ఆ హీరో ఎవరిని వరిస్తాడు?
posted on Jun 20, 2014 @ 10:48PM
రెండు రోజుల క్రితం ప్రముఖ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ మేనేజింగ్ డైరక్టర్ మరియు సి.ఈ.ఓ. పవన్ ముంజల్ బ్రెజిల్ దేశంలో జరిగిన కంపెనీ సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ దక్షిణ భారతదేశంలో కూడా ఉత్పత్తి సంస్థను స్థాపించేందుకు తగిన ప్రాంతాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ఆయన చేసిన ఈ ప్రకటన గురించి తెలియగానే రాష్ట్రభివృద్ధిలో పోటీపడుతున్న ఆంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ సంస్థను తమ రాష్ట్రానికి రప్పించేందుకు వెంటనే రంగంలో దిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరులో ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన శ్రీ సిటీ వద్ద లేదా చెన్నైకి సమీపంలో ఉన్న నెల్లూరులో గానీ కంపనీ స్థాపనకు అవసరమయిన భూమిని, తగిన అన్ని సౌకర్యాలను అందజేస్తామని తెలుపుతూ కంపెనీ యాజమాన్యానికి ఈ మెయిల్ ద్వారా కబురు పంపింది. అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వం కూడా మెదక్ జిల్లాలో జహీరాబాద్ వద్ద కంపెనీకి స్థలం, ఇతర సౌకర్యాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని కబురు పంపారు. అయితే ఇంతవరకు కంపెనీ నుండి రెండు ప్రభుత్వాలకు ఎటువంటి జవాబు రాలేదు.
హీరో మోటోకార్ప్ కి ప్రస్తుతం హర్యానాలో గుర్ గావ్, దరుహీర వద్ద రెండు ఉత్పత్తి సంస్థలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ వద్ద ఒకటి ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో హలోల్ వద్ద రూ.1100 కోట్ల వ్యయంతో ఒకటి, రాజస్థాన్ లో నిమ్రాణ వద్ద రూ.400 కోట్ల వ్యయంతో మరొకటి నిర్మించబడిన రెండు సంస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇప్పుడు తమ ఆరవ ఉత్పత్తి కేంద్రం దక్షిణాదిన స్థాపించాలని హీరో మోటోకార్ప్ భావిస్తుండటంతో ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఆ సంస్థను ఎలాగయినా తమ రాష్ట్రానికి రప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
హీరో మోటోకార్ప్ సంస్థ తన ఆరవ యూనిట్ ను స్థాపించి తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏడాదికి 12 మిలియన్లకు పెంచుకోవాలని భావిస్తోంది. అంటే ఒక్కో సంస్థ సగటున రెండు మిలియన్ మోటార్ సైకిళ్ళను ఉత్పత్తి చేస్తుందని భావిస్తే, అంత భారీ ఉత్పత్తి సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధిపొందే అవకాశం ఉందన్నమాట. ఇక అటువంటి పెద్ద సంస్థ కనుక రాష్ట్రానికి వచ్చినట్లయితే, దానికి అనుబంద పరిశ్రమలు అనేకం వస్తాయి. ఆ పరిశ్రమలతో బాటు స్టార్ హోటల్స్, సరికొత్త వ్యాపార సమస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి వలన విద్య, వైద్య, ఉపాధి, వ్యాపారాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అందువలన ఈ సంస్థను తమ రాష్ట్రానికే రప్పించేందుకు దక్షిణాదిన ఐదు రాష్ట్రాలు పోటీ పడవచ్చును. తమిళనాడు, కర్నాటకలు ఇప్పటికే మంచి పారిశ్రామిక అభివృద్ధి సాధించాయి గనుక ఆ రెండు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణాలకు గట్టి పోటీ ఇవ్వవచ్చును. ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలయిననత త్వరగా ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే, ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ సులువుగా గెలిచే అవకాశం ఉంటుంది. లేకుంటే మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పోటీ పడకతప్పదు.