మోదీతో మ్యాచ్ లో గోల్స్ చేస్తున్నాడా? సెల్ఫ్ గోల్సా?
posted on Nov 16, 2016 @ 2:05PM
కొన్ని సార్లు ప్రత్యర్థి మరీ బలవంతుడు, తెలివైన వాడూ అయితే పెద్ద పెద్ద యోధులు కూడా షాక్ కొట్టినట్టు అనూహ్యంగా తప్పులో కాలేసేస్తుంటారు. మోదీ విషయంలో కేజ్రీవాల్ ప్రవర్తన అలాగే వుంది. దేశ రాజధానిలో కమలాన్ని వికసించనీయకుండా రాత్రికి రాత్రి హీరో అయ్యాడు అరవింద్. కాని, పోను పోను అదే రీతిలో డౌన్ కూడా అయిపోతున్నాడు. మోదీపై పోరు విషయంలో ఒక దాని తరువాత ఒకటి తప్పు చేస్తూ పోతున్నాడు.
మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ భారీ విజయాలు సాధించిన వారే. అయితే, కేజ్రీవాల్ కన్నా మోదీ అనుభవం, నేపథ్యం చాలా పెద్దది. ఆయన ఆరెస్సెస్ లాంటి సముద్రంలో ఈదాడు, బీజేపిలో అంచెలంచెలుగా ఎదిగాడు, గుజరాత్ ను తిరుగు లేకుండా పాలించాడు. ఫైనల్ గా ఎందరు తల కిందులు తపస్సు చేసిన దేశ ప్రధాని అయ్యాడు. కాని, అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే ప్రభంజనంలో తెలివిగా లాభపడ్డాడు. మొత్తం దేశాన్ని ఏలేద్దామని తొందరపడ్డాడు. ఢిల్లీని కాదని వారణాసిలో భంగపడ్డాడు. మళ్లీ తిరిగొచ్చి జనం ముందు అద్భుతంగా పాసయ్యాడు. కాని, ఇప్పుడూ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. మోదీ మీద కాన్సన్ ట్రేషన్ తో అసలుకే మోసం తెచ్చుకుంటున్నాడు. అందుకు నోట్ల రద్దు వ్యవహారమే తాజా ఉదాహరణ...
అరవింద్ కేజ్రీవాల్ కి , ఆయన్ని అభిమానించే వారికి నచ్చకపోయినా మోదీ ప్రై మినిస్టర్ అన్నది నిజం. కేజ్రీవాల్ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కూడా లేని ఢిల్లీకి సీఎం. ఇది కూడా సత్యమే! కాని, ఏకే ఆ తేడాని మరిచిపోయి తహతహలాడుతుంటాడు. దేశంలో కేసీఆర్, చంద్రబాబు లాంటి ముప్పై మంది సీఎంలు వున్నారు. వాళ్లెవరూ తమ అసెంబ్లీలలో 500, 1000 నోట్ల రద్దుపై తీర్మానం చేయలేదు. ఎందుకని? ఈ ప్రశ్న వేసుకోకపోవటమే కేజ్రీవాల్ ఆవేశానికి కారణం! డిల్లీలో కేజ్రీ ఓ తీర్మానం చేసేశాడు. నోట్ల రద్దుపై రాష్ట్రపతికి కంప్లైంట్ కూడా చేశాడు. దీని ద్వారా ఆయన అత్యధిక జనానికి ఇవ్వదలుచుకున్న సంకేతం ఏంటి? నల్లధనం, అవినీతి అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఇవాళ్ల మోదీ బ్లాక్ మనీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తప్పుబడుతున్నాడు. అంతకంటే దారుణం... దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు! ఇప్పుడు ఏటీఎంలు, బ్యాంక్ ల ముందు బిజీగా వున్న జనం ఇదంతా పట్టించుకోకపోవచ్చు కాని... కొంత చిల్లర చేతుల్లో పడ్డాక అరవింద్ చేసిన పనుల గురించి ఆలోచిస్తారు. ఊరికే నోట్ల రద్దుని కుంభకోణం అనటం, పాత నోట్లే మళ్లీ కావాలని అనటం... ఇవన్నీ ఢిల్లీ సీఎం తనని తాను నల్ల ధనం పోగేసిన వారి తరుఫున నిలబెట్టుకోవటమే అవుతుంది. అంతే తప్ప ఆమ్ ఆద్మీకి ఇలాంటి మోదీ వ్యతిరేక పోరాటం వల్ల లాభం వుండదు!
అరవింద్ కేజ్రీవాల్ మోదీని వ్యతిరేకించ కూడదా? నిమ్మకు నీరెత్తినట్టు వుండిపోవాలా? అస్సలు కాదు. కేజ్రీవాల్ అయినా, రాహుల్ గాందీ అయినా, మమత, ఏచూరీ ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కాని, అది చేసే క్రమంలో సోషల్ మీడియా వచ్చేసి బాగా తెలివి మీరిపోయిన జనంలో తప్పుడు సంకేతాలు పంపకూడదు. కొత్త నోట్లు లేక జనం ఇబ్బంది పడుతున్నారన్నదే ముఖ్యం తప్ప పాత నోట్లు మళ్లీ కావాలని అనటం హాస్యప్పదం. అసలు పాత 500, 1000 నోట్లు తిరిగి చెలామణి కావాలని మామూలు జనం ఎవ్వరూ కోరటం లేదు. ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్ల బాధ తప్పితే చాలనుకుంటున్నారు. అంతే కాదు, ఇలా ఇంకో రెండ్రోజులు ఇబ్బంది పడ్డా నల్లధనం పీడ విరగడ కావాలని, మోదీ అందు కోసం ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మోదీ ఉద్దేశ్యం అది కాక బడా కార్పోరేట్లకు లబ్ధి చేయటం అయితే దాన్ని సమర్థంగా నిరూపించాలి. కాని, అరవింద్ కేజ్రీవాల్ రోజుకో ఘాటు వ్యాఖ్యతో మోదీపై కసి తీర్చుకుంటున్నాడు తప్ప సామాన్య జనానికి పెద్దగా దగ్గరవటం లేదు. వాళ్లు క్యూ లైన్లలో బాధపడుతుంటే ఈయన మోదీ ఎప్పుడో గుజరాత్ సీఎంగా 25కోట్లు లంచం తీసుకున్నాడని అర్తం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు! మోదీపై అవినీతి ఆరోపణలు, ఆయన భార్య గురించి కామెంట్స్, తల్లి గురించి వెటకారాలు, 2002 అల్లర్ల విషయంలో సుప్రీమ్ తీర్పునే తప్పుబట్టడం, ఆయన వేసుకున్న కోటు ఖరీదు, ఇక మొన్నటికి మొన్న జరిగిన సర్జికల్ స్రైక్స్ కి సాక్ష్యాలు అడగటం... ఇవన్నీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాయని ఆల్రెడీ చాలా సార్లు ప్రూవ్ అయింది. కాని, ఆమ్ ఆద్మీ వారికి అర్థమైనట్లు లేదు... పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలే జ్ఞానోదయం చేయాలి...