మోడీఫయింగ్ ఇండియా
posted on Jun 6, 2014 @ 10:01PM
భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ ఆ పదవి ఎంత శక్తివంతమయినదో తన చేతల ద్వారా నిరూపించి చూపుతున్నారు. అధికారం చేప్పట్టిన తొలి రోజు నుండే గత పదేళ్లుగా నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్నిలేపి పరుగులు పెట్టిస్తున్నారు.
పోలవరం ముంపు గ్రామాలు ఆంద్రప్రదేశ్ లో విలీనం, నల్లదనం వెలికితీతకు సిట్ కమిటీ ఏర్పాటు, కొన్ని మంత్రివర్గాలను విలీనం చేసి మంత్రుల సంఖ్యను కుదించడం, ప్రభుత్వానికి పెనుభారంగా మారిన అనేక జీ.ఓ.యం.లను రద్దుచేసి, అధికారాలను తిరిగి కేంద్రమంత్రి వర్గానికి దఖలుపరచడం, దేశంలో మౌలికవసతుల మెరుగుపరచడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల మంజూరులో జాప్యం నివారించేందుకు నిర్దిష్ట సమయం నిర్ణయించడం వంటివి కేవలం వారం రోజుల వ్యవధిలోనే మోడీ చక్కబెట్టడం చూస్తే, ఆయనకు, డా. మన్మోహన్ సింగు పనితీరులో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా కనబడుతోంది. ప్రధానమంత్రి సమర్దుడయితే పరిపాలన ఎంత గొప్పగా చేయవచ్చో నరేంద్ర మోడీ అప్పుడే ఆచరణలో చూపిస్తున్నారు.
అది చూసి కాంగ్రెస్ పార్టీ యంపీ శశీధరూర్ మోడీని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. కానీ మోడీ ఏమాత్రం అతిశయానికిపోకుండా, తమ యంపీలకు కూడా కర్తవ్యం బోధించారు. ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాలులో తమ పార్టీ ఎంపీలతో సమావేశమయిన ప్రధాని మోడీ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, “ఇప్పుడు మనం ప్రతిపక్షంలో లేమనే సంగతి అందరూ గుర్తుంచుకొని మెలగాలి. ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకొన్నామని గాలిలో తేలిపోకుండా రెండు కాళ్ళు బలంగా భూమిమీద ఉండేలా చూసుకోండి. అనవసర ఆర్బాటాలకు పోకుండా, మీ నియోజక వర్గాల ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను పరిష్కరించి, మీ ప్రాంతాలను అభివృద్ధికి ఏమేమి చేయాలో అవసరమయిన పూర్తి సమాచారంతో అధికారులతో, మంత్రులతో తరచూ సమావేశాలకు హాజరవ్వండి. ఆవిధంగా చేయడం వలన అనేక సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా మీకు కూడా వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది. ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, వారి సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధి అనే మూడు సూత్రాల ఆధారంగా మీరందరూ పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. అధికారంలో ఉన్నందున మీడియా ముందుకు వచ్చి పార్టీ గురించి, ప్రభుత్వం గురించి అనవసరమయిన విషయాలు మాట్లాడకుండా కేవలం మీమీ నియోజక వర్గాలలో ఉండే సమస్యల గురించి మాత్రమే మాట్లాడమని నేను అభ్యర్ధిస్తున్నాను. అందరూ కూడా కేవలం అభివృద్ధినే అజెండాగా తీసుకొని పనిచేస్తే అనతికాలంలోనే దేశంలో అద్భుతమయిన ప్రగతి సాధించగలము.”
బహుశః మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ఏనాడు కూడా తన యంపీలకు ఈవిధంగా కర్తవ్య భోధన చేసి ఉండరు. ఆ అవకాశం ఉన్న సోనియాగాంధీ తిరిగి పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాలి? అధికారం ఎలా సంపాదించుకోవాలి? అనే హితబోధ చేసారు తప్ప, ఈవిధంగా యంపీలకు కర్తవ్యం భోదించలేదు. అవకాశం దొరికితే రాజకీయాలలో నైతిక విలువలు, దేశాభివృద్ధి, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంటూ లెక్చర్లు దంచే రాహుల్ గాంధీ కూడా ఏనాడు తన పార్టీ నేతలకు ఈవిధంగా దిశానిర్దేశం చేయలేదు.
కానీ మోడీ తన పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని పాలించే ప్రధాని ఏవిధమయిన నాయకత్వలక్షణాలు, ఆత్మవిశ్వాసం, దృడసంకల్పం, సమున్నత లక్ష్యాలు కలిగి ఉండాలో చాటి చెపుతున్నారు. తద్వారా ప్రజలలో, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక వేత్తలలో ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడేలా చేయగలుగుతున్నారు. అందుకే గత పదేళ్లుగా డీలాపడిన రూపాయి మళ్ళీ బలం పుంజుకొంది. గత పదేళ్లుగా నత్తనడకలు నడుస్తున్న షేర్ మార్కెట్ ఇప్పుడు గుర్రంలా పరుగులు తీస్తోంది. ఈ సానుకూల మార్పులు కేవలం మోడీ సమర్ధత కారణంగానే కలుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగకుండా అటువంటి సమర్ధుడు, నాయకత్వలక్షణాలు గల నాయకుడిని ఎన్నుకొన్న భారతీయుల విజ్ఞతకు ప్రపంచమంతా అభినందనలు తెలుపుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా భారత్ ను ‘మోడి’ఫయింగ్ ఇండియా’ అని వర్ణిస్తోంది.