రాత్రిపూట ఈ స్కిన్ ట్రీట్మెంట్ పాటిస్తే అందం పెరుగుతుంది!!
రాత్రిపూట ఈ స్కిన్ ట్రీట్మెంట్ పాటిస్తే అందం పెరుగుతుంది!!
మహిళలు ఉదయం లేవగానే పనులు చేసుకుని ఫ్రెష్ అయ్యి ఆఫీసులకు వెళ్ళేటప్పుడు తాజా పువ్వుల్లా ఎంత అందంగా ఉంటారో తిరిగి ఆఫీసుల నుండి ఇంటికి చేరి నిద్రపోయే సమయానికి వాడిపోతున్న పువ్వుల్లా మారిపోతారు. అయితే రాత్రి ఎంత బాగా కంటినిండా నిద్రపడితే ఉదయం అంతబాగా తాజాగా ఉంటుంది ముఖం. అందుకే అందరూ నిద్ర గొప్ప మెడిసిన్ అని అంటారు. ఉదయం ముఖం తాజాగా ఉన్నా రాత్రి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే తెలియని బడలిక ముఖంలో అంతర్లీనంగా దాగిపోతుంది. దానికోసం నైట్ టైమ్ స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఫేస్ క్రీమ్!!
ఉదయం బయటకు వెళ్లిన తరువాత ఎండలోనూ, దుమ్ములోనూ తిరగడం వల్ల చాలా వరకు చర్మం ప్రభావానికి గురవుతుంది. ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఫేస్ కు ఉపయోగించే విటమిన్ సి, మాశ్చరైజింగ్ క్రీమ్ వంటివి చర్మాన్ని కప్పి ఉంచి ఎండ, దుమ్ము నుండి నష్టాన్ని అడ్డుకుంటాయి. అయితే రాత్రి సమయంలో వీటిని ఉపయోగించే చర్మానికి తగిన పోషకాలు అందిస్తాయి. నైట్ క్రీమ్స్ లో చర్మాన్ని టైట్ గా మార్చే గుణాలు ఉంటాయి. అందువల్ల రాత్రిపూట శరీరం విశ్రాంతి తీసుకునే సమయంలో ఈ నైట్ క్రీమ్ వాడటం ఉత్తమం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నైట్ క్రీమ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
కళ్ళ కోసం!!
చాలామందికి రాత్రి పడుకునేటప్పుడు బానే ఉంటుంది కానీ ఉదయం లేవగానే కళ్ళ కింద వాచిపోయి ఉంటాయి. పడుకున్నపుడు కంటి కింద భాగంలో స్రావాలు పేరుకుపోవడం వల్ల ఏర్పడే సమస్య అది. దాన్ని అధిగమించడానికి తల కింద రెండు దిండ్లు వేసుకుని పడుకోవాలి. ఎత్తువల్ల స్రావాలు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే కళ్ళ కింద కెఫిన్ ఆధారిత క్రీములు అప్లై చేయడం మంచిది.
హెయిర్ కేర్!!
రాత్రిపూట పడుకునేటప్పుడు జుట్టుకు కండిషనర్ అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలో జుట్టుకు మాశ్చరైజర్ రాయడం వల్ల అది జుట్టుకు పూర్తిగా ఇంకిపోయే సమయం ఉంటుంది. ఉదయానికల్లా జుట్టు సిల్కీగా మారుతుంది. ఇది మాత్రమే కాదు రాత్రిపూట జుట్టుకు నూనెతో మసాజ్ చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.
తడితో అలాగే ఉండకండి!!
రాత్రిపూట తలస్నానం చేసే అలవాటు కొందరికి ఉంటుంది. ఆ అలవాటు వల్ల తడిగా ఉన్న వెంట్రుకలను కొద్దిగా తుడిచి మిగిలిన తడి మొత్తం ఆరిపోతుందనే ఆలోచనతో అలాగే జుట్టును వదిలేసి నిద్రపోతుంటారు. అయితే అది చాలా తప్పు. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే తడిగా ఉన్న జుట్టుకు టవల్ చుట్టుకుని పడుకోవాలి. లేకపోతే పూర్తిగా ఆరిన తరువాత అయిన పడుకోవాలి.
చేతులు పాదాలకు!!
ఉదయం నుండి రాత్రి వరకు తేమ, ఎండ, వివిధ రకాల పదార్థాలు మొదలైన వాటితో కాళ్ళు చేతులు సహజత్వాన్ని కోల్పోయి ఉంటాయి. శుభ్రంగా నీటితో కడిగి ఆ తరువాత పొడిగా, మెత్తగా ఉన్న టవల్ తో తుడిచి వాజిలైన్ కానీ మాశ్చరైజింగ్ క్రీమ్ కానీ పూయాలి. దీనివల్ల చేతులు కాళ్ళ లో చర్మం జీవాన్ని నింపుకుంటుంది.
ఇలా రాత్రిపూట బ్యూటీ కేరింగ్ టిప్స్ పాటిస్తే ఉదయాన్నే మరీ హడావిడి పడక్కర్లేకుండా అప్పుడే విరిసిన పువ్వులా తాజాగా కనబడతారు.
◆నిశ్శబ్ద.