ట్రంప్ విజయంపై భయపడుతున్న అమెరికన్లు..
posted on Nov 11, 2016 @ 2:47PM
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన విజయం ఆ దేశంలో ఒకవైపు సంబరాలు జరుపుకుంటుండగా అదే రేంజ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త అధినేత వస్తుంటే నిరససలు జరగడం బహుశా అమెరికా చరిత్రలో ఇదే ప్రథమమేమో. ట్రంప్ విజయాన్ని నిరసిస్తూ నిన్న పెద్ద సంఖ్యలో జనం రోడ్లమీదకు చేరారు. ట్రంప్ వ్యతిరేక బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన మాకు అధ్యక్షుడు కాదు..దేశంలో విద్వేషానికి చోటు లేదు అంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా ఐటీ కేంద్రం సిలికాన్ వ్యాలీ వాసులు ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నా జీవితంలో జరిగిన చెడు సంఘటనగా భావిస్తున్నా.. అయితే దీన్ని అంగీకరించకతప్పదు. పరిస్థితులు ఇదివరకటిలాగే ఉంటాయనుకోవడం లేదని ఒక సంస్థ యజమాని ట్వీట్ చేశారు. బహుశా హిట్లర్ అధికారం తీసుకున్నపుడు ప్రజలు ఇలాగే అనుకున్నారా అని మరోకరు ట్వీట్ చేశారు. ఇంకొందరైతే ఏకంగా కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా నుంచి విడిపోతే మంచిదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
అసలు ట్రంప్ అధ్యక్షుడైనందుకు జనం ఇంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది ఆయన నోటి దురుసు వల్లే వచ్చిందనుకోవాలి. దూకుడు, నోటి దురద, జాత్యాహంకార వాగుడు, విద్వేష ప్రచారం, ప్రత్యర్థులను దుమ్మెత్తి పోసే ధోరణితో డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పదంగా మారారు. ప్రచారంలో భాగంగా రోజుకో సంచలన ప్రకటనతో దూసుకుపోయారు. ఈ నెగటివ్ అంశాలనే పదేపదే చూపుతూ మీడియా హోరెత్తించింది. దానికి తోడు వలసవాదుల విషయంలో ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడి స్ధానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి కంపెనీలు చైనా, భారత్, మెక్సికో దేశాలకు చెందినవారిని హెచ్1బీ1 వీసాల ద్వారా అమెరికాకు పిలుపించుకుని తక్కువ వేతనానికి నియమించుకుని పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. హెచ్1బీ1 వీసాలు స్థానిక ఉద్యోగులకు గండికొడుతున్నాయని ఆయన పలు సభల్లో బహిరంగంగానే విమర్శించారు.
అందుకే సిలికాన్ వ్యాలీలో మొదటి నుంచి ఆయనపై సానుకూల స్పందన లేదు. సిలికాన్ వ్యాలీలోని కంపెలనీ అధిపతులకు, అక్కడి టెక్కీలకు మా మొదటి ఛాయిస్ ట్రంప్ కాదని ముందే ప్రకటించేశారు. సాంకేతిక నిపుణులు అమెరికాలోకి వలస రావడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారని..కానీ ఇక్కడ పనులు జరగాలంటే భారత్, చైనా లాంటి దేశాల నుంచి నిపుణులైన టెకీలు కావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. వలసలపై నిషేధం విధిస్తే ఇక్కడ లాభాల మాట దేవుడెరుగు కంపెనీలు నడవటమే గగనమంటున్నారు. అందుకే ట్రంప్‌ను పేరుపెట్టి విమర్శించకపోయినా, ఆయన వలస విధానాలను ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర పదజాలంతో తప్పుపట్టారు. ఐటీ పరిశ్రమ మొత్తం హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. ట్రంప్‌కు ఇచ్చిన దానికంటే 114 రెట్లు అధికంగా హిల్లరీకి విరాళాలు అందజేసింది.
సిలికాన్ వ్యాలీ అంటే వ్యాపార అవసరాలు అనుకోవచ్చు కానీ మిగిలిన రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రజలపైనా ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ముస్లింలకు, మెక్సికన్లకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సెక్యులరిజం గురించి మాట్లాడేవారు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆయన అధ్యక్షుడైతే తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని చాలా మంది ఆందోళన చెందారు. ఈ అంశాలను బేరీజు వేసుకున్న మీడియా సహా మిగిలిన సంస్థలు వెలువరించిన సర్వేల్లో హిల్లరీనే అదృష్టం వరిస్తుందని ప్రకటించారు. చివరకు పోలింగ్ జరుగుతున్న సమయంలోనూ ఐటీ పరిశ్రమ వర్గాలన్నీ హిల్లరీ గెలుస్తారనన్న అభిప్రాయంతోనే ఉన్నాయి. అధ్యక్షురాలైతే ఆమె ముందుగా ఏం చేస్తారా అన్న దానిపై చర్చించుకుంటున్నాయి.
కానీ సర్వేలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ..అనూహ్యంగా ట్రంప్ అమెరికా 45వ ప్రెసిడెంట్‌గా ఎన్నికై..అమెరికన్లనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ ఫలితాలతో షాక్ తిన్న సిలికాన్ వ్యాలీ సహా దేశంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు ట్రంప్‌ను అధ్యక్షుడిగా జీర్ణించుకోలేక రోడ్ల మీదకు వచ్చారు. అవునన్నా కాదన్నా ట్రంప్ ఇప్పుడు అమెరికా అధినేత..ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ఫలితాన్ని మార్చలేమన్న సంగతి అక్కడి ప్రజలు తెలుసుకోవాలి. గెలవాలనే తలంపుతోనే ట్రంప్ ప్రచారంలో నోరు జారారా..? లేదంటే తన మనసులో ఉన్న మాటనే చెప్పారా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.