వైకాపా ఓటమికి జగన్ శల్యసారధ్యమే కారణమా?
posted on Jun 17, 2014 @ 10:32AM
వైకాపా ఓటమికి జగనే ప్రధాన కారకుడని ఇటీవల ఆ పార్టీని వీడిన దాడి వీరభద్రరావు ఆరోపించారు. కానీ కర్ణుడు చావుకి వంద కారణాలున్నట్లే, వైకాపా ఓటమికి కూడా అన్ని కారణాలున్నాయి. అందులో జగన్ కూడా ఒక కారణం మాత్రమే. చంద్రబాబు తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడితే, జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గెలుపై ధీమాతో తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు వ్యవహరించారని దాడి విమర్శించారు. అనేక సర్వే నివేదికలు “వైకాపా విజయం తధ్యం, జగన్ ముఖ్యమంత్రి అవడం అంతకంటే తధ్యం” అని ముక్తకంటంతో ఘోషించడమే ఆయన ధీమాకు కారణమని చెప్పవచ్చును. కానీ అటువంటి పరిస్థితులలో కూడా చంద్రబాబు ఏ మాత్రం తొణకకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోగా, జగన్ శల్యసారధ్యంతో వైకాపా ఓటమి పాలయింది.
ఈ ఓటమి వల్ల తామేమీ కొత్తగా పోగొట్టుకోన్నది లేదని చెప్పేందుకు ‘తమ పార్టీ అధికారంలో ఉండి ఓడిపోలేదని’ అని జగన్ అన్నారు. అయితే అదే సూత్రం తేదేపాకు కూడా వర్తిస్తుందని ఆయన మరిచిపోయారు. తెదేపా గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొంది. చంద్రబాబు నాయుడు పార్టీలో అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి పూర్తి వ్యతిరేఖ పరిస్థితులలో కూడా పార్టీని విజయంవైపు నడిపించి తన నాయకత్వ లక్షణాలు మరొకమారు నిరూపించుకొంటే, అనుకూల పరిస్థితుల్లో కూడా జగన్ శల్యసారధ్యం చేసి పార్టీని ఓడించుకొన్నారు. అందువల్ల తెదేపా విజయానికి చంద్రబాబు ఏవిధంగా కారకుడో, వైకాపా ఓటమికి జగన్ కారకుడని చెప్పక తప్పదు.
ఇక చంద్రబాబు, జగన్ అనుసరించిన వ్యూహాలు కూడా ఆ పార్టీల గెలుపోటములకు మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చును. ఆంధ్రాకు సంబందించినంత వరకు చూసుకొన్నట్లయితే, చంద్రబాబు విమర్శలను లెక్కచేయకుండా విజయవకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోగా, జగన్ ప్రజలందరూ రాష్ట్రాని విడదీసిన కాంగ్రెస్ పార్టీని, కేసీఆర్ ను వ్యతిరేఖిస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ వారిరువురితో రహస్య సంబంధం కొనసాగించారు. అదొక తప్పయితే, దానిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల ముందు ఎండగడుతున్నప్పుడు కూడా జగన్ సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో వారి ఆరోపణలను అంగీకరించినట్లయింది. ఇది మరో పెద్ద పొరపాటు.
తన ప్రత్యర్ధి బీజేపీతో పొత్తులు పెట్టుకొంటుంటే అప్రమత్తవవలసిన జగన్, ఒకసారి తమ పార్టీ మతత్వత పార్టీలకు మద్దతు ఈయదని, మరొకసారి ఇస్తుందని, ఇంకోసారి థర్డ్ ఫ్రంటుకే మద్దతు ఇస్తుందని ప్రకటిస్తూ తన అయోమయ పరిస్థితిని స్వయంగా చాటుకోవడంతో, ఆ పార్టీపై ప్రజలలో ఒక అపనమ్మకం ఏర్పడింది. ఇక చంద్రబాబు బీసీలను, కాపులను దగ్గరకు తీసుకొని వారికే ఉపముఖ్యమంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రకటించి, ఆ వర్గాల ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకోగలిగారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడే అప్రమత్తమయి ఉండాల్సి ఉంది. కానీ గెలుపై ధీమాతో అతను బీసీలు, కాపులనే కాదు చివరికి పార్టీలో నేతలను కూడా పట్టించుకోలేదు. ఈమాటన్నది పైవాళ్ళు కాదు, ఆ పార్టీకే చెందిన దాడి వీరభద్ర రావు.
ఈ కారణాలకు తోడు ప్రజలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల సామర్ద్యం, అనుభవం, ‘ట్రాక్ రికార్డ్’, కేంద్రంతో సంబందాలు వంటి అనేక అంశాలను కూడా ప్రజలు చక్కగా బేరీజు వేసుకొని వైకాపాను తిరస్కరించారు.
సాధారణంగా పార్టీ ఓటమి తరువాత ఏ రాజకీయ పార్టీ అయినా దానిని హుందాగా స్వీకరించి, తమ ఓటమికి గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో ఆత్మవిమర్శ చేసుకొంటుంది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం వచ్చే ఎన్నికలలో వైకాపా తప్పకుండా 162 సీట్లు గెలుచుకొంటుందని నిర్దిష్ట సంఖ్యతో సహా ఇప్పుడే జోస్యం చెప్పడం మరో విశేషం. ఎన్నికలకు నెలరోజుల ముందు తన పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమయిన జగన్మోహన్ రెడ్డి, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల ఫలితాల గురించి ఇప్పుడే జోస్యం చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది. ఆయన తన ఆ కల నెరవేర్చుకోవాలంటే, ఇప్పటి నుండి వచ్చే ఐదేళ్ళ వరకు ఏవిధంగా ముందుకుసాగాలో ఆలోచించుకొంటే మేలేమో!