బీట్రూట్‌తో పెరిగే అందాన్ని ఆపలేరు!

 

బీట్రూట్‌తో పెరిగే అందాన్ని ఆపలేరు!

అమ్మాయిలు అందం కోసం ఎన్నెన్నో చేస్తారు. జుట్టు మెరుస్తూ ఉండాలి, శరీర చర్మం కాంతివంతంగా ఉండాలి, పెదవులు అయితే చెర్రీ పండ్లలా ఎర్రగా, తాజాగా కనిపిస్తూ ఉండాలి. ఇది అందరు అమ్మాయిలూ కోరుకుంటారు. కానీ అవి అందని ద్రాక్షగా అనిపిస్తాయి అందరికి. ఏవేవో ప్రయోగాలు చేసినా అవన్నీ తాత్కాలికంగా ఉంటాయి తప్ప అమ్మాయిలు కోరుకున్నట్టు ఎప్పుడూ వారి వెంట ఉండవు. అయితే వంటింట్లో ఎర్రెర్రగా ఉంటూ శరీరానికి హిమోగ్లోబిన్ స్థాయిలు మెండుగా అందించే బీట్రూట్ తో మెరిసిపోయే జుట్టు, కాంతివంతమైన చర్మం, ఎర్రెర్రని చెర్రీపండు పెదవులు పొందొచ్చు. అది ఎలాగో చూసి ఫాలో అయిపోతే సరి!!

బీట్రూట్ ఎందుకు?

బీట్రూట్ గురించి అందరికీ తెలిసిన విషయం, అది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుందని. అయితే బీట్రూట్ లో కాల్షియం, ఐరన్, విటమిన్-ఎ, విటమిన్-సి,  ఫైబర్, ఫోలేట్( దీన్నే విటమిన్ బి9 అంటారు). ఇంకా పొటాషియం  ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. కేవలం రక్తాన్ని మెరుగుపరచడమే కాకుండా, రక్తపోటు ను నియంత్రించడంలో కూడా బీట్రూట్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది.

మెరిసిపోయే జుట్టు కోసం !

బీట్రూట్ ని ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుంటే జుట్టు బూడిద రంగుకు మారడం, తెలుపు అవ్వడం నివారించవచ్చు. అలాగే జుట్టును మృదువుగా వుంచుకోవచ్చు. ఎటువంటి కృత్రిమ మాశ్చరైజర్ లు జుట్టుకు అవసరం లేదు. బీట్రూట్ లోని పోషకాలు చురుగ్గా ఉండటం వల్ల ఫలితం తొందరగానే కనిపిస్తుంది. బీట్రూట్ జ్యుస్ ని తీసుకోవడం వల్ల జుట్టు మెరుపు వస్తుంది. అలాగే తలకు కలబంద, నిమ్మరసం వాడుతూ ఉన్నా మంచి ఫలితం ఉంటుంది.

చర్మం కోసం!

బీట్రూట్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. జిడ్డు చర్మం గలవారు, మొటిమలతో బాధపడేవారికి బీట్రూట్ మిశ్రమం అత్యుత్తమ పరిష్కారం. బీట్రూట్ రసాన్ని పెదవులు, చర్మం మీద అప్లై చేసినప్పుడు డెడ్ స్కిన్ తిరిగి జీవాన్ని పొందుతుంది. అంతే కాదు లోపలి చర్మానికి పోషకాలు ఎక్కువ అంది మరింత ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఫలితంగా మొటిమలు, మచ్చలు మెల్లగా తగ్గిపోతాయి. 

కొద్దిపాటి బీట్రూట్ రసంలో ఓ నాలుగైదు చుక్కల బాదం నూనెను వేసి బాగా కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. పది నుండి పదహైదు నిమిషాలు అలాగే ఉంచుకుని తరువాత ఈ ఫేస్ ప్యాక్ నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా మారుతుంది, తేమను పొందుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. దీనిలాగే బాదం నూనెకు బదులు పెరుగు కూడా ఉపయోగించవచ్చు.

చెర్రీ లిప్స్!

చెర్రీ లిప్స్ కోసం చాలా మంది లిప్ బామ్ వాడుతూ ఉంటారు. అయితే బయట మార్కెట్లలో అమ్మే లిప్ బామ్ లు రంగు ఉన్నా వాటిలో కృత్రిమ రసాయనాలు ఉంటాయి. అవి తాత్కాలికంగా పెదవులకు ఎరుపు రంగు ఇచ్చినా తరువాత పెదవులు వాడిపోయినట్టు కళా విహీనంగా తయారవుతాయి. అదే బీట్రూట్ ని ఉపయోగించి లిప్ బామ్ ని తయారుచేసుకుంటే బీట్రూట్ లో ఉండే బ్లీచింగ్ గుణాలు పెదవులకు దీర్ఘకాల రంగును ఇస్తాయి. అలాగే పెదవులను తాజాగా ఉండేలా చేస్తాయి. 

ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, వ్యాజిలైన్, బీస్ వాక్స్(తేనె మైనం) మొదలైన వాటితో బీట్రూట్ రసాన్ని జోడించి లిప్ బామ్ ను తయారు చేసుకుంటే సహజంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి. పైగా బీట్రూట్ గుణాలు కూడా అందులో సమృద్ధిగా ఉంటాయి. 

ఇలా పైన చెప్పుకున్న మూడు మార్గాలు ఫాలో అయితే మెరిసిపోయే జుట్టు, కాంతివంతమైన చర్మం, చెర్రీ లిప్స్ అందరి సొంతం అవుతాయి.

                                    ◆నిశ్శబ్ద.