మీన మేషాలు లెక్కిస్తున్న మంత్రులు
posted on Jun 14, 2014 @ 11:06AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం చాలా నిజాయితీగా రేయింబవళ్ళు కష్టపడతామని మంత్రులందరూ మీడియాను పిలిచి మరీ చెపుతున్నారు. వారు అటువంటి ఆలోచన చేస్తున్నందుకు చాలా సంతోషమే. కానీ జూన్ 10న వారికి చంద్రబాబు మంత్రిత్వ శాఖలు కేటాయించినప్పటికీ, వారిలో ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించలేదు. వారందరికీ హైదరాబాదు సచివాలయంలో ‘జే’ మరియు ‘యల్’ బ్లాకులలో మొత్తం 15 గదులు కేటాయించబడ్డాయి. కానీ ఎవరెవరికి ఏ గది అనేది ఇంకా నిర్ణయించబడనందున మంత్రులెవరూ నేటికీ బాధ్యతలు స్వీకరించలేదు. ఉన్నతాధికారులు, ఉద్యోగుల విభజనలో ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలనే అంశంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతుండటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబందించిన ఫైళ్ళ వెతుకలాట మరికొంత అయోమయ పరిస్థితిని సృష్టిస్తోంది. కానీ, పనిచేయాలనే తపన ఉన్నవారికి ఇదొక అవరోధం కాదని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు తన ఇంటి వద్ద నుండే పని మొదలుపెట్టి నిరూపిస్తున్నారు.
ఆయనను చూసి స్ఫూర్తి పొంది వెంటనే రంగంలో దిగవలసిన మంత్రులు, కార్యాలయం కేటాయింపు కోసం ఎదురు చూస్తుంటే, మరి కొందరు మంచి ముహూర్తం కోసం జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. జూన్ 2న రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇది జరిగి ఇప్పటికి సరిగ్గా 12రోజులయింది. కానీ ఇంతవరకు మంత్రులెవరూ బాధ్యతలు తీసుకోలేదు, అధికారికంగా పనీ మొదలు పెట్టలేదు.
కానీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తొలిరోజు నుండే అంటే జూన్ రెండునే తెలంగాణా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ క్షణం కూడా వృధా చేయకుండా అదే రోజు తన కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రంగంలో దిగిపోయారు. అదేవిధంగా తెలంగాణా మంత్రులందరూ కూడా వెంటనే బాధ్యతలు స్వీకరించి సంబందిత శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ పనులు మొదలు పెట్టేసారు. తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలయి నాలుగయిదు రోజులయిపోయింది. అన్నీ అమరిఉన్నతెలంగాణా ప్రభుత్వం ఉరుకుల పరుగుల మీద పనులు చేసుకుపోతుంటే, సవాలక్షా సమస్యలున్నఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు మీడియా ముందుకు వచ్చి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు తప్ప బాధ్యతలు చెప్పట్టడానికి మాత్రం ఇంకా మీనా మేషాలు లెక్కబెట్టడం చాలా హాస్యాస్పదం.
రాష్ట్ర మంత్రుల పరిస్థితి ఇలాగుంటే, శాసన సభ్యులయితే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కారణం శాసనసభ సమావేశాలు ఇంకా మొదలవక పోవడమే. ఈనెల 19న శాసనసభ సమావేశాలు మొదలవుతాయని సమాచారం. కానీ అవెక్కడ నిర్వహిస్తారో ఇంకా స్పష్టత లేదు. నిజానికి అవి హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపబడ్డ శాసనమండలి భవనంలో నిర్వహించవలసి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికయిన సభ్యులు తాము తమ స్వంత రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరుకొంటున్నట్లు తెలుస్తోంది. అందువల్ల సమావేశాలు నిర్వహించుకొనేందుకు రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, రాజమండ్రీ, తిరుపతి, కర్నూలులో తగిన భవనాల కోసం వెతుకులాట మొదలయింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (మే 8న) వెలువడి ఇప్పటికి నెల దాటింది. రాష్ట్రం ఏర్పడి 12 రోజులయింది. రాష్ట్ర విభజన కారణంగా ప్రభుత్వ శాఖలలో అనేక పనులు నిలిచిపోయాయి. అందువలన ప్రజలు అనేక సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అయినా ఇంతవరకు మంత్రులు పని మొదలు పెట్టలేదు. వారు ఇదేవిధంగా మరొక వారం పది రోజులు కాలక్షేపం చేసినట్లయితే అప్పుడు మీడియానే స్వయంగా ప్రజల తరపున వారిని నిలదీయడం తధ్యం. అటువంటి పరిస్థితి చేజేతులా తెచ్చుకోకుండా మంత్రులందరూ తక్షణమే బాధ్యతలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.