తోక వంకర పాక్.... సరి'హద్దు' మీరుతూనే వుంది!
posted on Nov 24, 2016 @ 2:39PM
ఒకవైపు దేశం మొత్తం పాత నోట్లు, కొత్త నోట్లు అంటూ అల్లాడిపోతోంది. మోదీని సమర్థించే వారు నల్లధనం బటయకొస్తుంది అంటూ వాదన వినిపిస్తుంటే వ్యతిరేకించే వారు సామాన్యుల బాధలు ఏకరూవు పెడుతున్నారు. కాని, ఈ గందరగోళం మధ్యలోనే పాకిస్తాన్ తన పాప కార్యాలు చేసుకుంటూ పోతోంది. డీమానిటైజేషన్ కారణంగా మీడియాతో సహా ఎవరూ సరిహద్దు వద్ద హద్దులు మీరుతున్న శత్రుదేశాన్ని పట్టించుకోవటం లేదు...
పదే పదే కాల్పుల విరమణకు తెగబడే పాకిస్తాన్ మొన్నటికి మొన్న దారుణానికి దిగింది. తమ ఆర్మీ బాస్ మారటంతో ఉన్మాదం పెరిగిపోయి మన జవాన్లు ముగ్గుర్ని బలి తీసుకుంది. అందులో ఒకరి తలను కిరాతకంగా నరికారు పాక్ సైనికులు. ఒక దేశ అధికారిక సైన్యానికి చెందిన వారై వుండి ఇలాంటి అమానుష చర్యలు చేయటం కేవలం పాకీలకు మాత్రమే చెల్లుతుంది.
యూపీఏ ప్రభుత్వ కాలం నుంచీ మన సైనికుల తలలు నరకటం పాశవిక ఆనందంగా మారిపోయింది పాకిస్తాన్ ఆర్మీకి. అయితే, మోదీ పాలన వచ్చిన తరువాత ప్రతీకార దాడులు కూడా అదే రేంజ్లో జరుగుతున్నాయి. ఆ మధ్య జరిగిన ఉరీ ఉగ్ర దాడికి ప్రతీకారంగానే మన వాళ్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి రక్తానికి రక్తంతో జవాబిచ్చారు. అయినా పాక్ తోక వంకరగానే వుంటోంది. అందుకే, తాజాగా మరోసారి ముగ్గురు ఇండియన్ సోల్జర్స్ పై గన్నులు ఎక్కి పెట్టింది. అందుకు ప్రతి ఫలం కూడా అనుభవించింది. ఇండియన్ ఆర్మీ జరిపిన వివిధ భీకర దాడుల్లో చాలా ఆర్మీ పోస్టులు బూడిదయ్యాయి. అంతే కాదు, మన వారి లెక్కల ప్రకారం 8మంది పాక్ సైనికులు మరణించారు. మరి కొంత మంది సామాన్య పాక్ పౌరులతో కలిపి మొత్తం 14మంది హతమయ్యారు. ఈ దాడుల్ని పాక్ కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది...
వారంలో మూడు సార్లు మన డిప్యూటీ హై కమిషనర్ కు నోటీసులు ఇచ్చింది పాక్ ప్రభుత్వం. ఏ కారణం లేకుండా భారత్ తమ పై కాల్పులు జరుపుతోందని దొంగ ఏడుపులు ఏడుస్తోంది ఆ దేశం. అంతే కాదు, మన వారు చెప్పినట్టు 8 మంది సైనికులు అని ఒప్పుకోకున్నా ముగ్గురు హతమయ్యారని గుండెలు బాదుకోక తప్పలేదు నవాజ్ షరీఫ్ కి! అయితే, ఇంతగా నష్టం జరుగుతున్నా, తమ సైనికులు అకారణంగా ప్రాణాలు విడుస్తున్నా బుద్ది మాత్రం మార్చుకోలేదు పక్క దేశం పాలకులు. కాశ్మీర్ స్వాతంత్ర్య ఉద్యమానికి తమ మద్దతు కొనసాగుతుందని పాత పైత్యం మరో సారి ప్రదర్శించాడు నవాజ్ షరీఫ్!
మన సైనికులు మరణించాక ప్రతీకార దాడులు చేయటం కన్నా అసలు మన వైపు నుంచి ప్రాణ నష్టం సాధ్యమైనంత తక్కువగా వుండేలా చూస్తే బాగుంటుందంటున్నారు సామాన్య జనం. ఇందుకోసం మన ఆర్మీ మరింత అలెర్ట్ గా వుండటం అవసరం. కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా అంతే అవసరం.