జన్‌ధన్ ఖాతాలకు అందుకేనా డబ్బులు
posted on Nov 21, 2016 @ 12:00PM
మోదీగారు పెద్దనోట్ల రద్దు గురించి ప్రకటన చేసి పది రోజులు దాటిపోయింది. రోజులు గడిచేకొద్దీ సర్దుకుంటుంది అనుకున్న సమస్య కాస్తా మరింత తీవ్రతరం దాల్చడం చూసి పాలకులకే అంతుచిక్కడం లేదు. బడాబాబుల సంగతేమో కానీ సామాన్యజనంలో మాత్రం ఈ పరిస్థితి ఆగ్రహాన్నే మిగులుస్తోంది. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే అయినా అందుకు తగినంత సన్నద్ధత లేకుండా వ్యవహరించిందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేలుగారు ప్రధానిని తప్పుదోవ పట్టించడం వల్లే ఇలా సీన్ రివర్స్ అయ్యిందన్న వార్తలు వెలువడ్డాయి.
రఘురామ్ రాజన్ వంటి సమర్థుడి స్థానంలో ఏరికోరి తెచ్చుకున్న ఉర్జిత్‌బాబు, ప్రధానికి తగిన దిశానిర్దేశం చేయలేకపోయారట. ఈ నేపథ్యంలో నోట్ల రద్దుతో ఏర్పడుతున్న చేదువార్తలతో పత్రికలన్నీ నిండిపోతున్నాయి. వైద్యం అందక ఫలానా ప్రాణం ఆగిపోయిందనీ, పొలం అమ్ముడుపోక ఫలానా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందనీ తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇక ఎంతకీ జరగని క్యూలు, ఎంతకీ తరగని పోలీసుల కాఠిన్యం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
బాహుబలి టికెట్ల కోసం కొట్టుకుచావలేదా? దేశం కోసం ఈమాత్రం త్యాగం చేయలేరా?... లాంటి ప్రశ్నలు వినిపిస్తున్నప్పటికీ ఈ కష్టం అకారణం అన్న విమర్శలు కూడా అదే స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఇప్పటిదాకా భాజపాకు అనుకూలంగా ఉన్న పేదవారు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారంటూ నిఘావర్గాలు సైతం ఒప్పుకోక తప్పడం లేదు. గోరుచుట్టు మీద రోకటి పోటులా ఇదే సమయంలో మాల్యా రుణాన్ని మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజలను మరింత రెచ్చగొట్టేలా ఉంది.
ఇలాంటి నేపథ్యంలో జీరోబ్యాలెన్స్ ఉన్న జన్‌ధన్ ఖాతాలలలో పదివేల రూపాయలు జమచేయనున్నారన్న వార్త ఒకటి చక్కెర్లు కొడుతోంది. దాదాపు ఆరుకోట్ల వరకూ ఉన్న ఇలాంటి ఖాతాలలో పదేసివేలు జమచేయాలంటే ప్రభుత్వం అరవైవేల కోట్ల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ముందు ఇదేమంత ఖర్చు కాదంటున్నారు నిపుణులు. ఇలాంటి తాయిలం వల్ల పేదలు తిరిగి తమ వైపు మొగ్గుచూపుతారన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. మరోపక్క ఇది బ్యాంకింగ్ వ్యవస్థను కూడా బలపరిచే సూచనలు ఉన్నాయి. ప్రజలకు ఖాతాలను నిర్వహించుకునే అలవాటు చేయడం వల్ల వారిని బ్యాంకుల వైపు తిప్పుకోవచ్చు.
జన్‌ధన్ ఖాతాలో వేలరూపాయల జమచేయడంతో పేదల ఆగ్రహం కొంతవరకు ఉపశమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చర్యతో, తమ మేలు కోసమే ప్రభుత్వం నల్లనోట్లని రద్దు చేసిందన్న నమ్మకం వారిలో కలగకతప్పదు. ఇక మధ్యతరగతివారి కోసం మోదీగారు ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారో చూడాలి. వారిని కూడా మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తారా లేకపోతే వారి కోపం తాటాకుమంటలా తాత్కాలికం అని పట్టించుకోకుండా వదిలేస్తారో అన్నది త్వరలోనే తేలిపోనుంది.