చంద్రునికి పట్టాభిషేకం
posted on Jun 8, 2014 @ 7:10PM
దేశంలో, రాష్ట్రంలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అప్పుడు ఏ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారం చేపడుతుందా? అనే ఆసక్తి తప్ప ప్రజలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలపై ఎటువంటి గొప్ప ఆశలు ఉండేవి కావు. ఎందువలన అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులలో ఎటువంటి మార్పురాదనే ఒక రకమయిన నిరాశ ప్రజలలో నెలకొని ఉండటమే కారణం. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో మాత్రం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యావత్ దేశ ప్రజలందరూ కూడబలుకొన్నట్లు, చాలా కసితో, చాలా ఆశతో అవినీతికి అసమర్ధతకు మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీని దించి, కేంద్రంలో నరేంద్ర మోడీని, ఆంధ్రాలో చంద్రబాబును, తెలంగాణాలో కేసీఆర్ లకు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు.
గత అరవై ఏళ్లలో రాజకీయ పార్టీలపై, చివరికి ప్రభుత్వాలపై కూడా ఎటువంటి నమ్మకం పెట్టుకోకుండా, ఏమీ ఆశించకుండానే ఓటేస్తూ వచ్చిన భారతీయలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈసారి కోటి ఆశలతో బీజేపీ, తెరాస, తెదేపాలకు ఏరికోరి ఓటేసి గెలిపించుకొన్నారు. గత అరవై ఏళ్లుగా దేశప్రజలందరూ ఎటువంటి అభివృద్ధికోసం కళ్ళుకాయలు కాసేలా చూస్తున్నారో, దానిని వారు ముగ్గురు కూడా ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించి చూపడమే కాకుండా దానిని నిజం చేసి చూపుతామని వారు ఇచ్చిన భరోసాయే ప్రజలను వారికి ఓటేయించింది. అందుకే వారి ముగ్గురిపై ప్రజలలో చాలా భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి.
ఇక మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కొలువు తీరి అప్పుడే కార్య రంగంలో దిగాయి గనుక, ఇక అందరి దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రీకృతమయి ఉన్నాయి. ఆయన తమను రుణవిముక్తులను చేస్తారని అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పాలనను, గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను ఆయన తిరిగి గాడిలో పెడతారని త్రిశంకు స్వర్గంలో నలిగిపోతున్న మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాజధాని కూడా లేని దుస్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మించి ఇస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతిలో చిల్లి గవ్వ లేదని తెలిసినప్పటికీ, అపార పరిపాలనానుభావం, కృషి, పట్టుదల, కేంద్రంతో సత్సంబందాలు అన్నీ ఉన్న చంద్రబాబు తప్పకుండా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, మళ్ళీ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతారని ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు.
కోటి ఆశల నడుమ, కోటి సమస్యల నడుమ, శత కోటి సవాళ్ళ నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపడుతున్న చంద్రబాబు నాయుడు సమర్ధతకు, సార్యదక్షతకు ఇదొక పెద్ద సవాలు. సమస్యలెదురయినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటిని తన సమర్ధతను నిరూపించుకొనేందుకు వచ్చిన అవకాశాలుగా స్వీకరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. ఆ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పదం, కార్యదక్షతలను చూసే ప్రజలు నేడు ఆయనకు పట్టం కడుతున్నారు.
ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకొందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడుగారికి, ఆయన మంత్రివర్గ సభ్యులందరికీ తెలుగువన్ శుభాభినందనలు తెలియజేస్తోంది.