ఓట్ల కోసం... నల్ల నోట్ల జాతర!
posted on Nov 23, 2016 @ 4:40PM
నోట్లు రద్దై దేశమంతా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లలోకి వచ్చింది. కాని, అసలు నల్లదనం జాతర అయిదేళ్లకోసారి జరుగుతుంది మన దేశంలో! అదేంటో మీకు తెలుసా? ఎన్నికలు!
అవును... ఎలక్షన్స్ వస్తే భారతదేశంలో కరెన్సీ వరద పారుతుంది. మందు సీసాల లోంచి ఘాటైన వాసనగా బయటకొస్తుంది! బిర్యానీ పొట్లాల లోంచి ఘుమఘుమలాడుతూ ఊరిస్తుంది! అసలింతకీ మన ప్రిపేయిడ్ ఎన్నికల నల్ల సత్యాలేంటో మీకు తెలుసా? ఇవి చూడండి ... మీకే కళ్లు బైర్లు కమ్ముతాయి. గ్యారెంటీ...
ఇండియన్ ఎలక్షన్స్ లో అత్యంత ఖరీదైన ఎన్నికలు ఎంపీ సీట్లకు జరిగే పార్లమెంట్ వే! మొత్తం 543 ఎంపీ సీట్లుంటే ఒక్కో సీటుకి సగటున ఎంత ఖర్చు చేస్తారో తెలుసా? దాదాపు 45కోట్లు! ఇలా ఒక్కో నియోజక వర్గం నుంచీ 45కోట్లు గుమ్మరిస్తే మొత్తం దేశంలో ఒక సాధారణ ఎన్నికలు పూర్తయ్యేలోగా అయ్యే ఖర్చు... ఇంచుమించూ 25 వేల కోట్లు!
ఎంపీల తరువాత ఆ స్థాయిలో చక్రం తిప్పేది ఎమ్మేల్యేలు. వీళ్ల గాలంతా రాష్ట్రాల లోపలే వీచినా... వీళ్లు కూడా ఒక్కో నియోజకవర్గానికి 25కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట! అంటే దేశంలోని మొత్తం 4,120అసెంబ్లీ స్థానాలకి లక్ష కోట్ల వరకూ ఖర్చవుతోంది. రాష్ట్రాన్ని బట్టీ, పోటీని బట్టీ, అభ్యర్థుల్ని బట్టీ అసెంబ్లీ స్థానాల ఖరీదు మారిపోతూ వుంటుంది. ఒక్కో చోట పది కోట్ల లోపలే వ్వవహారం పూర్తి అవ్వొచ్చు....
ఎమ్మేల్యేలు, ఎంపీలే కాదు... ఎమ్మెల్సీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లోని ప్రతినిదులు కూడా భారీగానే ఓట్లు ఖరీదు చేస్తున్నారు. అందరూ డబ్బుల వరద పారిస్తారనే చెప్పకపోయినా అలా చేయకపోతే గెలిచే సీన్ లేదని మాత్రం చెప్పొచ్చు. అందుకే, మనకు ఏవో చిన్న చిన్న ఎన్నికలుగా కనిపించే వాటికి కూడా లక్ష కోట్లు ఎగిరిపోతున్నాయి!
ఇలా ఒక్కో రకం ఎన్నికలకి ఒక్కో రేంజులో కాసుల కాల్వలు తవ్వి మన నేతలు నల్ల సేద్యం చేస్తున్నారు. ఒక్కసారి అధికారపు పంట ఈ ప్రీపెయిడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల చేతికి వచ్చిందా.... అయిదేళ్ల పాటూ కోతలే కోతలు! పెట్టిన డబ్బులకి కనీసం డబుల్ దండుకునే దాకా దున్నటం ఆపటం లేదు!
అయిదేళ్లలో అన్ని ఎన్నికలకు కలిపి దేశంలో 2,25,000కోట్లు చేతులు మారుతున్నాయట! ఇదంతా ఎవ్వరూ ఎవ్వరికీ రసీదులు రాసి ఇవ్వని బ్లాక్ మనీనే! ట్యాక్స్ తో సంబంధం లేని సీక్సెట్ హనీనే! మరి ఇదంతా కేవలం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పాపమే అనుకుంటున్నారా? అదేం కాదు! అన్ని పార్టీలకూ వందల కోట్ల విరాళాలు వచ్చి చేరుతున్నాయి. వాటికి లెక్కా పత్రం అంటూ వుండదు. 20వేల కన్నా తక్కువ చందాలకు పార్టీలు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాతల పేర్లు, కంపెనీల వివరాలు చెప్పాల్సిన పనిలేదు. అందుకే, బీజేపీ, కాంగ్రెస్ లతో సహా మన పార్టీలు అన్నీ 20వేల కంటే తక్కువ వసూళ్లే చేసినట్టు రికార్డ్ లు చూపుతాయి! నిజంగా మాత్రం వీటి వద్ద మూలుగుతున్న వందల కోట్లకు ఎలాంటి అధికారిక లెక్కలు లేవు!
నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోదీ పార్టీ అయిన బీజేపి వద్దే మార్కెట్లోని 44శాతం బ్లాక్ మనీ ఫండ్ గా వుందంటారు. అలాగే, కాంగ్రెస్ ఆ తరువాతి స్థానంలో 39.4శాతం ఫండ్ కలిగి వుందట! సీపీఎం వద్ద 8శాతం, బీఎస్పీ వద్ద 4.4శాతం, ఎన్సీపీ వద్ద 3.7శాతం, సీపీఐ వద్ద 0.2 శాతం పార్టీ ఫండ్స్ వున్నాయట! ఇక డబ్బులుగా మాట్లాడుకుంటే మన పెద్ద పెద్ద పార్టీల వద్ద వున్న విరాళాల మొత్తం ... 813.6కోట్లు. అందులో 565.8కోట్లు అజ్ఞాత దాతలు ఇచ్చారంటూ అన్ని పార్టీలు కూడబలుక్కుని వివరాలు దాచేస్తున్నాయి. అంటే... ఇదంతా కూడా ఒక విధమైన బ్లాక్ మనీనే!
జాతీయ పార్టీలు, ఉత్తరాది పార్టీలే కాదు... మన తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా తక్కువేం తినలేదు. ఎన్నికలు వస్తే దశల వారీగా, దళాల వారీగా తిన్నోడికి తిన్నంత తినిపిస్తున్నాయి! మన దగ్గర అసెంబ్లీ స్థానం గెలవాలంటే గరిష్టంగా 26కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట రాజకీయ నేతలు. ప్రతీ చోటా అంత చమురు వదలకున్నా... కనీసం 14కోట్లు సమర్పించుకోకుండా ఎమ్మేల్యే అయ్యే ఛాన్స్ లేదట!
తెలుగు ఎంపీలు... గెలిచిన వారు, ఓడిన వారు అంతా కలిసి మనకున్న 42పార్లమెంట్ సీట్లకుగానూ... ఒక్కో నియోజక వర్గానికి 67కోట్ల దాకా ఫ్లష్ చేశారట! అంటే 3వేల కోట్లు లెక్క జమా లేకుండా చేతులు మారాయన్నమాట! తెలుగు స్టేట్స్ లో పార్టీలు ఇచ్చే ఎమ్మేల్సీ బీపామ్ కూడా ఖరీదైందే! ఒక్కో అభ్యర్థి 9కోట్లు వెదజల్లుతున్నాడంటున్నారు!
ఓట్లు పడే సమయంలో నోట్ల ప్రవాహం ఆపకుండా .... మామూలు కాలంలో నోట్లు రద్దు చేస్తే లాభం అంతంతమాత్రమే! మోదీ ఇప్పుడు చేసిన నోట్స్ బ్యాన్ రాబోయే ఎన్నికల్లో ఎంత మేర బ్లాక్ మనీని కంట్రోల్ చేస్తుందో వేచి చూడాలి! కాని, పూర్తిగా మందు, బిర్యానీలు లేని ఎలక్షన్స్ ఆమాంతం వచ్చేస్తాయని ఆశించటం మాత్రం అతే అవుతుంది. ఎందుకంటే, సాధారణ జనం పెద్ద ఎత్తున పాల్గొనే జనరల్ ఎలక్షన్స్ కాదు మన దేశంలో టీచర్లు, పట్టభద్రులు పాల్గొనే ఎమ్మేల్సీ ఎన్నికలు కూడా డబ్బులిస్తేనే ఓట్లు వేసే దయనీయమైన స్థితిలో వున్నాయి! చదువు లేని వారికంటే చదువుకున్న వాళ్లలోనే అవినీతి, అలక్ష్యం ఎక్కువగా వున్నాయి. అందుకే, మనం మారాలి. అప్పుడే బ్లాక్ మనీ నుంచి వైట్ మనీ దిశగా దేశం అడుగులు వేస్తుంది!