అంతర్జాతీయ పురుషుల దినోత్సవం... భారత వీర నారీ దివస్!
posted on Nov 19, 2016 @ 3:24PM
నవంబర్ 19... ఈ రోజుకి వున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవాళ్ల అంతర్జాతీయ పురుషుల దినోత్సవం! కాని, భారతదేశానికి సంబంధించినంత వరకూ అసలు సిసలు భారతీయ నారీ దివస్! ఎందుకలా అంటారా? ఇవాళ్ల జన్మించిన ఇద్దరూ వీర నారీమణుల్ని ఒక్కసారి తలుచుకుంటూ సరిగ్గా అర్థం అవుతుంది!
నవంబర్ 19న ఎవరు పుట్టారో తెలుసా? ఇందిరా గాంధీ! అవును, ఇప్పటి వరకూ మన దేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానుల్లో ఎంత వివాదాస్పదురాలో అంత ధృఢ సంకల్పం కూడా గల ధీర వనిత! ఆమె గురించి రాజకీయంగా వినిపించే విమర్శలు పక్కన పెడితే ఆమె తన పదవి కాలంలో చేసిన గొప్ప పనులు చాలా వున్నాయి. ముఖ్యంగా, బ్యాంకుల్ని రాత్రికి రాత్రి జాతీయం చేసిన ఆమె తెగువ ఇప్పటి మన ఆర్దిక రంగ పటిష్ఠతకి నేరుగా కారణం. బ్యాంకుల్ని ఇందిర జాతీయం చేయకపోయి వుంటే ఇవాళ్ల మన ఆర్దిక పరిస్థితి మరోలా వుండేది. అలాగే, ఆమె అత్యంత సాహసంతో బంగ్లాదేశ్ ను విడదీసి పాక్ ను రెండు ముక్కలు చేసి వుండకపోతే మనం ఈ రోజు మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్లం. కేవలం పశ్చిమాన మిగిలి వున్న పాకిస్తానే మనకు ఎన్నో సమస్యలు సృస్టిస్తోంది. అదే పాక్ బంగ్లాదేశ్ ప్రాంతాన్ని కూడా కలుపుకుని తూర్పున వుండి వుంటే మనం ఇరువైపులా సతమతం అయ్యేవాళ్లం. ఇక ఇందిరా గాంధీ చేసిన మరో గొప్ప పని ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పారేయటం. అందుకు ఆమె ప్రాణాల్నే బలిచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా ఆమె త్యాగం వల్లే ఇవాళ్ల పంజాబ్ ఖలిస్తాన్ కాకుండా భారత్ లో అంతర్భాగంగా మిగిలి వుంది!
తన నిర్ణయాలతో ఆధునిక భారతదేశాన్ని ఎన్నో విధాల ప్రభావితం చేసిన ఇందిర ఎమర్జెన్సీ ద్వారా శాశ్వత అపకీర్తి కూడా మూటగట్టుకుంది. ఇక ఇదే రోజు జన్మించిన ... జాతిని ప్రభావితం చేసిన మరో మహిళా మణిపూస ఝాన్సీ లక్ష్మీ భాయి. ఈమెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాని, దురదృష్టవశాత్తూ మన పాఠ్యపుస్తకాలు లక్ష్మీభాయి గురించి చెప్పాల్సినంతగా చెప్పవు. ఆమె బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక రాణి అంటూ అందరికీ తెలుసు. కాని, అంతకంటే ఇంకా ఎక్కువగా ఎవ్వరికీ ఏమీ తెలియదు. అదే విషాదం. భారతదేశంలో ఒకప్పుడు సతీ లాంటి అమానుష ఆచారాలు అమలులో వుండేవి. స్త్రీల మీద దారుణమైన అణిచివేత వుండేది. కాని, అదే సమయంలో భారతీయ సమాజం ఝాన్సీ లక్ష్మీ భాయి లాంటి పోరాట యోధురాల్ని ప్రపంచానికి అందించింది. ఆమె యుద్ధ రంగంలో దిగి సివంగిలా వేటాడింది. ఇది మన దేశానికి వున్న మరో కోణం. అంతా అనుకున్నట్టు ఇక్కడ స్త్రీ ఎప్పుడూ అణిచివేతకు, దోపిడీకీ మాత్రమే గురికాలేదు. ఎన్నో రంగాల్లో ఎంతో సాధించింది. ఝాన్సీ లక్ష్మీ భాయి అందుకు గొప్ప ఉదాహరణ...
ఇందిరా గాంధీ, ఝాన్సీ లక్ష్మీ భాయి ... ఒకే తేదీ నాడు జన్మించిన ఈ ఇద్దరూ దేశానికి గర్వకారణం. అంతకంటే ముఖ్యంగా, భారతీయ సమాజంలో స్త్రీకిచ్చిన స్వేచ్ఛా, సమానత్వం, ప్రాముఖ్యత... వీటన్నటికీ గొప్ప ఉదాహరణలు!