ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య సమన్వయం కలేనా?
posted on Jun 20, 2014 9:13AM
పీపీఏల రద్దుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అవాంఛనీయమయిన యుద్ధం కొనసాగుతోంది. రెండు ప్రభుత్వాలు ఈసమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, కవ్వింపు మాటలతో యుద్ద వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకు ప్రధానకారణం రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలు విషయంలో తీవ్ర ఇబ్బందులు, విమర్శలు, ఒత్తిళ్ళు ఎదుర్కోవడమే అయి ఉండవచ్చును. సాధారణంగా అధికార పార్టీలు ఇటువంటి సమస్యలు ఎదురయినప్పుడు ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని వేరే ఇతర అంశాల మీదకు మళ్ళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక బహుశః ఇది కూడా అటువంటి ప్రయత్నమే అనుకోవాల్సి ఉంటుంది.
రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని పదేపదే చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ నుండి పంపిణీ అయ్యే విద్యుత్ మీదే తెలంగాణా రైతన్నలు పూర్తిగా ఆధారపడి పంటలు సాగుచేసుకొంటున్నారని తెలిసిఉనప్పటికీ, తెలంగాణకు ఇచ్చే విద్యుత్ లో కోతపెట్టాలని ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం కాదు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించమని కూడా కాదు. విద్యుత్ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించుకోవచ్చునో కూడా బాగా తెలుసు. కనుక ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చేందుకే గట్టిగా ప్రయత్నించాలి. లేకుంటే వ్యవసాయ రుణాలమాఫీ వంటి ఇతర అంశాలపై నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఆయన కూడా కేసీఆర్ లాగ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించవచ్చును.
ఇక ఉద్యమపార్టీ అయిన తెరాస, ఇప్పుడు బాధ్యతాయుతమయిన అధికార పార్టీగా మెలిగేందుకు ప్రయత్నించాలి తప్ప, “మీరు ఒకటి చేస్తే మేము రెండు చేస్తాము, ఆంద్ర మంత్రుల ఇళ్ళకు విద్యుత్ నిలిపి వేస్తాము” వంటి బెదిరించడం మంచిపద్దతి కాదు. ఉద్యమకాలంలో తెరాస నేతలు తమ లక్ష్యం సాధించేందుకు ఏ విధంగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ప్రజలు అధికారం కట్టబెట్టారు గనుక చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, వ్యవహరించాలి.
తెదేపా, తెరాసలు రాజకీయంగా ఒకదానినొకటి ఎంత వ్యతిరేఖించుకొన్నా ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అధికారం చేపట్టిన తరువాత కూడా రెండు ప్రభుత్వాల వలే కాకుండా ఇంకా రాజకీయ పార్టీలలాగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షించారనే సంగతిని గ్రహిస్తే మంచిది. ఇంకా ఇటువంటి అనేకం సమస్యలను రెండు ప్రభుత్వాలు మున్ముందు ఎదుర్కోవలసి ఉంది. అటువంటప్పుడు ఈ సమస్యల శాశ్విత పరిష్కారానికి నిపుణులతో కూడిన కమిటీలు వేసుకోనో లేక ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చల ద్వారానో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి తప్ప చీటికి మాటికీ కేంద్రం వద్దకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టుకొంటే తెలుగు ప్రజల పట్ల అందరికీ మరింత చులకన భావం ఏర్పడుతుంది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు ప్రజలు ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నారు. కనుక ఇకనయినా రెండు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్యలన్నిటినీ రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.