ్యమవుతుంది. పండ్లు, కూరగాయలలో పుష్కలంగా విటమిన్-సి పొందవచ్చు. ఇది జుట్టు బూడిదరంగుగా మారడం, చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలను అరికడుతుంది. నిమ్మజాతి పండ్లు, కాప్సికం, స్ట్రాబెర్రీ, కివి, పైనాపిల్, టమాటా మొదలైనవాటిలోనే కాకుండా ఆకుపచ్చని కూరగాయల్లో కూడా విటమిన్-సి పొందొచ్చు.
ఇలా ఈ అయిదు రకాల విటమిన్స్ ని రెగులర్ గా ఆహారంలో భాగంగా తీసుకుంటే ఏవిధమైన జుట్టు సమస్యలు మీ జోలికి రాలేవు. అంతేకాదు ఎంతో ఆరోగ్యవంతమైన, నిగనిగలాగే జుట్టు సొంతమవుతుంది.
◆నిశ్శబ్ద.