కేసీఆర్ కి నిరసనలు, బాబుకి సహకారం
posted on Jun 12, 2014 @ 11:11PM
ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రులిరువురూ కూడా వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారంలో చిక్కుకొని పైకి చెప్పుకోలేని ఇబ్బంది అనుభవిస్తున్నారు. అయితే తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉంది గనుక ఈవిషయంలో చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ పరిస్థితే కొంచెం మెరుగుగా ఉందని అర్ధమవుతోంది. అయితే అది వ్యవసాయ రుణాలన్నిటినీ తీర్చేసేంత లేదు గనుక ఆయన చిన్న మెలికపెట్టారు. దానితో తెరాస ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అప్పుడే తెలంగాణాలో నిరసనలు మొదలయ్యాయి.
చంద్రబాబు కూడా వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెట్టినప్పటికీ, ఆయన చాల తెలివిగా దానికి ఒక కమిటీని వేసి, దానికో 45 రోజులు గడువుపెట్టి తనకు సమయం ఏర్పాటు చేసుకొన్నారు. అంటే ఈవిషయంలో కేసీఆర్ కంటే చంద్రబాబే చాలా లౌక్యం ప్రదర్శించినట్లు అర్ధమవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టి వ్యవసాయ రుణాలపై తన నిర్ణయం ప్రకటించి ప్రజల నుండి నిరసనలు ఎదుర్కొంటుంటే, చంద్రబాబు 45రోజుల గడువు తీసుకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎటువంటి నిరసన తెలుపకపోవడం విశేషం.
ఎందువలన అంటే, ఇంతవరకు ఆంద్ర పాలకులు, రాజకీయ నేతలు తెలంగాణా ప్రజలను దోచుకొన్నారని, తెలంగాణా ఏర్పడితే ఇక సమస్యలన్నీ మంత్రదండం వేసినట్లు మాయమయిపోతాయని కేసీఆర్ తెలంగాణా ప్రజలకు బాగా నచ్చ జెప్పగలిగారు. ఇప్పుడు కేసీఆరే స్వయంగా పాలిస్తున్నారు గనుక, ఇక ఆంద్ర వాళ్ళను నిందించదానికి అవకాశం లేదు. మంచయినా చెడయినా బాధ్యత కేసీఆర్ దే అవుతుంది. అందుకే ఆయన నిరసనలు ఎదుర్కోవలసి వస్తోంది.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఫైలుపై సంతకం కూడా చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు గనుక, ఆయనేదో మంత్రం దండం తిప్పేసి రాత్రికి రాత్రే వేల కోట్ల వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేసేస్తారని ఎవరూ అత్యాశకు పోలేదు. అందువలన ఈ విషయంలో అయన కూడా తప్పకుండా ఏదో ఒక మెలిక పెట్టవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత మాఫీ చేసి తమను రుణభారం నుండి విముక్తులను చేస్తారనే ఆశ రైతులలో ఇంకా మినుకు మినుకు మంటూనే ఉంది.
సంపద సృష్టించడంలో ఆయనకున్న అనుభవం, కార్యదక్షత, ప్రధాని మోడీ, మరియు కేంద్రమంత్రులందరితో ఆయనకున్న సత్సంబంధాలు, ఆకారణంగా మోడీతో సహా అందరూ కూడా రాష్ట్రాన్ని అదుకొంటామని ప్రజా సమక్షంగా పదేపదే భరోసా ఇవ్వడం వంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. అందుకే ఒక్క ప్రతిపక్ష పార్టీలు తప్ప మరెవరూ నిరసనలు తెలియజేయలేదు. అయితే ఆయన స్వయంగా 45రోజులు గడువు విధించుకొన్నారు గనుక అంతవరకు ఆయనకు తాత్కాలిక ఉపశమనంగానే భావించవచ్చును. అప్పటికి ఆయన ఏదో విధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొ౦నవలసి ఉంటుంది. లేకుంటే ఆయన కూడా కేసీఆర్ లాగే విమర్శలు ఎదుర్కోవడం తధ్యం.