హోదా దక్కేది ఎవరిది..?
posted on Nov 12, 2016 9:05AM
నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావోస్తుంది. ఎన్నికలకు రెండేళ్లకు మించి సమయం లేదు. అధికార టీడీపీని ఎదుర్కొని 2019 ఎన్నికల్లో లబ్ధిపొందడం అంత తేలిక కాదు. అందుకే జనంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మిగిలిన పార్టీలు రెడీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోగా...ఇక మిగిలింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాస్తో కూస్తో విజయావకాశాలు జగన్‌కే ఉంటాయి. కానీ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. పవన్ బయటి నుంచే మద్ధతు ఇస్తాడు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాడు అనుకున్నారంతా..
కానీ అనంతపురం సభలో తాను 2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు..ఇదే అనంత నుంచి ఎమ్మెల్యేగా పోటి చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపైనే పోరాటం చేస్తానని చెబుతూ వస్తోన్న పవన్ ఆ దిశగా ఇంకా ముందుకు వెళతానని తెలిపాడు. అయితే అంతకు ముందు నుంచే జగన్ ప్రత్యేకహోదా విషయంలో ఆందోళనలు, సభలు, యువభేరీలు అంటూ దూసుకెళుతున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా పై పోరాటం చేసే విషయంలో వైసిపి అధినేత జగన్ కు..జనసేన అధినేత పవన్ కు మధ్య అధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. కేంద్రం ప్రత్యేక హోదా అనే పేరునే కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తుండగా...ఈ రెండు పార్టీలు మాత్రం హోదా అంశాన్నే వేదికగా తీసుకుని మందుకు వెళ్తున్నాయ్. ఇంతకీ అంతిమంగా హోదా బరిలో నిలిచేదెవరు?...ఆఖరి పోరాటం లో గెలిచేదెవరు?
ప్రత్యేక హోదా...ఇపుడు రాష్ట్రంలోనే కాదు....రాజకీయపార్టీల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది...కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా ..ఇవ్వదా అనే అంశాన్ని పక్కన పెడితే...రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా పై పోరాటం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. కేంద్రం వైపు నుంచి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్పష్టత కరువవుతూ వస్తోంటే...రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో మాత్రం...ప్రత్యేక హోదా పోరు విషయంలో క్రమంగా స్పష్టత వచ్చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హోదా ప్రధాన అంశంగా మారే అవకాశం కనిపిస్తుండటంతో ఇప్పటిదాకా దారి తెన్నూ లేకుండా...ఎవరికి వారే ప్రత్యేక హోదా పై పార్టీ వేదికల మీద నుంచి వాయిస్ విన్పించిన నేతలంతా..ఇపుడు ఈ ఇష్యూను ఓన్ చేసుకునే ప్రయత్నంలో బిజీ అయ్యారు .
సాధారణ ఎన్నికల తర్వాత వైసిపికి ప్రత్యేక హోదా అంశం ఆయుధంగా లభించింది. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ హోదా అంశాన్ని హైలెట్ చేయడం ద్వారా వైసిపి నేతలు బాబు సర్కారును ఇరుకున పెట్టేందుకు సీరియస్ గా ప్రయత్నించారు. హస్తిన మొదలుకుని అమరావతి దాకా వైసిపి అధినేత ఈ అంశం పై దీక్షలు..ధర్నాలు చేపట్టారు. తాజాగా విశాఖలో జై అంద్రప్రదేశ్ సభ, యవభేరిల పేరుతో విద్యార్దులకు అవగాహన కల్పిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా పలు సార్లు వైసిపి నేతలు ఇదే అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నించారు. బంద్ లు నిరసనల ద్వారా ఈ అంశం పై అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు...వైసిపి నేతలు.
ప్రత్యేక హోదా పై తమ దగ్గరున్న ఆయుధాలన్నీ వాడేసిన జగన్ ఇక ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే సమయంలో ....సీన్ లోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంటరయ్యారు. ప్రత్యేక హోదాపై సమరశంఖం పూరిస్తానంటూ... మరోసారి హోదాపై చర్చకు తెరలేపారు. 2014 ఎన్నికల్లో జనసేనను తెరపైకి తెచ్చినా...పోటీ చేయకుండా బిజెపి, టిడిపిలకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ హోదా విషయంలో అందుకు భిన్నంగా ప్రవర్తించారు. హోదానే తనకు ముఖ్యమని చెప్తూనే బిజెపి.. టిడిపిలకు గుడ్ బై కొట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక రిసెంట్ గా అనంతపురంలో సభలో పవన్ ప్రసంగం అందర్ని అకట్టుకుంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ . 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తానని ఉద్ఘాటించారు. హామీలు వినీ వినీ విసిగిపోయిన తమ భావావేశాలతో ఆడుకోవద్దని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలను హెచ్చరించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని.. ఉద్రేకాలు పెరిగే స్థాయికి పరిస్థితిని తీసుకురావొద్దని చెప్పారు. హామీలను నెరవేర్చే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఇదే ఇష్యూను తనకు అనుకూలంగా మలచుకుని వచ్చే ఎన్నికలనాటికి జనసేన అధినేత ఎన్నికల బరిలో దిగుతారు అని ..రాజకీయ విశ్లేషకుల అంచనా....
ప్రత్యేక హోదా పోరాటం క్రెడిట్ అంతా తమ ఖాతాలో పడుతుందని వైసిపి నేతలు అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ వైసిపి నేతలకు కోంత మేరకు ఇబ్బందిగా మారింది. తాము రెండు సంవత్సరాలుగా ఈ అంశం పై సాధించిన ఇమేజ్ ను మూడు బహిరంగ సభలతో పవన్ ఎగరేసుకు పోయారని వైసిపి నేతలు అనుకుంటున్నారు. ఇక ఇష్యూ బేసెడ్ గా పవన్ అనంతపురం సభలో కుడా పవన్ తన పవర్ ఫుల్ స్పీచ్ అకట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు. మెన్నటి వరకు రాష్ల్ర ప్రభుత్వం పైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపైనా కాస్త విరుచుకుపడ్డారు. కేంద్ర ప్యాకేజీని చంద్రబాబు ఎలా స్వాగతించారు అని పశ్నించారు. దీనికి బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తులపై తాను పోరాటం చేయడం లేదు.. విధానాలపై పోరాటం చేస్తున్నానని అన్నారు. జనసేన తొలి ఆఫీస్‌ను అనంతపురంలోనే ఏర్పాటు చేస్తానని చెప్పిన ప్రజలకు అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఉండదు అన్నారు. పవన్ విషయంలో ఆచితూచి స్పందిచాలని అనుకున్నా వైసీసీ ఇక జనసేనను కూడా ఎదుర్కోవటానికి సిద్దం అవుతోంది.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి..2019 నాటికి ప్రభుత్వం మీద అంతో ఇంతో వ్యతిరేకత రాక మానదు...దీనిని మరింత పెంచి తన ఎకౌంట్‌లో వేసుకుని ఎలాగైనా అధికారం అందుకోవాలని చూస్తున్నారు జగన్. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు అప్పట్లో అమరావతి, భూసేకరణ తదితర అంశాలను వాడుకుంది వైసీపీ. అయితే అవి అప్పటికప్పుడే.. అందుకే ఎన్నటికి వాడిపోని హోదా అంశాన్ని జగన్ భుజానికెత్తుకున్నాడు. ఇప్పుడు ఆయన దారిలో నడిచేందుకు జనసేన అధినేత పావులుకదుపుతున్నాడు. 2019 నాటికి వీలైనన్ని సినిమాలు చేసి దానితో పాటే ప్రత్యేకహోదా విషయంలో ప్రజల పక్షాన పోరాడి వారి ఆదరణను పొందాలని చూస్తున్నారు. హోదాతో పాటు రాయలసీమ కరువు, గోదావరి మెగా అక్వా ప్రాజెక్ట్‌ల విషయంలో పోరాటం చేయాలని..తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారు జనసేనాని.
పవన్ కానీ జగన్ కానీ సభలు..సమావేశాలు పెట్టడం..జనాన్ని చైతన్యం చేస్తున్నాం అని చెబుతున్నారే కానీ ఇద్దరూ హోదా సాధించే విషయంలో తగిన కార్యాచరణను ప్రకటించడం లేదు. పవన్ ఇప్పటికే మూడు సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని చెడా మడా వాయించి వదిలిపెట్టాడు..ఒకసారి పాచీపోయిన లడ్డూలు అన్నాడు..మరోసారి మనకు రావాల్సిన వాటా ఇచ్చినందుకు సన్మానాలు చేశారు అన్నాడు తప్పితే హోదా ఎందుకు రాదో..హోదా అనే పదాన్ని కేంద్రం ఎందుకు రద్దు చేయాలనుకుంటుందోనని నిలదీయలేదు. అటు జగన్ కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు బీజేపీ వద్ద చేతులు కట్టుకుంటున్నారని..ప్రతీదానికి రాజీ పడిపోతున్నారని ..ఎన్‌డీఏ నుంచి బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నాడు తప్పితే...ప్రధాన ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో పోరాటం చేయడం లేదు. మరి కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ తప్పించి..ప్రత్యేకహోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్, పవన్‌ల పోరాటం ఎంత వరకు సక్సెస్ అవుతోందో..జనం వీరిని ఏమేరకు ఆదరిస్తారో..అసలు కేంద్రం ఎలాంటి స్ట్రోక్ ఇస్తుందో వేచి చూడాలి.