అభాగ్యుల దేశంలో... ఆర్భాటపు పెళ్లిల్లు!
posted on Nov 22, 2016 @ 11:01AM
పెళ్లి... ఈ రెండక్షరాల పదం మనిషి జీవితంలో చాలా ముఖ్యమైంది. ఇప్పుడైతే కష్టమైంది కూడా! ఎందుకంటే, పెళ్లిళ్లు అవ్వటం గగనమైపోతోంది సిటీలోని మిడిల్ క్లాస్ జనాలకి. ఇక ఒకవేళ అయినా కూడా పెటాకులవుతోన్న పెళ్లిల్లు కూడా ఎక్కువే వుంటున్నాయి ఈ మధ్య కాలంలో! మొత్తం మీద మ్యారేజ్ అనేది కొందరికి క్రేజ్ గా, కొందరికి డ్యామేజ్ గా, మరి కొందరికి బాండేజ్ గా తోస్తోంది! కాని, మామూలు జనం పెళ్లిని ఒకలా చూస్తోంటే... డబ్బున్న వాళ్లు వెడ్డింగ్ పేరు చెప్పి కోట్లకు కోట్లు గాల్లో ఎగరేస్తున్నారు. గాలి అనగానే మనం ఎవరింటి పెళ్లి హడావిడి గురించి మాట్లాడుకోబోతున్నామో అర్థమైందిగా?
గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి... ఇది నిన్నటి దాకా పెద్ద టాపిక్. కాని, ఇప్పుడు ఆయన మీద జరుగుతోన్న ఐటీ దాడులు హాట్ టాపిక్. కాకపోతే, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారాల పట్టి పెళ్లి అప్పుడే పాతబడిపోయింది! ఎందుకంటే, అంతకంటే గ్రాండ్ గా తన కొడుకు పెళ్లి చేయటానికి మరో బెంగుళూరు కోటిశ్వరుడు రంగంలోకి దిగాడు! గాలి జనార్దన్ రెడ్డి బీజేపి నేత అయితే ఈయనగారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి. స్వయంగా సర్కార్ లో భాగమై వుండి రమేష్ అనే సదరు కాంగ్రెస్ నాయకుడు జనానికి దిమ్మ తిరిగిపోయేలా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు!
ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్న తరహా పరిశ్రమల మంత్రి అయిన రమేష్ పెళ్లి మంటపాన్నే రెండు ఎకరాల్లో ఏర్పాటు చేయిస్తున్నాడట. అంతే కాదు, తన కొడుకు పెళ్లికి దాదాపు లక్ష మందిని వరకూ ఆహ్వానిస్తున్నాడట. ఇక ఎకరాల కొద్దీ స్థలంలో నిర్మించిన పెళ్లి మంటపం మొత్తం ఎయిర్ కండీషన్డ్ కూడా చేయబడుతుందట. అంతే కాదు, ఆదివారం జరగనున్న ఈ గ్రాండ్ మ్యారేజ్ కోసం వీవీఐపీలు హెలికాప్టర్లలో రానున్నారట! వాళ్ల కోసం హెలిపాడ్లు కూడా సిద్ధం అవుతున్నాయి. పెళ్లి మంటపం కొల్హాపుర్ మహాలక్ష్మీ ఆలయం నమూనాలో వుంటుందట!
నిన్న గాలి జనార్డన్ రెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి రమేష్... కర్ణాటకలో వరుసగా ఘనమైన వివాహాలు ఆర్భాటంగా జరుగుతున్నాయి. అంతే కాదు, సామాన్యులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద చుక్కలు చూస్తున్నా వీరి పెళ్లిళ్ల హడావిడి ఎంత మాత్రం తగ్గటం లేదు. పైగా అధికార, ప్రతిపక్షాల్లోని కీలక నేతలే ఇలాంటి హంగామాకు తెర తీస్తున్నారు. ఇలాంటి కోట్ల రూపాయల పెళ్లిల్లు కర్ణాటక రాష్ట్రానికే పరిమితం కాదు. దేశంలోని చాలా చోట్ల వెడ్డింగ్ పేరు కోట్లు వెదజల్లటం మామూలైపోయింది. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు, క్రీడాకారులు... ఇలా ఎవరికి వారు పెళ్లి అనగానే తలంబ్రాల కన్నా ఎక్కువగా డబ్బులు పైకెత్తి పోస్తున్నారు!
బాగా డబ్బున్న వాళ్లు గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకోవటం తప్పు కాదు. పైగా దాని వల్ల వాళ్ల వద్ద ఊరికే మూలుగుతున్న ధనమంతా బయటకొచ్చి పెళ్లి జరగటానికి కారణమైన సామాన్యులకి చేరుతుంది! అవసరం అనుకుంటే ఐటీ శాఖ ఈ భారీ పెళ్లిళ్ల కోటీశ్వరుల్ని వివరణ కూడా కోరవచ్చు. కాని, సమస్యల్లా... అసలు ఒకే భారతదేశంలో ఇంత గ్రాండ్ మ్యారేజెస్ జరుగుతోంటే... మరో పక్క శవాలు వాహనంలో తీసుకెళ్లటానికి, తమ వార్ని దహనం చేయటానికి డబ్బులు లేని కఠిక దరిద్రులు కూడా కోట్లలో ఎలా వుంటున్నారు? గాలి జనార్దన్ రెడ్డి జరిపించిన లాంటి ఆర్భాటపు పెళ్లిల్లు ఒక్కటే ఋజువు చేస్తాయి... మన దేశంలో ధనికుడు మరింత ధనికుడు, పేదవాడు మరింత పేదవాడూ అవుతున్నాడు. ఈ వ్వత్యాసం సాధ్యమైనంత తగ్గనంత వరకూ... అభివృద్ధి కేవలం ప్రచారంలో వుండే ఫ్యాషనబుల్ పదం మాత్రమే!