వాక్సింగ్ కు ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే నొప్పే ఉండదు!
వాక్సింగ్ కు ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే నొప్పే ఉండదు!
మహిళలు తమ లైఫ్ స్టైల్ లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అంశం అందం. ప్రతి అమ్మాయి తన చర్మం ఎంతో అందంగా, కోమలంగా, ఇంకా చెప్పాలంటే ఒళ్ళంతా గడ్డి పెరిగినట్టు వెంట్రుకలు ఉండకుండా ఎంతో సాఫ్ట్ గా ఉండాలని అనుకుంటుంది. శరీరం మీద పెరుగుతున్న ఈరకం వెంట్రుకలను అన్-వాంటెడ్ హెయిర్ అని పిలుస్తారు. ఈ అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి ఎన్నో పద్దతులున్నాయి. కొందరు హెయిర్ రిమూవల్ క్రీములు వాడతారు. మరికొందరు షేవ్ చేసుకుంటారు. అయితే బ్యూటీ పార్లర్ లలో అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన అవాంచిత రోమాలను తొలగించే పద్ధతి వాక్సింగ్.
ఈ వాక్సింగ్ నొప్పితో కూడుకున్నది. అంతే కాకుండా దీనివల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. ఇంకా వాక్సింగ్ తరువాత చర్మం మీద దద్దుర్లు రావడం, మొటిమలు రావడం చాలామందిలో కనిపిస్తుంది. వాక్సింగ్ చేయించుకున్న తరువాత కొన్ని రోజులకు మళ్ళీ వెంట్రుకలు పెరిగిపోతాయి.
వాక్సింగ్ తరువాత అందరూ మాశ్చరైజింగ్ క్రీమ్ పూసి జాగ్రత్త పడ్డామని అనుకుంటారు కానీ వాక్సింగ్ కు ముందే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల వాక్సింగ్ తరువాత కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈ జాగ్రత్తలు అవాంచిత రోమాలను తొలగించడానికి ఉపయోగించే ఏ మార్గంలో అయినా ఉపయోగపడతాయి.
◆ అవాంచిత రోమాలను తొలగించాలని అనుకునేవాళ్ళు ముందస్తు చేయాల్సిన పని శరీరం మీద పెరిగిపోయిన జుట్టు ఎంత పొడవుగా పెరిగింది అనే విషయాన్ని గమనించడం. ఈ మాట కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుందేమో కానీ ఈ విషయం తెలుసుకోవడం వల్ల కొన్ని పనులు సులువు అవుతాయి.
◆ వాక్సింగ్ చేయాలని అనుకునే అవాంచిత రోమాల పొడవు ¼ అంగుళం పొడవు ఉండాలి. అలా ఉన్నప్పుడు వాక్సింగ్ చేస్తే చర్మం సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది.
◆ జుట్టు ¼ అంగులం ఉన్నట్టు ఎలా నిర్ణయిస్తారు అనే ఆలోచన వస్తే దానికి ఒక సులభమైన మార్గం ఉంది. చిటికెన వేలును పెరిగిన అవాంచిత రొమాల ప్రాంతంలో ఉంచితే వేలికి ఉన్న గోరు భాగం ముప్పావు వంతు కప్పబడి ఉండాలి. అలా ఉన్నట్టయితే వాక్సింగ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని అర్థం
◆ వాక్సింగ్ కు ముందు మాశ్చరైజర్ వాడటం అవాయిడ్ చెయ్యాలి. సహజమైన చర్మం వాక్సింగ్ తరువాత మృదుత్వాన్ని బాగా ఇస్తుంది. అదే మాశ్చరైజర్ వాడితే శరీరం మీద పెరిగిన జుట్టు మూలాలు లాక్ అయిపోతాయి.
◆ వాక్సింగ్ కు ముందు చర్మం తేమ లేకుండా చూసుకోవాలి. అలా తేమను తగిలించకపోవడం వల్ల చాలా సులభంగా లాగేయచ్చు.
◆ చర్మం మీద పేరుకునే మురికి, నూనె, సూర్యరశ్మి వల్ల చర్మం రంగు మారడం ఇవన్నీ శరీరం మీద మచ్చలు, మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అందుకని వారంలో రెండు నుండి మూడు సార్లు స్క్రబ్ చేసుకోవడం మరచిపోకూడదు.
◆ రెండు స్పూన్ల చెక్కర, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని బాగా కలిపి దానితో చర్మానికి మసాజ్ చేయాలి. దీన్ని తరచుగా చేస్తూ ఉంటే వాక్సింగ్ సమయానికి చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. వాక్సింగ్ సులభమవుతుంది. వాక్సింగ్ కు ముందురోజు ఈ పని చేయడం ఇంకా మంచిది.
◆ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరం లోపల మరియు వెలుపల కూడా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలి. వాక్సింగ్ కు ముందు నీటిని బాగా తాగితే వాక్సింగ్ తరువాత దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే సబ్బునీటిలో చర్మాన్ని ఒక ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టాలి. అన్ని రకాల చర్మాతత్వాలకు ఈ ప్రక్రియ బాగా సహాయపడుతుంది.
◆ మచ్చలు గాయాలు ఉన్న ప్రాంతంలో వాక్సింగ్ చేయకూడదు. ఆ ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం మచ్చలు గాయాలు ఉన్న ప్రాంతాల్లో బ్యాండేజ్ వేసుకోవచ్చు.
◆ ఇంట్లో వాక్సింగ్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. వాక్సింగ్ మిశ్రమాన్ని అప్లై చేసాక దాన్ని వ్యతిరేక దిశలో లాగాలి, అలా చేస్తే జుట్టు పెరుగుదల వేగం తక్కువగా ఉంటుంది. అలాగే ఒకేసారి చాలా మొత్తం అప్లై చేయకూడదు. కొద్ధికొద్దిగా తక్కువ చర్మం మీద అప్లై చేస్తూ వాక్సింగ్ చేసుకోవాలి.
◆ వాక్సింగ్ మిశ్రమం ఉష్ణోగ్రతను గమనించుకోవాలి. లేకపోతే వేడిగా ఉన్న మిశ్రమం చర్మం మీద పడితే కాలి మచ్చలను ఏర్పరుస్తుంది.
◆ వాక్సింగ్ కోసం కాటన్ క్లాత్ ను ఉపయోగించవచ్చు. ఈ కాటన్ క్లాత్ ను వాక్సింగ్ స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఉపయోగించవచ్చు. వాడిన తరువాత నీటిలో నానబెట్టి శుభ్రం చేసి వాటిని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కూడా.
ఇవీ వాక్సింగ్ చేసుకోవడానికి పాటించవలసిన జాగ్రత్తలు. వాక్సింగ్ తరువాత చల్లని నీరు లేదా ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల చర్మం ఎరుపెక్కకుండా ఉంటుంది. ఇవి పాటిస్తూ వాక్సింగ్ చేసుకుంటే నునుపైన చర్మం ఎక్కువకాలం మీసొంతం.
◆నిశ్శబ్ద.