కాంగ్రెస్ ఓడిపోలేదు, అభ్యర్ధులే ఓడిపోయారుట
posted on Jun 17, 2014 @ 11:16PM
ఏపీసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశాలలో పాల్గొన్న పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ ఓటమికి ఎవరూ ఊహించలేని విధంగా నిర్వచించారు. ఎన్నికలలో కేవలం అభ్యర్ధులే ఓడిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని ఒక సరికొత్త నిర్వచనం చెప్పారు. అంతేకాదు ఎన్నికలలో ఓడిపోతామని తెలిసినా పార్టీ పరువు నిలిపేందుకే ఎన్నికలలో పోటీ చేసామని అందుకు తాను చాలా గర్వపడుతున్నానని చెప్పారు. ఎన్నికలలో తామందరం ఓడిపోతామని రాహుల్ గాంధీకి ముందే చెప్పామని చెప్పిన సంగతిని కూడా ఆయన ఈరోజు పార్టీ సమావేశంలో బయటపెట్టారు.
రఘువీరా చెప్పినట్లు కాంగ్రెస్ ఓడిపోకపోతే ఆ పార్టీ మరెందుకు కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రాలేకపోయింది? రాష్ట్ర విభజన కారణంగా సీమాంద్రాలో పార్టీకి ఓటమి తప్పదని కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసనే సంగతి ప్రజలకీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. కానీ అదే కాంగ్రెస్ కి చెందిన కొందరు నేతలు వేరే పార్టీలలోకి మారినప్పుడు వారిని మాత్రం ప్రజలు గెలిపించారు. అంటే ప్రజలు కాంగ్రెస్ నేతలను కాక కాంగ్రెస్ పార్టీనే ద్వేషిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్న వివేకానంద రెడ్డి సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని చాలా కసితో ఓడించారని నిజం చెప్పారు.
పార్టీ తరపున ఒక్క యంపీ, యం.యల్యే కూడా గెలవకపోయినా, ప్రజలు తమ తరపున ప్రభుత్వంతో పోరాడే భాద్యత తమకు అప్పగించారని రఘువీరా చెప్పుకోవడం మరొక గొప్ప జోక్. కాంగ్రెస్ నేతలెవరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టే అర్హత లేకుండా ప్రజలు తీర్పునిచ్చారు. అందుకు అవమానంతో తలదించుకోవలసింది పోయి, తమ ఓటమికి అందమయిన నిర్వచనాలు, కుంటి సాకులు వెదుకుతున్నారు.
పాము తన పిల్లలను తానే మింగినట్లుగా సీమాంధ్రలో స్వంత పార్టీ నేతల రాజకీయ జీవితాలను, పార్టీని, చివరికి ప్రజల జీవితాలని కూడా పణంగా పెట్టి తెలంగాణా ఇచ్చినా అక్కడ కూడా కాంగ్రెస్ ఎందుకు గెలవలేకపోయింది? ఇంతకీ అక్కడ ఓడింది కాంగ్రెస్ పార్టీనా? అభ్యర్దులా? తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నేతలు అధికారం దక్కించుకోలేకపోయినా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ప్రతిపక్ష హోదా దక్కించుకొన్నందుకు చాలా సంతోషపడ్డారు. మళ్ళీ షరా మామూలుగానే ప్రతిపక్ష నేత పదవి కోసం కూడా నిసిగ్గుగా కీచులడుకొన్నారు.
ఇక కేంద్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. అక్కడా ప్రతిపక్ష హోదాకు అవసరమయిన 54 యంపీలు లేకపోవడంతో, ప్రతిపక్ష హోదా కోసం బీజేపీని బ్రతిమాలుకోవలసిన దుస్థితి. ఆ పరిస్థితుల్లో సోనియా, రాహుల్ గాంధీలు పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చెప్పట్టడానికి వెనుకంజవేసారు.
ఇటువంటి దుస్థితిని చూసి కాంగ్రెస్ నేతలు గర్వపడవచ్చేమో కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద జాలి పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు తమ ఓటమికి నిజాయితీగా జవాబులు కనుగొనే ప్రయత్నం చేసి ఉంటే, ఇటువంటి సమీక్షా సమావేశాలకి ఒక అర్ధం ఉండేది. కానీ చక్కగా మాటల గారడీ చేసుకొని అభ్యర్ధులే ఓడిపోయారు, పార్టీ కాదని ఆత్మవంచన చేసుకొంటే దాని ప్రజలేవరూ అభ్యంతరం చెప్పరు. వారిని చూసి నవ్వుకొంటారు అంతే!