ఇదో 'భక్తుడి' లేఖ...
posted on Nov 14, 2016 @ 2:58PM
ప్రియమైన ప్రధాని మోదీగారికి!
నమోన్నమః .... సార్ నేనెవరో తెలుసా? మీకు తెలిసే అవకాశం లేదు. కాని, నా చుట్టుపక్కల వున్నోళ్లు, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్లలో మేమంటే పడనోళ్లు... మోదీ భక్త్ అంటుంటారు! అంటే మిమ్మల్ని గుడ్డిగా సమర్థించే ఒకానొక తెగ అన్నమాట! పాపం మా ప్రత్యర్థులు మమ్మల్ని వెక్కిరించాలని భక్తులు అన్నారుగాని అది చివరికి గొప్ప బిరుదులా తయారైంది. ఇప్పుడు మేం ప్రౌడ్ టు బి మోదీ భక్త్ అని ప్రకటించుకుంటుంటాం! ఇక ఈ విషయం నుంచి అసలు విషయానికి వద్దాం...
మీరు చేసిన పనేమైనా బాగుందా మోదీగారూ? ఎందుకు ఎలాంటి క్లూ ఇవ్వకుండా 500, 1000 నోట్లు రద్దు చేశారు? కనీసం ఓ వారం రోజులు ముందు ప్రకటించాల్సింది! అప్పుడైతే నల్ల దొంగలు తమ డబ్బుల కట్టలకి సున్నం దట్టించి తెల్లగా మార్చుకునేవారు. ఇప్పుడు చూడండి... దిక్కుతోచక నదుల్లో పారేస్తున్నారు. కాల్చేస్తున్నారు. చెత్త కుప్పల్లో విసిరేస్తున్నారు. పాపం ఎంత కష్టపడి నొక్కేసినో దొంగ సొమ్మో మీకేమైనా తెలుసా అసలు? అయినా దొంగ సొమ్ము విలువ తెలియాలంటే మీ లాంటి నిజాయితీపరులకేం తెలుస్తుంది లెండి! మీకేమైనా ఇల్లా, పిల్లల్లా? సంసారుల బాధలు మీకెలా తెలుస్తాయి? కొందరు నల్ల సొమ్ము దాచిన కక్కుర్తిగాళ్ల లేఖితనం మీకెలా తెలుస్తుంది? అబ్బే! మీకు తెలియవు. మన దేశ ప్రధానుల్లో ఇంతగా డబ్బు కక్కుర్తి లేని అమాయక ప్రధానిని మిమ్మల్నే చూస్తున్నాం! ఇదంతా ఒక మోదీ భక్తుడిగా నా బాధనకుంటున్నారా? కానే కాదు... మోదీ అంటే గిట్టని బ్యాచ్ ఒకటి వుంది కదా... వాళ్ల విలాపం!
అయినా మోదీగారూ! అసలు మీరు బ్లాక్ మనీ ఎందుకు అరికట్టాలనుకున్నారు? దొంగ నోట్లు ఎందుకు నిర్మూలించాలనుకున్నారు? ఇదే ఇప్పుడు చాలా మంది సో కాల్డ్ లిబరల్ థింకింగ్ వున్న వాళ్ల కష్టం. నష్టం. దుఃఖం. ఇంతకు ముందు ప్రధానుల్లా మౌనంగా వుండి వుంటే ఎంతో బావుండేది. పాకిస్తాన్ నుంచి దొంగ నోట్లు వచ్చేవి. కాశ్మీర్లో రాళ్లు రువ్వే వాళ్ల చేతుల్లో పడేవి. మన సైనికులు, పోలీసుల తలలు రక్తంతో తడిసేవి. అంతేనా? పాకిస్తాన్ అచ్చేసిన దొంగ నోట్లు పట్టుకుని దేశంలో అచ్చోసిన అంబోతుల్లా ఆర్దిక ఉగ్రవాదులు తిరిగేవారు. ఇప్పుడు వారి కదలికలకి చాలా కష్టంగా వుంది. అంతే కాదు, దొంగ నోట్లు కాకుండా దొర నోట్లతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్జీవోలు, ఇంకా ఇతర సంస్థలు, ఆఖరుకు చిన్నా చితక రాజకీయ పార్టీలు... వీటన్నటికి ఇప్పుడు ఎంతగా ఒళ్లు మండిపోతోందో తెలుసా? మీరు చేసిన నిషేదం వల్ల మత మార్పిళ్లు మొదలు నక్సలైట్ల విప్లవాల వరకూ, ఎన్నికల్లో సారా ప్యాకెట్ల వరకూ ఏదీ కుదరటం లేదు! అంతా మీరే చేశారు... అంతా మీరే చేశారు!
పీఎంగారూ! మీ పేరు చెబితేనే అవార్డులు తీసుకుని రోడ్ల మీదకొచ్చే అసహనవాదులు ఇంకా బోలెడు కంప్లైంట్స్ తో వున్నారు ...
మీరు చేసిన నోట్ల రద్దుతో ఇంత కాలం పైసా పైసా కూడబెట్టుకుని కాపాడుకున్న నల్లధనం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతోంది. రియల్ ఎస్టేల్ దందాలు మొదలు రియల్ క్రైమ్స్ వరకూ ఎన్నో చేసి నానా గడ్డి తిని చీకట్లో పెట్టిన 500, 1000 ఇప్పుడు వెలుతురు చూసే ఛాన్సే లేకుండా పోయింది! నదుల్లోనో, కాల్వల్లోనో లేదా దేవాలయాల హుండీల్లోనో వేసేయాలి! ఇలాంటి పరిస్థితి తీసుకురావటం మీకు న్యాయమా? మీ దగ్గరే ఓ పాతిక కోట్లు నల్లధనం వుంటే ఇలా చేస్తారా? అందుకే, వచ్చే ఎన్నికల్లో నల్లదనం విలువ తెలిసిన వాడ్ని, స్వయంగా ఒక లక్ష కోట్లన్నా నల్లధనం వున్నవాడ్ని ప్రధానిగా ఎంచుకుంటాం! అప్పుడే దేశంలో ఎక్కడెక్కడో వున్న బ్లాక్ మనీకంతా రక్షణ వుంటుంది!
ఇలా ప్రతిజ్ఞలు చేస్తున్న గొప్ప ప్రజాస్వామిక వాదులు మిమ్మల్ని తుగ్లక్ తో పోల్చుటం మొదలు ఫ్రస్ట్రేషన్ లో బూతులు తిట్టడం వరకూ అన్నీ చేసేస్తున్నారు. ఏమన్నా అంటే... అసలు విషయాలైన దొంగ నోట్లు, నల్లధనం లాంటి మాటలు మాట్లాడకుండా పేదల్ని అడ్డుపెట్టుకుంటున్నారు! ఏటీఎంల దగ్గర , బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో వున్న వారి మీద ఎగబడి ఎగబడి సింపతీ చూపిస్తున్నారు! అసలు మన దేశంలోని మీడియాలో, మేధావుల్లో, పార్టీల్లో, కొందరు సామాన్య జనంలో, సోషల్ నెటిజన్స్ లో ఇంత సింపతీ వుందని మాకెప్పుడూ తెలియదు! బాహుబలి కోసం లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న జనం ఇప్పుడు వంద నోట్ల కోసం లైన్ లో వుండలేక స్పృహ తప్పిపోతున్నారట! అంతేనా, వెయ్యి రూపాయల పెన్సన్ ఇచ్చే ఆఫీస్ మొదలు వెయ్యి పెట్టి సినిమా చూసే మల్టీప్లెక్స్ దాకా అంతటా మొన్నటి దాకా అందరూ క్యూలు కట్టే వారు. ఇప్పుడు మాత్రం దేశ సంక్షేమం కోసం నోట్లు రద్దు చేస్తే కొత్తవి తీసుకోలేకపోతున్నారు. నరకం చూసేస్తున్నారు. అయినా దేవుడి కోసం పుష్కరాల్లో తొక్కిసలాటలో ఛస్తారు కాని... దేశం కోసం క్యూలు కడతారా? అబ్బే! అలాంటివి అస్సలు చేయరు!
మోదీ జీ! నిజంగా ఊళ్లలోని నిరు పేదలు, సిటీల్లోని పూట గడవని వాళ్లు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్లను మీరు ఎంత త్వరగా సమస్యల నుంచి బయటపడేస్తే అంత సంతోషం. కాని, సందట్లో సడేమియాల్లా ఈ ఇబ్బందికర సమయంలోనే కొందరు మీ మీదా, మీ భక్తులమైన మా మీద కసి తీర్చుకుంటున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ మొదలు ఈ గల్లీ గల్లీల్లోని కేడీల వరకూ వీళ్లందరిదీ ఒకే వాదన. సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారని. అందుకే, వెంటనే పాత నోట్లపై నిషేధం ఎత్తి వేయాలని! కొత్తవి తొందరగా అందుబాటులోకి తెమ్మనటం కాకుండా పాతవి అడుగుతున్నారంటేనే వీళ్ల దురుద్దేశం తెలుస్తోంది కదా? అసలు ఇబ్బంది బ్లాంక్ అయిపోయిన బ్లాక్ మనీ! ఆ విషయం మీకూ బాగా తెలుసు. అందుకే, గో అహెడ్... ఎలాగూ ఈ నల్లదనం పద్మవ్యూహంలోకి మీరు ప్రవేశించారు. మీ వెంట భక్తులు ఎలాగూ వుంటారు. పద్మవ్యూహాన్ని ఛేదించండి. దేశ ద్రోహులకు మీరు అభిమన్యుడిలా కనిపించే అర్జునుడని నిరూపించండి!
ఇట్లు
ఒక మోదీ భక్తుడు!