రైల్వే చార్జీలపై కాంగ్రెస్ డబుల్ గేమ్
posted on Jun 22, 2014 @ 10:29AM
రైల్వే చార్జీల పెంపుపై దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగిపోతోంది. ఇక వామపక్షాలు సరేసరి. ఇటువంటి పోరాటాలలో అవెప్పుడూ ముందే ఉంటాయి. కాంగ్రెస్ హాయంలో అన్నీ ధరలు పెరిగిపోయాయని, వాటి నియంత్రణకు యూపీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చెప్పట్టలేదని, ఎన్నికల సమయంలో యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నరేంద్ర మోడీ అధికారం చేప్పట్టి నెలరోజులు కూడా కాక ముందే ఒకే సారి భారీగా రైల్వే చార్జీలను పెంచేయడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే మాట వాస్తవం. అయితే ప్రజలు మోడీ సమర్ధతపై, ప్రభుత్వంపై చాలా భారీగా ఆశలుపెట్టుకోనందునే మరింత నిరాశ, ఆందోళనలకు గురవుతున్నారని చెప్పవచ్చును.
గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా రైల్వే చార్జీలను చాలా సార్లు పెంచింది. కానీ అప్పుడు ప్రజలు, ప్రతిపక్షాల నుండి ఇంతగా వ్యతిరేఖత రాలేదు. కారణం అప్పుడు యూపీఏ ప్రభుత్వం రైల్వే చార్జీలను కొద్దిగా పెంచి, వేరే విధంగా ఆ డబ్బును ప్రజల ముక్కు పిండి వసూలు చేసేది. అదీగాక ప్రజలను చల్లబరిచేందుకు ముందు కొత్త ఎక్కువ మొత్తం వడ్డించి, వారు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేసిన తరువాత కొంచెం తగ్గించడం ఒక ఆనవాయితీగా మార్చేసింది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఒకేసారి రైల్వే చార్జీలను భారీగా పెంచేసి, కాంగ్రెస్ పాటించిన ఆ ఆనవాయితీని పాటించేందుకు సిద్దపడక పోవడంతో సహజంగానే ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరింత రెచ్చగోడుతోంది.
నిజానికి, రైల్వే బోర్డు ఫిబ్రవరి5,2014న సరుకు రవాణపై 5శాతం, ప్రయాణికుల చార్జీలను 10శాతం పెంచేందుకు యూపీయే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా వాటిలో సరుకు రవాణా చార్జీల పెంపును ఏప్రిల్ 1 నుండి, ప్రయాణికుల చార్జీలను మే 1నుండి పెంచేందుకు నాటి రైల్వే మంత్రి మాల్లిఖార్జున్ ఖార్గే నాటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ను కలిసారు. ఈ పెంపు ద్వారా రైల్వేలకు రూ. 7900 ఆదాయం కలుగుతుందని రైల్వే మంత్రి లెక్కలు కట్టి చూపించడంతో వాటిని అమలుచేసేందుకు ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేసారు. అయితే ఆ రెండు రకాల చార్జీల పెంపును కూడా మే1 నుండి అమలుచేయమని ఆదేశించారు.
కానీ ఆ తరువాత ఎన్నికల కోలాహలం మొదలయిపోవడంతో ఎన్నికలకు ముందు రైల్వే చార్జీలను పెంచితే అది ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని, మోడీకి మరో బలమయిన ఆయుధం అందించినట్లవుతుందని భావించి యూపీయే ప్రభుత్వం అప్పుడు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు, అమలు చేయలేదు. ఒకవేళ యూపీయే కూటమి ఎన్నికలలో గెలిచి ఉండి ఉంటే ఈ పాటికి 15శాతం పెంపు నిర్ణయం అమలులోకి వచ్చి ఉండేదన్నమాట. మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా రైల్వే చార్జీల పెంపుని నిరసిస్తూ నిరసనలు, ఆందోళనలు చేయడాన్ని ఏవిధంగా చూడాలి?
కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయాన్నే మోడీ ప్రభుత్వం అమలు చేసిందని వితండవాదం చేసి మోడీని వెనకేసుకు రావడం కాదిది. కాంగ్రెస్ పార్టీ రైల్వే చార్జీలను పెంచాలని నిర్ణయించినపుడు దానిని అదే ఇప్పుడు ఎందుకు వ్యతిరేఖిస్తోంది అనేదే ప్రశ్న? నోరు విప్పితే రాజకీయాలలో నీతి నిజాయితీ, నైతిక విలువలు, పార్టీలో, పద్దతులలో సమూల ప్రక్షాళన అంటూ లెక్చర్లు దంచే రాహుల్ గాంధీ కూడా తమ పార్టీ ఈవిధంగా ద్వంద వైఖరి అవలంభిస్తుంటే ఎందుకు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు? వంటి ప్రశ్నలకు కాంగ్రెస్ అధిష్టానం జవాబు చెప్పవలసి ఉంది.