ఏ నాధుడు తీర్చలేడు

ఏ నాధుడు తీర్చలేడు - రమ అందమైన హిమాలయాలు అందాలన్నీ చీరగా చుట్టుకుని కనువిందుగా మురిపించాయ్, రా రమ్మని ఆహ్వానించాయ్... ఆ పరమాత్ముడు ముక్తినిస్తాడంటూ... నమ్మబలికాయ్ ఆశతో ఒడి చేరి ఆనందంలో మునిగి తేలుతున్నవారందరిని దయదాక్షిణ్యాలు లేకుండా ముంచేసాయ్... శవాలుగా మార్చేసాయ్ ఒకటా రెండా ఇన్ని వేల ప్రాణాలు పట్టుకుపోయి ఏ స్వామి గుమ్మానికి తోరణాలల్లుతున్నాయో... కళ్ళ ముందే అయినవారి ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటే ఏమి చేయలేని వారిగుండె కోత.... ఒకరి కన్నకొడుకు, ఒకరి కన్నతల్లి, మరొకరి భార్య, ఇంకొకరి భర్త ఇలా బంధాలని, అనుబంధాలని తెంచుకుని నీటిలో కలిసి పోయాయ్... కన్నీరుని మిగిల్చిపోయాయ్... ఏ "నాథుడు" ఆ అవిసిన గుండెల భాదని తీర్చలేదు... తీర్చలేడు.

అమ్మకోటి

    అమ్మకోటి   అమ్మా! ఎప్పుడో నీ ఒళ్ళో కూర్చున్నట్లు ఎక్కడో నీ ఉయ్యాల జంపాల ఊగినట్లు జ్ఞాపకాల నీడల్లోంచి నీ గాజుల సవ్వడి సుతిమెత్తని పువ్వుల్లా విప్పారుతుంటుంది నన్నే చెత్తకుండీలో పడేశావ్ ఏ రైలు పట్టాల మీదికి తోసేశావ్ నా జీవితాక్షరాల్ని చిందరవందర చేశావ్ నా పసితనం పారేసుకున్న బొమ్మవైనావ్ ఎక్కడున్నావమ్మా! పిల్చినా పలకవు ఆకలేస్తే గోరుముద్దల్లేవు మార్కులు చూసి ముద్దులు పెట్టావు పీడకలలొస్తే పక్కనలేవు జీవితం మోయలేని అనిభావాల అరణ్యంలో నీ పైట చెంగుకోసం ప్రపంచమంతా వెదుక్కుంటున్నాను నువ్వు చిల్లర పోగేసిన డబ్బా నా మెళ్ళో కట్టిన తావీదు నీ పాత పాస్ పోర్టు సైజు ఫోటో అన్నింటినీ మించి అచ్చం నీలాంటి నేను! నన్నెవరు మెచ్చుకున్నా ముందుగా నీకే చెప్పాలన్పిస్తుంది కష్ట సుఖాలన్నీ కలబోసి రాసే 'అమ్మకోటి'లొ నిత్యం నీ కోసమే కన్నీటి అన్వేషణ! నన్నెందుకు అనాథని చేశావనే అంతుదొరకని ప్రశ్నా నిరీక్షణ! ... అమ్మ ఉన్న అదృష్టవంతుల్లారా! అమ్మని బాధ పెట్టకండి బరువనిపిస్తే నా కిచ్చేయండి ... ప్లీజ్! -సి. భవానీదేవి    

నమ్మకం

 " నమ్మకం " జీవితానికి సారదై జీవనానికి వారదై ప్రేమకేమో పెన్నిదై  స్నేహానికేమో సన్నిదై  అమ్మలా ప్రేమిస్తూ నాన్నలా కాపాడుతూ  అన్నలా అనురాగం పంచుతూ  తమ్ముడిలా అభిమానం చూపుతూ  అక్కలా ఆప్యాయతను అందిస్తూ చెల్లిలా చిరునవ్వుల్ని చిందిస్తూ  ఆత్మీయుల ఆశీస్సులను అందిస్తూ  అనుబంధాలను పెనవేసుకుంటూ నీవు ఒక మనిషివని నీకు మనసు ఉన్నదని అది తీయని మాటలు పలుకునని మాసిపోని మమతను పంచునని చెదిరిపోని చిరునామాగా నిలిచునని నిక్కచ్చిగా నిర్భయంగా నిన్ను నలుగురి ముందు నిజానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబెట్టేది ఒక నమ్మకమే ఆ నమ్మకం మంచితనంతో వస్తుంది మానవతతో ప్రాణం పోసుకుంటుంది మనిషివని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ మంచితనాన్ని వంచన చేస్తూ ఆ నమ్మకాన్ని వమ్ముచేస్తూ అబద్ధాలు ఆడుతూ ఆత్యాశకు పోతూ అవినీతికి అలవాటు పడితే మంచికి చెడు సమాధానం అవుతుంది ప్రేమకు బదులు అసహ్యం చోటు చేసుకుంటుంది ఆశను నెట్టేసి నిరాశ చుట్టుకుంటుంది బ్రతుకును నరకమయం చేస్తుంది  జీవితం మీద విరక్తిని కలిగిస్తుంది అప్పుడు మనకు మనమే కాదు ఎవరికి మనం ఏమికాము మనకు ఎవరు ఏమికారు అందుకని నమ్మకానికి ఉన్న విలువను తెలుసుకో నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకో ! నమ్మకం ఉన్న మనిషిగా చరిత్రలోకాదు ఆత్మీయుల గుండెల్లో అనుబంధాల పెరుగుదలల్లో చెదిరిపోని జ్ఞాపకమై నిలిచి ఉంటావు. ఆ నమ్మకం విలువ తెలుసుకున్న వాళ్లకి   అదే నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్లకి అంకితం రచన - శాగంటి శ్రీకృష్ణ

చిరు చిరు నవ్వులు

చిరు చిరు నవ్వులు గానం : గీతిక బృందం, ఏడవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి.  చిరు చిరునవ్వుల చిలకల్లారా బంగరు పలుకుల మొలకల్లారా మనసులు కలిసి మెలగండీ మనుగడ కదిలీ మెదలండీ (??)           “చిరు చిరు” గాంధీ తాత ఏమయ్యాడు? మహాత్ముడై వెలుగొందాడు - ఎందుకని? కొట్టిన వారికి కొట్టలేదులే తిట్టిన వారిని తిట్టలేదులే సమతా మమతా మనదన్నాడు స్వాతంత్ర్యం సాధించాడు గాంధీ తాతా జోహార్! మహాత్మకూ మా జోహార్! “చిరు చిరు” చాచా నెహ్రూ ఏమయ్యాడు? ఏమయ్యాడు? శాంతిదూతగా నిలిచాడు - ఎందుకని? శాంతి పథమ్మే కాంతి మార్గమని ప్రపంచమంతా చాటాడు చాచా నెహ్రూ జోహార్! ఎర్ర గులాబీ జోహార్! శాంతి దూతకూ జోహార్!                       “చిరు చిరు” భారతమాత ఏమంటోంది?- ఏమంటోంది? క్రమశిక్షణతో నడువంటోంది నడువంటోంది మీరే జాతికి పునాదులు నీతికి నిజానికి రారాజులు మంచిని మీలో పెంచండి మనమంతా ఒకటని చాటండి భారతమాతా జిందాబాద్! చల్లని తల్లికి జిందాబాద్! అన్నపూర్ణకూ జిందాబాద్!                  “చిరు చిరు” కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

చిరునవ్వులతో

చిరునవ్వులతో                     చిరునవ్వుల దీపం వెలిగించు                     నీ బాధల యొక్క గతిని తొలగించి                     చిరునవ్వుల బాణం సంధించు                     శత్రువులే ఉండరు గమనించు                     మనిషన్నోడు మనసారా తానే నవ్వొచ్చు                     మనసున్నోడే తనవారిని కూడా                     నవ్వించవచ్చు !                     పైవాడు నీ నవ్వుని చూసి దిగిరావచ్చు                     నవ్వుతూ నీ కష్టాలని తీర్చవచ్చు                     నీ గుండెల్లో గాయాలు ఎన్నున్నా                     నవ్వే వాటికి మందు అన్నది మరవద్దు.                     నీ కన్నుల్లో విషాద కన్నీరు ఎంతున్నా                     నవ్వే వాటికి హద్దు అన్నది విడవొద్దు!                     ఈర్ష్యగా నిన్ను చూసి ఏడిచిన వారు                     నిబ్బరపోయేట్టుగా                     నీ చిరునవ్వుని నిచ్చెనగా చేసుకుని                     ఎక్కర ఒక్కొక్క మెట్టు !                     కోపాన్ని నవ్వు కరిగిస్తుందని                     రూపాన్ని నవ్వు వెలిగిస్తుందని                     పదిమందికి నువ్వే చాటింపు చేయ్!                     ఏడ్చేవాళ్ళుంటే కసితీరా                     ఎడ్పిస్తుందీ లోకం                     నవ్వే వాలుంటే కడుపారా                     ఏడుస్తుంది కాలం !                     కనుక లోకాన్ని ఎదిరించే మార్గం                     నీ చిరునవ్వు!                     కదిలే కాలాన్నీ ఎదురీదేటి ధైర్యం                     నీ చిరునవ్వు !                     ఇది జీవిత సత్యమని గుర్తించుకుని                     ఆనందం నీవై జీవించు!                     నీ చలనం నీవే గమనించుకుని                     సంచలనం నువ్వే సృష్టించు! రచన - శాగంటి శ్రీకృష్ణ krishna.6643@gmail.com

బాల్యం

బాల్యం                                         జ్ఞాపకాల దొంతరాలలో                     వెతికి పట్టాను నా బంగారు బాల్యాన్ని                     నన్ను నేనే మరచి                     ఆనందించిన క్షణాలు ఎన్నో                     స్నేహితులతో పంచుకున్న                     నవ్వులు పువ్వులు ఎన్నో                     పంట కాలువలు, కొంటె కేరింతలు                     పచ్చని పొలాలలో విచ్చిన పూవులు                     ఎక్కిన కొండలు, దిగిన బావులు                     ఏరిన రేగులు, రాలిన నేరేళ్ళు                     గొబ్బి పూవులు, దిబ్బ మేటలు                     కట్టిన గుడులు , పెట్టిన బొమ్మలు                     నడచిన బాటలు, ఆడిన తోటలు                     వెంటబడిన తూనిగలు                     వెంబడించిన తేనే టీగలు                     పచ్చని చిలుకలు, పిచ్చుక గూళ్ళు                     కోడి పెట్టలు , లేగ దూడలు                     తాటి కాయల బళ్ళు , గోటీ కాయల జేబులు                     పిచ్చి బంతులు , ఏడు పెంకులు                     గోటీ బిళ్ళలు , గొరింటాకులు                     గాలి పటాలు , గాలి పాటలు                     వేసిన ఊయలలు , చేసిన ఆకు బొమ్మలు                     స్వచ్చమైన నవ్వులు                     విచ్చుకున్న బంధాలు                     పెంచుకున్న అనుబంధాలు                     మెచ్చుకున్న ప్రేమలు                     మళ్ళీ తిరిగివస్తే బాల్యం                     మురిపెంగా దాచుకోనా                     బంగారు అక్షరాలతో                     నా బతుకంతా తీపి జ్ఞాపకాలుగా ! రచన - శాగంటి శ్రీకృష్ణ  

మారిన దశ

మారిన దశ అసలు జీవితం అంటే ఆనంద ప్రవాహమని ఎవరన్నారు ? అది ఏ ' ఏ.టి.ఎమ్ ' లో వెలువడుతుంది ? సంఘర్షణల ముళ్ళేసుకుంటూ డబ్బుల సంచుల ఎరువేసుకుంటూ పెదవుల మీదికి లాగిన చిరునవ్వుతో గడియారం ముళ్ళను నెట్టుకోవటమే కదా ! దహనమౌతూ వెలుగుల్ని నింపటమే కదా ! నిప్పుదోసిళ్ళతో నీరాజనాలివ్వటమే కదా ! అంత స్సీమల్ని వెలిగించని కర్పూరం ఎంత కరిగినా ఏం లాభం ? వయస్సు పొద్దువాల్దున్నప్పుడు మనసు గదిలో ఏ మూలో చావుముల్లు... నక్షత్రాల్ని మెరిపించాలంటే వెన్నెల కురవాల్సిందే ! సూర్యుడు మండిపోవాల్సిందే ! ఆత్మ దగ్ధమైపోతున్నా అస్తమయం తర్వాత కూడా మరో దిక్కున ఉదయించాల్సిందే ! రచన - డా. సి. భవానీదేవి 

నమస్సు

నమస్సు కం !! రావూరి భరద్వాజకు                                  కావించెద ప్రణతులు శుభాకామనతోడన్              జీవన సమరమ్మున కొక                                            పావనమగు పధము నిడిన ప్రథితుండనుచున్ !!       కం !! కాంతమ్మ - భరద్వాజుని                                        స్వాంతమ్మున శాంతినింప - చక్కని గతిలోన్                 భ్రాంతిని తొలగించుచు - వి                                      క్రాంతిని గలిగించు రీతి - కథలు రచించెన్ !! కం !! బాలలకొరకై కవితా                                       హేలలు సృష్టించి నాడు - హేరంబుకృపన్ !             తేలియకగు మాటలతో                                     కాలమునకతీతమైన కవితలు చెప్పెన్ !!              కం !! పాకుడు రాళ్ళు సృజించి - ది                                          వాకరుడై వెలుగులనిడి వాజ్మయమునకున్                  '' రాకాశశి '' వెనుకనగల                                       రాకాసుల జూపినాడు రసరమ్యముగన్ !!   కం !! భావుకుడై - జీవులపై                                      లావుగా పాఠకులు మెచ్చు రచనలు చేయన్        రావూరి భరద్వాజకు                                        దేవుడు వితరణ మొనర్చు దీవెనలు ధృతిన్ !! పద్యమౌళి, పద్యభాషి కందకవి సార్వభౌమ డా. రాధశ్రీ  

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ   నీకు తెలుసా ఎంత వద్దన్నా నీ చూపు చిరుస్వరమై నా యద వీణను మీటిందని నీకు తెలుసా కనిపించని నీకోసం నా మనసు వెతుకుతుంటే నీ కురుల మబ్బుల పరిమళం అలవోకగా నన్ను తాకిందని నీకు తెలుసా నీ జ్ఞాపకాల్లో నే జగం మరిస్తే నువ్వు హరివిల్లై అంబరమెక్కి మరీ నను మేల్కొలిపావని నీకు తెలుసా నిన్ను చూసిన మైమరుపులో వాననీటిలో నే జారిపడ్డప్పుడు ఫక్కుమన్న నీ నవ్వుల మువ్వలు నా గుండెగదిలో పదిలమయ్యాయని నీకు తెలుసా మన స్నేహితుని పెళ్ళి పందిట్లో నీ తల్లోంచి రాలిపడిన మల్లెపూవు నా శ్వాసనింకా నిలిపి ఉంచిందని నీకు తెలుసా వయసు ఆయుష్షు తనువుకే తప్ప తలపుకు కాదని జననం మరణం మనిషికే తప్ప మనసుకు కాదని నీకు తెలుసా చంటిపాపకైనా , శతాధికానికైనా ప్రేమ మాత్రం పసిపాప నవ్వులాంటిదనీ , ఎన్నటికీ వాడిపోని పువ్వులాంటిదనీ నీకు తెలుసా నీపై నా ప్రేమకు సరిగ్గా ఈ రోజుతో వసంతోత్సవమని నీకు తెలుసా ఎందరో వెర్రివాళ్ళు ఇవాళే ప్రేమికుల దినోత్సవం అంటున్నారని కానీ నాకు తెలుసు ప్రేమించే మనసుంటే ప్రతి క్షణమూ పరిమళమేననీ ప్రతి దినమూ ప్రేమకు పట్టాభిషేకమేననీ అందుకే నా జీవంపై ఒట్టేసి చెపుతున్నా నా ప్రేమ స్వచ్ఛమైనదైతే నువ్వెందుకు నాకు ?నీ జ్ఞాపకం చాలు నా మమతలో నిజాయితీ ఉంటే ఈ అస్థిత్వమెందుకు నేనే నీవై ఉంటే చాలు. Even when U have no trust - U only B in my thought & heart as my Love is pure and sure only on YOU     రచన - పద్మా శ్రీరాం  sphoorty01@gmail.com