1000కీ బై..2000కి హాయ్..భారతీయుడికేం మిగిలాయ్
posted on Nov 10, 2016 @ 11:32AM
అయ్యా ..!
గౌరవనీయులైన
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారికి,
నల్లధనాన్ని అరికట్టడానికి మీరు 500,1000 రూపాయలు నోట్లు రద్దు చేశారు. బాగుంది చాలా బాగుంది ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ చెయ్యలేని పనిని మీరు చేశారు.. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పుకోడానికి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా దాచుకున్న నల్లదనం పకోడి పోట్లాలకి, పల్లీలు చుట్టుకోడానికి ఇంకా మిగిలిపోతే ఈ చలికాలంలో చలిమంట వేసుకోడానికి తప్ప ఎందుకు పనికి రాదు అని, ఇకపై ఎవ్వరూ పన్నులు ఎగ్గొట్టలేరు అని ప్రభుత్వానికి పన్ను వసూళ్ళు పెరిగి ఆదాయం పెరుగుతుంది అని మంగళవారం రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా మీడియా గొంతు చించుకుని చాలా బాగా ప్రచారం కూడా చేసింది. అయితే దీని వలన నాలాంటి సామాన్యుడికి ఒరిగే ప్రయోజనం ఏంటో నాకు అర్ధం కావట్లేదు.
లంచం ఇవ్వనిదే ఏ పని చెయ్యం అని ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగుల చేత మా లాంటి వారు ఎలా పని చేయించుకోవాలి. ఇప్పటి వరకు 1000 నోట్లు జేబులో కుక్కుకోడానికి ఇబ్బంది పడిన ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఇబ్బంది లేకుండా... ఇంకా ఎక్కువ డబ్బులు జేబులో కుక్కుకోడానికా మీరు 2000 రూపాయల నోట్లు రిలీజ్ చేసింది. దాని వలన మీ ప్రభుత్వ ఉద్యోగులకి కదా సర్ ఉపయోగం . దానివల్ల మాకేంటి ఉపయోగం. మేము కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని అ జీతాలు సరిపోక మళ్ళి మా దగ్గర లంచాలు బొక్కే పందికొక్కులు ఏమో దర్జాగా ఆఫీస్ కి ఆడి కార్లు వేసుకు వస్తే వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులం అయిన సామాన్య ప్రజానీకం ఏమో ఆర్టీసి బస్సులు ఎక్కి మీ చేత పని చేయించుకోడానికి రావాలా? పన్ను కట్టి జీతం ఇచ్చే యజమాని ఏమో ఎండలో నిలబడాలా? మా డబ్బులు జీతాలుగా తీసుకుని పని చేసే నాయకులూ, ఉద్యోగులు ఏమో ఏసి రూముల్లో కాలు మీద కాలు వేసుకు కూర్చుంటారా?మా సొమ్ము తో మీ ఉద్యోగులు, మంత్రులు ఊరేగుతారా?
జనాలని నిలువుగా దోచుకుని అడ్డంగా బలిసిన ఎన్ని పందికొక్కుల్ని మీరు ఇప్పటివరకు పట్టి బోనులో పెట్టారు లెక్కలు చెప్పండి. గుర్తులేదా పోనీ కనీసం మీకు గుర్తు ఉన్నవి వేళ్ళ మీద లెక్కేసి చెప్పండి? కనీసం వేళ్ళ మీద లేక్కేసుకోడానికి కూడా ఎవరు కనపడటం లేదు కదా సర్..అవినీతి చేసినోడికి శిక్ష పడనపుడు వాడు మళ్ళీ చెయ్యి చాస్తాడు...మళ్ళీ డబ్బు కూడబెట్టుకుంటాడు, జల్సా చేస్తాడు..వాడి పుత్రరత్నాలు తాగి కార్లు వేసుకువచ్చి రోడ్ల మీద తిరుగుతూ జనాభాని తగ్గిస్తారు.. కొన్ని రోజులకి మళ్ళి దేశంలో నల్లదనం పెరుకుపోయింది అని ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన 2000 రూపాయల నోటు రద్దు చేసి 5000 నోట్లు, అ తర్వాత కొన్ని రోజులకి 10,000 రూపాయల నోట్లు రిలీజ్ చేస్తారా?
దీనివలన మాములు మనిషికి ఉపయోగం ఏంటి సర్? దిని వలన ఏ రైతుకి లాభం , ఏ నిరుద్యోగికి ఉపయోగం సర్? ఏ రోజైతే లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉద్యోగిని అప్పటికప్పుడు ఉద్యోగం ఉడపీకి వాడి ఆస్తులు జప్తు చేసి వాడిని నడిరోడ్డు మీదకి లాగుతారో, ఎప్పుడు అయితే అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన నాయకులని బొక్కలో తోసి మక్కెలు విరగ్గొట్టి పదవులు లేకుండా చేస్తారో? ఎప్పుడు అలాంటి ఒక చట్టం అమలులోకి తెస్తారో... అప్పుడు... అ రోజు మాములు రైతు లాభం సంపాదించుకుంటాడు..ఒక నిరుద్యోగి బాగుపడతాడు..మాములు మనిషి తాను సంపాదించిన దానితో తృప్తిగా బతుకుతాడు...
మీరు అలా చేస్తే మాలాంటి సామాన్యుడికి ఉపయోగం. అలా కాకుండా మీరు ఎన్ని సార్లు నోట్లు మార్చిన మీ ఖాజానాకి కోట్లు చేరతాయేమోగానీ మాలాంటి మాములోడికి ఏ ఉపయోగము ఉండదు. ఈ పని చేసి ఒక చాయ్ వాలాకి ఓటు వేసి మేము మంచిపని చేశాము అని గర్వపడేలా చేసి జనం గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతారో లేక మిగిలిన రాజకీయ నాయకులలాగా ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఇన్స్ టాంట్ కాఫీ లాగా ఇన్స్ టాంట్ మ్యాజిక్ లు చూపించి మిగిలిన నాయకుల్లాగా మిగిలిపోతారో మీ ఇష్టం.
ఇట్లు,
ఒక సగటు భారతీయుడు